ఒక్కడే దేవుడు.. మూడు రూపాలు
ABN , First Publish Date - 2022-12-15T23:55:56+05:30 IST
ఏ దేవాలయంలోనైనా దేవుడు ఒక్క రూపంలోనే దర్శనమి స్తుంటాడు. కానీ సోంపేట మండలం పలాసపురం గ్రామంలో కొలువైన కపిలేశ్వర విరంచి నారాయణస్వామి మాత్రం వేర్వేరు కాలాల్లో వేర్వేరు రూపాల్లో భక్తులకు దర్శనమి స్తోంటాడు. సాధారణ రోజుల్లో శివుడిగా, ధనుర్మాసంలో బ్రహ్మగా, పుష్యమాసంలో విష్ణువుగా పూజలందుకోవడం విశేషం.
సోంపేట రూరల్: ఏ దేవాలయంలోనైనా దేవుడు ఒక్క రూపంలోనే దర్శనమి స్తుంటాడు. కానీ సోంపేట మండలం పలాసపురం గ్రామంలో కొలువైన కపిలేశ్వర విరంచి నారాయణస్వామి మాత్రం వేర్వేరు కాలాల్లో వేర్వేరు రూపాల్లో భక్తులకు దర్శనమి స్తోంటాడు. సాధారణ రోజుల్లో శివుడిగా, ధనుర్మాసంలో బ్రహ్మగా, పుష్యమాసంలో విష్ణువుగా పూజలందుకోవడం విశేషం. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో బ్రహ్మగా పూజలందుకునేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాచీనమైన ఈ కపిలేశ్వరాలయాన్ని దేవతలే నిర్మించారని స్థానికుల నమ్మకం. అజ్ఞాతవాసం గడిపేందుకు పాండవులు మహేంద్ర గిరులపైకి వచ్చారని, వారు అనుకోకుండా కపిల అనే గోవు (ఆవు)ను సంహరించారని, ఆ గోవు కపాలం పలాసపురంలో పడిందని, అందుకే ఇక్కడి శివుడిని కపిలేశ్వరుడుగా పిలుస్తారని స్థల పురాణంలో ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపాలుగా ఈ దేవాలయంలో మూడు లింగాలు ఉన్నాయి. ఆయా మాసాల్లో విశిష్టతను బట్టి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండడం ఆచారంగా వస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.