లంచమిస్తేనే బిల్లు

ABN , First Publish Date - 2022-05-22T05:14:32+05:30 IST

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిలో జూనియర్‌ అకౌంట్‌ అధికారి (జేఏవో) అనపాన జానకిరావు శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. మునిసిపల్‌ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి బిల్లుల మంజూరు కోసం రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

లంచమిస్తేనే బిల్లు
ఏసీబీకి పట్టుబడిన జానకిరావు(వృత్తంలో), ప్రక్కన డీఎస్పీ రమణమూర్తి

కాంట్రాక్టర్‌ను డిమాండ్‌ చేసిన పలాస జేఏవో
రూ.15వేలు తీసుకుంటూ ఏసీబీ చిక్కిన వైనం
పలాస, మే 21:
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిలో జూనియర్‌ అకౌంట్‌ అధికారి (జేఏవో) అనపాన జానకిరావు శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. మునిసిపల్‌ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి బిల్లుల మంజూరు కోసం రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళభద్రకు చెందిన కాంట్రాక్టర్‌ రంది రవికుమార్‌ గత ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.3.75లక్షల విలువైన పనులు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ డబ్బులు ఆయన ఖాతాలో జమచేయాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై రెండు రోజుల కిందట రవికుమార్‌ జేఏవో అనపాన జానకిరావును ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వడం కుదరదని, ఇటీవల తనకు ఖర్చులు ఎక్కువయ్యావని, రూ.15వేలు నగదు ముందుగా ఇస్తే తాను బిల్లులు పెడతానని జానకిరావు లంచం డిమాండ్‌ చేశారు.  దీంతో రవికుమార్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సూచన మేరకు శనివారం మధ్యాహ్నం భోజనం అనంతరం జానకిరావు చాంబర్‌కు వెళ్లి నగదు ఇవ్వగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.  జానకిరావు నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకొని  ఆయనను అరెస్టు చేశారు. విశాఖ ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నారు.

 రూ.30 లక్షల బిల్లులు పెండింగ్‌
కాంట్రాక్టర్‌ రవికుమార్‌కు సంబంధించి  రెండేళ్ల నుంచి రూ.30 లక్షల వరకు వివిధ పనుల  బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని బిల్లులకు క్లియరెన్స్‌ ఇచ్చినా అధికారులు మాత్రం  కౌంటింగ్‌ కేంద్రాల్లోని మౌలిక వసతుల బిల్లు చెల్లింపునకు మోకాలడ్డుతున్నారు. తనకు బిల్లులు చెల్లించడం లేదని, తన సమస్య పరిష్కరించాలని ఆయనతో పాటు మునిసిపల్‌ కాంట్రాక్టర్లంతా రాజకీయ నాయకుల వద్ద మొరపెట్టుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ముడుపులు ఇస్తే గానీ బిల్లులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మునిసిపల్‌ కార్యాలయంలో ఆడిట్‌ నిర్వహించగా వారికి రూ.3.50 లక్షల వరకు తమ సొంత డబ్బులు ఖర్చయ్యాయని, దీన్ని ఎవరి నుంచి రికవరీ చేయాలని ఓ ఉన్నతాధికారి ఒక కాంట్రాక్టర్‌కు బహిరంగంగానే  తెలియజేసి డబ్బులు డిమాండ్‌ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కూడా ఆ కాం ట్రాక్టర్లు ఏసీబీ అధికారులకు సూచన ప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. మొత్తం రూ.ఐదు కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు మునిసిపాలిటీ నుంచి అందాల్సి ఉంది. ఇళ్లలో సామగ్రి అమ్మి నాలుగు డబ్బులు వస్తాయని ఎంతో ఆశతో కాంట్రాక్టులు చేస్తుంటే అధికారులు మాత్రం డబ్బులు ఇవ్వనిదే ఏ పని చేయడంలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
 

ప్రాథేయ పడినా కనికరించలేదు
బిల్లులు పెట్టాలని జేఏవో జానకిరావును అనేక సార్లు ప్రాథేయపడినా కనికరించలేదని కాంట్రాక్టర్‌ రంది రవికుమార్‌ విలేకరులకు తెలిపారు. ‘వివిధ పనులకు సంబంధించి నాకు రూ.30 లక్షల మేర బిల్లులు రావాల్సి ఉంది. బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి.. పనులు చేయగా.. అధికారులు మామూళ్లు ఇవ్వనిదే బిల్లులు చేయడం లేదు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాల కోసం పెట్టిన బిల్లులు ఎన్నిసార్లు అడిగినా మంజూరు చేయలేదు. అందుకే విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించా’నని రవికుమార్‌ తెలిపారు.  బిల్లులు ఇవ్వకపోతే పనులు ఎలా చేయగలమని ప్రశ్నించారు.  

సమాచారం ఇవ్వండి
అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటాం. జేఏవో జానకిరావును తక్షణమే పట్టుకున్నాం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నాం. మొత్తం రికార్డులన్నీ పరిశీలించాం. మునిసిపాలిటీలో మొత్తం జరిగిన పనులకు ఎంత మేరకు బిల్లులు ఇచ్చారో పరిశీలించి.. అధికారులకు నివేదిస్తాం.  
- రమణమూర్తి, ఏసీబీ డీఎస్పీ

Updated Date - 2022-05-22T05:14:32+05:30 IST