ప్రజల్లో చైతన్యం రావాలి

ABN , First Publish Date - 2022-12-31T23:54:07+05:30 IST

ఆహారపు అలవాట్లు, జీవనశైలి పట్ల ప్రజల్లో చైతన్యం రావాలని.. అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు.

 ప్రజల్లో చైతన్యం రావాలి
బొరివంకలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ఇచ్ఛాపురం రూరల్‌/కవిటి: ఆహారపు అలవాట్లు, జీవనశైలి పట్ల ప్రజల్లో చైతన్యం రావాలని.. అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జెమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఇచ్ఛాపురం మండలం ఈదుపురం, కవిటి మండలం బొరివంక పీహెచ్‌సీ ఆవరణలో వైద్య శిబిరం, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఉద్దాన ప్రాంతంలోనే కాకుండా అన్ని చోట్ల కిడ్నీ వ్యాధులు ఉన్నాయని, వాటికి భయపడకూడదని చెప్పారు. తరచూ రక్త పరీక్షలు చేయించుకొని ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తించగలిగితే తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. ప్రతిరోజూ తగినంత మోతాదులో నీరు తీసుకోవాలని సూచించారు. డయాలసిస్‌ రోగులకు పింఛన్‌ రాకపోతే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తెలియ జేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.మీనాక్షి మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని పీహెచ్‌సీల్లో రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందని, 37 రకాల మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సోంపేట సీహెచ్‌సీకి అదనంగా 6 డయాలసిస్‌ యూనిట్లు మంజూరైనట్లు చెప్పారు. కొత్తగా జిల్లాలో అక్కుపల్లి, కంచిలి, బెలగాం, ఇచ్ఛాపురానికి 36 మిషనరీలు అందిస్తున్నామని, పాతవి మరో 88 ఉన్నట్లు చెప్పారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ కె.విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. మూత్రపిండాల వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆహారపు నియమాలు పాటించాలని, వారానికి ఐదు సార్లు వ్యాయామం వంటివి చేయాలని, ధూమ పానం, ఖైనీ, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు, జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.రవిశంకర్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రాము, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:54:07+05:30 IST

Read more