వైద్యం.. దైవాదీనం!

ABN , First Publish Date - 2022-04-16T05:55:23+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం దైవాదీనం అవుతోంది. టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. కీలక విభాగాల్లో వైద్యులు సెలవులో ఉండడం, మరికొన్ని పోస్టులు భర్తీకాకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 200 పడకలు గల ఈ ఆస్పత్రిని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 జనవరి 26న ప్రారంభించారు. కానీ, సేవలు మాత్రం కానరావడం లేదు.

వైద్యం.. దైవాదీనం!
టెక్కలిలో నూతన జిల్లా ఆసుపత్రి

- గర్భిణులకు తప్పని కష్టాలు

- ఎనస్తీషియా లేక నిలిచిన శస్త్రచికిత్సలు

- వైద్యుల సెలవులపై కానరాని స్పష్టత

(టెక్కలి/టెక్కలి రూరల్‌) 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం దైవాదీనం అవుతోంది. టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. కీలక విభాగాల్లో వైద్యులు సెలవులో ఉండడం, మరికొన్ని పోస్టులు భర్తీకాకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 200 పడకలు గల ఈ ఆస్పత్రిని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 జనవరి 26న ప్రారంభించారు. కానీ, సేవలు మాత్రం కానరావడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఈ నెల 6న ఈ ఆస్పత్రిని మరోసారి ప్రారంభించారు. ఇప్పుడూ అదే పరిస్థితి. వైద్యం కోసం బాధితులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. సుమారు రూ.27కోట్లతో నిర్మించిన ఆస్పత్రి భవనాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేక వైద్యనిపుణులు లేక సేవలు గగనమవుతున్నాయి. ఆస్పత్రి భవనాల ప్రారంభోత్సవానికి అధికారపార్టీ నేతలు చూపిన చొరవ.. ప్రత్యేక వైద్యనిపుణుల భర్తీ విషయంలో కొరవడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత ఆస్పత్రి నుంచి కొత్త ఆస్పత్రికి మారేందుకు అనేక సాంకేతిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. జిల్లా కేంద్రాసుపత్రిలో 50 రోజులుగా గైనకాలజీ సేవలు నిలిచిపోయాయి. గతంలో గైనిక్‌ విభాగం, ఓపీ, ఐపీ విభాగాలు నిత్యం రద్దీగా ఉండేవి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వైద్యులు లేక విభాగాలన్నీ బోసిపోతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు గైనకాలజిస్ట్‌లు ఉన్నా..  ప్రధానంగా ఎనస్తీషియా పోస్టు భర్తీ చేయకపోవడంతో ప్రసూతి విభాగంలో పూర్తిగా వైద్యసేవలు నిలిచిపోయాయి. ఇటీవల ఇక్కడి నుంచి ఐదుగురు ప్రధాన వైద్యులు సివిల్‌ సర్జన్లుగా పదోన్నతిపై ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వారి స్థానాలు భర్తీ చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. గర్భిణులకు సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.  కొన్ని సందర్భాల్లో గర్భిణులు సాధారణ ప్రసవమయ్యే పరిస్థితి ఉన్నా.. వైద్య నిపుణులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై సూపరింటెండెంట్‌ కణితి కేశవరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఎనస్తీషియా, ఇతర వైద్యులు లేక ఇబ్బందులు తలెత్తున్నాయనే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. 


సెలవులో వైద్యులు:

- ఆస్పత్రిలో కీలక విభాగాలైన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జిన్‌, జనరల్‌ మెడిసన్‌ స్థాయి వైద్యాధికారుల్లో ఏడుగురు వైద్యులు సెలవులో ఉన్నారు. హెచ్‌.కిషోర్‌దొర, ఎం.గాయత్రి, జీఈసీ విద్యాసాగర్‌, ఏ.అజయ్‌కుమార్‌, ఏ.మేఘన, బి.రమణారావు, ఎం.జయలక్ష్మీ అనే ఏడుగురు వైద్యులు సెలవులో ఉండడంతో ఇక్కడ సాధారణ ఓపీ, ఐపీ సేవలకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ వైద్యులు ఎప్పుడు విధుల్లో చేరుతారనేది స్పష్టత లేదు. 

- టెక్కలి జిల్లా ఆస్పత్రికి రెగ్యులర్‌ ఎనస్తీషియాగా ఉన్న డా.జె.భాస్కరరావు కొన్నేళ్ల కిందటే డిప్యూటేషన్‌పై పాలకొండ వెళ్లిపోయారు. 

- తర్వాత ఇక్కడ ఎనస్తీషియాగా సేవలు అందించిన డాక్టర్‌ పి.శంకర్‌ ప్రసాద్‌ ఇటీవల పదోన్నతిపై పాడేరు బదిలీ అయ్యారు. 

- ఇటీవల శ్రీకాకుళం నుంచి బదిలీపై వచ్చిన ఎనస్తీషియా వైద్యనిపుణులు డాక్టర్‌ జీఈసీ విద్యాసాగర్‌ ఫిబవ్రరి 18న విధుల్లో చేరారు. మార్చి 12 నుంచి సెలవులో ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో కీలకమైన శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. 


Updated Date - 2022-04-16T05:55:23+05:30 IST