టీచర్లకు ముచ్చెమటలు

ABN , First Publish Date - 2022-08-17T06:45:37+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ‘నిమిషం ఆలస్యమైనా అటెండెన్స్‌ క్లోజ్‌’.. భయాందోళనలు గురువారమంతా ఉపాధ్యా యులను వెంటాడాయి.

టీచర్లకు ముచ్చెమటలు

ఆన్‌లైన్‌ హాజరు కోసం పరుగులు 

రోజంతా అటెండెన్స్‌ యాప్‌తోనే కుస్తీ

సర్వర్‌ సమస్యతో ఓపెన్‌ కాని డివైస్‌

ఇలాగైతే చదువులు చెప్పేదెలా ?

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు

అన్ని స్కూళ్లలోనూ ఇదే యాతన


  ‘వారం రోజులుగా యాప్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం కుస్తీలు పడుతున్నాం. ఉదయం తొమ్మిది గంటల్లోపే హాజరు వేయకపోతే ఆ రోజు విధులకు గైర్హాజరుగా పరిగణిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం ? కేవలం విద్యా శాఖలోనే ఈ విధానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదం’ జిల్లాకేంద్రానికి సమీపంలోవున్న   ఓ పాఠశాల ఉపాధ్యాయుల ఆవేదన ఇది.

  ‘ప్రతి రోజూ పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థుల హోం వర్క్‌లను చూడటం, కరెక్షన్‌ చేయడం జరిగేవి. ఈ రోజు ఉదయం 8.15 గంటలకే స్కూలుకు చేరుకుని ఆన్‌లైన్‌ హాజరు వేసేందుకు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నా సర్వర్‌ మొరాయిస్తుండటం వల్ల సాయంత్రం 3.15 గంటలైనా నమోదు కావడం లేదు. ఇలాగైతే బోధన ఎలా ?’ ఓ పాఠశాల హెచ్‌ఎం సహా మిగతా టీచర్ల ఆందోళన. 

  ‘మాలో కొందరు టీచర్లు మొబైల్‌ ఫోన్లను వినియోగించదలచుకోలేదు. అందువల్ల పాఠశాలకు స్మార్ట్‌ ఫోన్లను తీసుకురావడం  లేదు. ప్రభుత్వమే తగిన డేటా సౌకర్యంతో సమర్ధవంతమైన ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లను   ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం కోరిన విధంగా హాజరు వేస్తాం’ కొన్ని స్కూళ్ళ ఉపాధ్యయులు తమ హెచ్‌ఎంల వద్ద అభ్యర్థన.


భీమవరం/ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 16 : 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ‘నిమిషం ఆలస్యమైనా అటెండెన్స్‌ క్లోజ్‌’.. భయాందోళనలు గురువారమంతా  ఉపాధ్యా యులను వెంటాడాయి. ఆన్‌లైన్‌ హాజరు నమోదు యాప్‌తో టీచర్లపై ఓ రకంగా బెత్తాన్ని ఝళిపించడంపై రాష్ట్రమంతటా నిరసనలు, విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గని విద్యా శాఖ నిర్ణయంతో జిల్లాలో రోజంతా ఉపాధ్యా యులు హాజరు నమోదుకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యార్థులకు బోధన కరువైంది. మరోవైపు సాంకేతిక లోపాలు, సర్వర్‌ మొరాయింపు వంటి క్షేత్రస్థాయి సమస్యలు టీచర్లను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశాయి. వెరసి టీచర్ల అటెండెన్సుకు విద్యా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ అటెండెన్స్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ‘సిమ్స్‌–ఏపీ’ తొలి రోజునే ఉపాధ్యాయులకు చుక్కలు చూపించింది. ఉపాధ్యాయ సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో జిల్లాలో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది ఉపాధ్యాయుల్లో కేవలం రెండు వందల మంది మాత్రమే ఆన్‌లైన్‌ హాజరు వేసి ఉండొచ్చని అనధికార వర్గాల అంచనా. మొత్తం మీద మంగళవారం రోజంతా ఉపాధ్యాయులు పాఠశాలల ప్రాంగణాల్లోనే ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ నమోదు కోసం కుస్తీలు పడ్డారు.

