బదిలీల బేరం

ABN , First Publish Date - 2022-06-30T05:03:34+05:30 IST

రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ జిల్లా ఉన్నతాధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఓ పక్క రాజకీయ ప్రమేయంతో పాటు.. మరోపక్క రెవెన్యూశాఖ మంత్రి జిల్లాకు చెందినవారే కావడంతో బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. రెవెన్యూశాఖలో ఓ అధికారిని కానీ, సాధారణ ఉద్యోగిని కానీ బదిలీ చేయాలంటే ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన బదిలీల ప్రక్రియ పూర్తి కాగా.. రెవెన్యూశాఖలో మాత్రం కసరత్తు జరుగుతోంది.

బదిలీల బేరం

రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న కసరత్తు
కోరుకున్న స్థానం కోసం పైరవీలు
(కలెక్టరేట్‌, జూన్‌ 29)

రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ జిల్లా ఉన్నతాధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఓ పక్క రాజకీయ ప్రమేయంతో పాటు.. మరోపక్క రెవెన్యూశాఖ మంత్రి జిల్లాకు చెందినవారే కావడంతో బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. రెవెన్యూశాఖలో ఓ అధికారిని కానీ, సాధారణ ఉద్యోగిని కానీ బదిలీ చేయాలంటే ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన బదిలీల ప్రక్రియ పూర్తి కాగా.. రెవెన్యూశాఖలో మాత్రం కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌/జూనియర్‌ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, టైపిస్ట్‌లు వంటి ఇతర సిబ్బందికి ఈ సారి భారీగా బదిలీలు కానున్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం కాలపరిమితి దాటిన ప్రతి ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొందరు జిల్లాలో కీలక నాయకులను ఆశ్రయించి తమకు కావాల్సిన స్థానాలకు బదిలీ చేసుకునేందుకు పైరవీలు సాగిస్తున్నారు. ఇందుకోసం రూ.లక్షల్లో బేరసారాలు చేస్తున్నారు. కలెక్టరేట్‌లోని కీలక విభాగ అధికారులతో పాటు మరికొందరు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు బదిలీ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 20 మంది తహసీల్దార్లు, 48 మంది డిప్యూటీ తహసీల్దార్లకు బదిలీ చేయనున్నట్టు సమాచారం. సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్లు (ఆర్‌.ఐ)లు 70 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 20 మందికి బదిలీ కానుంది. 240 నుంచి 246 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు, ముగ్గురు టైపిస్టులకు, ఒక ఆఫీస్‌ సబార్డినేట్‌కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సుమారు 400 మందికి స్థానచలనం కలుగనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం జిల్లా ఉన్నతాధికారులు బదిలీల జాబితాను వెల్లడించనున్నారు. రాజకీయ సిఫారసులకు తలొగ్గుతారా.. లేక ఉద్యోగులకు న్యాయం చేస్తారా? అనేది వేచిచూడాలి.  

 

Updated Date - 2022-06-30T05:03:34+05:30 IST