ఇసుక మాయం

ABN , First Publish Date - 2022-09-24T04:58:36+05:30 IST

పలాస నియోజకవర్గంలో ఇసుక నిల్వలు మాయమయ్యాయి. ఈ ప్రాంత ప్రజల కోసం కోసంగిపురం ఆర్‌ఆర్‌ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపు నుంచి సుమారు 10వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక విశాఖకు అక్రమంగా తరలిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇసుక మాయం
ఇసుక నిల్వలు తరలించడంతో ఖాళీగా కనిపిస్తున్న కోసంగిపురం ర్యాంపు

- ప్రభుత్వ అవసరాల పేరు చెప్పి.. విశాఖకు అక్రమ రవాణా
- మరో 10వేల టన్నుల నిల్వలు ఉన్నా.. విక్రయించేందుకు ఆంక్షలు
- కొరత సాకుగా చూపి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులు
- ఆందోళనలో భవన నిర్మాణదారులు
(పలాస)

పలాస నియోజకవర్గంలో ఇసుక నిల్వలు మాయమయ్యాయి. ఈ ప్రాంత ప్రజల కోసం కోసంగిపురం ఆర్‌ఆర్‌ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపు నుంచి సుమారు 10వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక విశాఖకు అక్రమంగా తరలిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌ల బాధ్యతను జేపీ కంపెనీకి అప్పగించింది. కంపెనీ నిర్వాహకులు పలాస ర్యాంపులో రెండు చోట్ల 20వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను విక్రయించేందుకు సిద్ధం చేశారు. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ‘నాడు-నేడు’లో భాగంగా పాఠశాలలకు, జగనన్న ఇళ్ల నిర్మాణానికి అనుమతుల మేరకు ఉచితంగా ఇవ్వాలి. మిగిలిన ఇసుక టన్ను రూ.920 చొప్పున విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఏడాదిగా విక్రయాలు సాగాయి. ఈ క్రమంలో పది రోజుల కిందట ప్రభుత్వం ఇసుకరీచ్‌లను జేపీ సంస్థ నుంచి కేకేఆర్‌ సంస్థకు అప్పగించింది. కాగా.. నిల్వ చేసిన ఇసుకలో 10వేల మెట్రిక్‌ టన్నులు నాడు-నేడు, జగన్న కాలనీలకు ఇచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ ఇసుకను విశాఖపట్నం తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పనులకు అందులో సగం ఇసుక సరిపోతుంది. కానీ వేల టన్నుల్లో ఇసుకను ఎక్కడ ఇచ్చారన్నది స్పష్టంగా లేకపోవడంతో అనుమానాలకు దారితీస్తోంది. కేవలం వారం వ్యవధిలో పది వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఏ విధంగా నిర్మాణానికి తరలించారో నిర్వాహకులే సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం జేపీ సంస్థ ఈ ప్రాంతంలో లేదు. కొత్తగా కేకేఆర్‌ సంస్థ ఇక్కడకు వచ్చింది. వారి ప్రతినిధులే ఉద్యోగులుగా ఉన్నారు. ప్రస్తుతం ర్యాంపులో 10 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ఇసుక నిల్వలు ఉన్నాయి. అవి ప్రైవేటు, ప్రభుత్వ అవసరాలకు సరిపోతాయి. కానీ కంపెనీ నిర్వాహకులు మారడంతో పది రోజుల నుంచి ఇసుక విక్రయించడం లేదు. కేవలం డీడీలు ఉన్నవారికి, నాడు-నేడు, జగనన్న కాలనీలకు మాత్రమే ఇసుక ఇస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త కంపెనీ మారడం వల్ల ఇసుక ఇబ్బందులు వచ్చాయని, రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు.

కొరతతో.. ఇక్కట్లు
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటితోపాటు పలాస నియోజకవర్గంలో వేలాది ప్రైవేటు భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. వీటికి ఇసుక కావాలంటే కోసంగిపురం రీచ్‌ మాత్రమే అవసరాలు తీరుస్తోంది. దీన్ని బంద్‌ చేయడంతో నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఒడిశాలోని కటక్‌ నుంచి ఇసుక తెప్పించి.. టన్ను రూ.1,250 నుంచి రూ.1,400 వరకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పలాస మార్కెట్‌లో మిగిలిన భవన నిర్మాణ సామగ్రి కంటే ఇసుక ధరలే అధికంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇసుక కొరత కారణంగా మున్సిపల్‌ అభివృద్ధి పనులు కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా.. మాయమైన ఇసుక వ్యవహారాన్ని రీచ్‌లో ఉద్యోగుల వద్ద ప్రస్తావించగా.. తాము కొత్తగా వచ్చామని, గతంలో ఉన్న పరిస్థితి తమకు తెలియదని వివరించారు. తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా ఈ సమస్య తన దృష్టికి రాలేదని తెలిపారు. కొత్త కాంట్రాక్టర్లు రావడం వల్ల ఇబ్బందులు ఉండవచ్చని, అన్నీ సమసి పోతాయన్నారు.

 

Read more