కొత్త మెనూ.. కష్టమే
ABN , First Publish Date - 2022-12-16T23:33:45+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనపథకానికి సంబంధించి జగనన్న గోరుముద్ద పేరుతో అమలవుతున్న కొత్త మెనూపై వంట ఏజెన్సీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో కొత్త మెనూ అమలు చేయడం కష్టమేనని నిర్వాహకులు చెబుతున్నారు.
- పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
- లబోదిబోమంటున్న వంట ఏజెన్సీలు
- మధ్యాహ్న భోజనం పథకం తీరిది
(ఇచ్ఛాపురం)
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనపథకానికి సంబంధించి జగనన్న గోరుముద్ద పేరుతో అమలవుతున్న కొత్త మెనూపై వంట ఏజెన్సీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో కొత్త మెనూ అమలు చేయడం కష్టమేనని నిర్వాహకులు చెబుతున్నారు. గత నెల 21 నుంచి కొత్త మెనూ అమల్లోకి రాగా.. తమపై ఆర్థికభారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2580 పాఠశాలల్లో 1.88 లక్షల మంది విద్యార్థులకు వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. మార్కెట్లో కూరగాయలు, ఇతర నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే విద్యార్థులపై ప్రభుత్వం వెచ్చిస్తున్న మెనూ మొత్తం సరిపోవడం లేదని ఏజెన్సీల నిర్వాహకులు అంటున్నారు. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థిపై రూ. 5.45 చొప్పున భోజన ఖర్చు లెక్కించి బిల్లులు చెల్లించేవారు. ఇటీవల పెంచిన మెనూ ప్రకారం మొత్తం రూ.5.88కి పెరిగింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గతంలో రూ. 8.17 చొప్పున ఇస్తుండగా.. కొత్త మోనూ ప్రకారం రూ. 8.57గా నిర్ణయించారు. విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టాలంటే మార్కెట్ ధరలతో పోల్చితే కనీసం రూ.15 అయినా చెల్లించాలని నిర్వాహకులు అంటున్నారు. అన్నం, ఆకు కూరలు, పప్పు, చిక్కీలతో కూడిన భోజనం అందించాలంటే తమపై అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు. కొత్త మెనూను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఏజెన్సీ నిర్వాహకుల బిల్లులను మాత్రం స్వల్పంగా పెంచిందని ఆరోపిస్తున్నారు. బిల్లులు సకాలంలో రాక అప్పుల పాలవుతున్న తరుణంలో కొత్త మెనూ గుదిబండలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మెనూ రోజుకో విధంగా తయారు చేసి పెట్టడం మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా మార్పురావాలి. వంట చేసే వారికి కనీస వేతం అమలు చేయాలి. సకాలంలో మెనూ బిల్లులు, వేతనాలు చెల్లించినప్పుడే పాఠశాలల్లో అన్ని పక్కాగా అమలు చేయగలం’ అని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట చేయడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మెనూ ధరలు పెంచాలని కోరుతున్నారు.
కొత్త మెనూ ఇదే
సోమవారం: వేడి పొంగలి, ఉడకపెట్టిన గుడ్డు/కూరగాయల పలావ్, గుడ్డు కూర, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమోట, దొండకాయ పచ్చడి, ఉడకబెట్టిన గుడ్డు. చిక్కీ
బుధవారం: కూరగాయ అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
గురువారం: సాంబారు అన్నం, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కీ
శనివారం: ఆకు కూర అన్నం, సాంబారు, తీపి పొంగలి
భారమవుతోంది
మధ్యాహ్న భోజనం మెనూ పెంచడం అభినందనీయమే. కానీ ఏజెన్సీ కార్మికుల బిల్లుల తక్కువ మొత్తంలో పెంచడం వల్ల అదనపు భారం పడుతోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలి.
- జే.ఉమ, వంట ఏజెన్సీ సభ్యురాలు, స్వేచ్ఛావతి ఎస్‌హెచ్‌జీ గ్రూప్
..................
ఫిర్యాదులు రాలేదు
కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని ఏజెన్సీలకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు సకాలంలో భోజనాలు సరఫరా చేయాలి. తనిఖీల సమయంలో ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు లేవు. బిల్లులు విషయంలో కాస్త ఆలస్యం తప్ప ఎక్కడా ఇబ్బంది లేదు.
- కె.అప్పారావు, ఎంఈవో, ఇచ్ఛాపురం