 టీచర్ల పరుగులు–సీన్‌ రివర్స్‌

ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా నిర్ణీత యాప్‌ పనిచేయబోదని, ఆ మేరకు సంబంధిత ఉపాధ్యాయులకు ఆ రోజుకు సాధారణ సెలవు (సీఎల్‌), లేదా సంపాదిత సెలవు (ఈఎల్‌) ఆటోమేటిక్‌గా నమోదవుతుందన్న భయాందోళనలతో టీచర్లందరూ మంగళవారం ఉదయం 8.30–8.45 గంటల్లోపే పాఠశాలలకు చేరుకున్నారు. అయితే జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న టీచర్లు యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ సర్వర్‌ స్లోగా ఉండటమో లేదా మొరాయించ డమో జరిగాయి. ఇక యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నప్పటికీ అందులో రిజిస్ట్రేషన్‌ చేయించుకోని ఉపాధ్యాయులు సైతం అసహనానికి లోనయ్యారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేయించు కోని టీచర్లు సగం మందిపైనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు ఎదురయ్యాయి. కొందరు ఉపాధ్యాయులకైతే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పటికీ మరోదఫా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఆ మేరకు మళ్లీ ప్రయత్నిస్తే అప్పటికే రిజిస్ట్రేషన్‌ అయినట్టు చూపిస్తున్నట్టు పలువురు వాపోయారు. మరికొన్నిచోట్ల ఉపాధ్యాయులు తమకు స్మార్ట్‌ ఫోన్లు లేవని హెచ్‌ఎంల దృష్టికి తీసుకుని వెళ్లడం గమనార్హం. ఇలా ఆండ్రాయిడ్‌ ఫోన్లు లేని టీచర్లు ఆన్‌లైన్‌ హాజరు ఎలా నమోదు చేస్తారన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇటీవల హైస్కూళ్లకు విలీనమైన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యా యులను తాత్కాలికంగా వేరే పాఠశాలలకు డిప్యుటేషన్లు వేయగా, వారి వివరాలు ఇప్పటికీ ప్రాథమిక పాఠశాలల్లోనే ఉండటం సంబంధిత టీచర్లకు ఇబ్బందులు తలెత్తాయి. ఇక కృష్ణా జిల్లా నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏలూరు జిల్లాలోకి విలీనమైన ఎనిమిది మండలాల ఉపాధ్యాయుల వివరాలను ఇప్పటికీ సీఎస్‌ఈ లాగిన్‌ నుంచి జిల్లాల వారీగా విభజించకపోవడం వల్ల సంకటస్థితి కొనసాగుతోంది. రిటైర్మెంట్‌కు సమీపంలో వున్న టీచర్లలో పలువురు ఆండ్రాయిడ్‌ ఫోన్ల వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఆన్‌లైన్‌ హాజరు నమోదు ఎలా అనే సందేహాలు వ్యక్తంకాగా, గురువారం నుంచే సంబంధిత ఉపాధ్యాయుల్లో ఆందోళన తీవ్రమైంది. సహచర ఉపాధ్యాయుల మొబైల్‌ ఫోన్లలో రిజిస్టర్‌ అయ్యేందుకు సాధ్యం కాకపోవడంతో ఇటువంటి టీచర్లు దిగులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక పాఠశా లల టీచర్ల ఆన్‌లైన్‌ హాజ రు నమోదును పర్యవే క్షించే అధికారాలను కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల లాగిన్‌కు కట్టబెట్టడంపైనా విమర్శలు రేగాయి. టీచర్ల సర్వీసు విషయాలతో సంబంధం లేని కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు మొబైల్‌ అటెండెన్స్‌ పర్యవేక్షణను అప్పగించడం విద్యా శాఖ అవగాహనా లోపానికి నిదర్శనమని పలువురు ఎస్జీటీలు మండిపడ్డారు. కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులకు మాత్రమే ఆన్‌లైన్‌ హాజరు నమోదుకాగా, అదే పాఠశాలలో పనిచేస్తోన్న మరికొందరికి నెట్‌వర్క్‌ సమస్య రావడమో, అసలు సిగ్నల్స్‌ అందని పరిస్థితుల్లో తలెత్తాయి. మొత్తం మీద గురువారం మద్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత కొన్నిపాఠశాలల్లో యాప్‌ ఓపెన్‌ అయ్యి హాజరు నమోదుచేసినా సంబంధిత ఉపాధ్యాయుడు స్కూలుకు అప్పుడే వచ్చినట్టు చూపించడంతో లబోదిబోమన్నారు. ఇక సాయంత్రం వేళ స్కూలు పనివేళలు ముగిసిన తర్వాత మరోదఫా ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేయాల్సిన సమయంలోనూ ఉపాధ్యాయుల ప్రయాసలు మరిన్ని పెరిగాయి. 

 ఎందుకిలా..

పాఠశాలలో కొందరికి ఆన్‌లైన్‌ హాజరు నమోదై, మరికొందరికి నమోదు కాకపోవడం వల్ల తరగతి గదిలో బోధనకంటే హాజరుపైనే ఉపాధ్యాయుల మైండ్‌సెట్‌ కేంద్రీకృతమవుతుందని, దీనివల్ల అంతిమంగా విద్యార్థులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల హాజరుకు ఇప్పటి వరకు వినియోగిస్తున్న యాప్‌నే టీచర్ల హాజరు కూడా అనుసంధానం చేయడం వల్ల సర్వర్‌పై ఒక్కసారిగా ఒత్తిడిపెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తాయని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సాంకేతిక అవరోధాలు సరిదిద్దడానికి మరో వారం రోజులు పడుతుందని వివరించాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ బలంగా వున్నచోటే యాప్‌ పని చేయకపోతే ఇక మారుమూలగ్రామాలు, ఏజెన్సీ ప్రాంత పాఠశాలల్లో ఆన్‌లైన్‌ హాజరు నమోదు ఎలా సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యా యులు మంగళవారం మాన్యు వల్‌ విధానంలోనే హాజరును నమోదు చేసి ఊపిరి పీల్చుకున్నారు. 

 8.30 గంటలకే టీచర్లు హాజరు కావాలి 

– ఏలూరు డీఈవో గంగాభవాని

ఉపాధ్యాయులకు క్రమశిక్షణ, విద్యా కార్యకలాపాలు ఆన్‌లైన్‌ హాజరు వల్ల మరింత అభివృద్ధి చెందుతాయి. ఆ మేరకు ఉదయం 8.30 గంటలకే స్కూలుకు హాజరైతే, 8.45 గంటలకు ప్రార్ధన, 9 గంటల నుంచి బోధనా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌ హాజరునమోదుకు సర్వర్‌ సమస్య మంగళవారం సాయంత్రానికి పరిష్కారమైంది. ఇంకా ఎక్కడైనా బఫర్‌ సమస్య తలెత్తితే మా దృష్టికి  తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాం. సాంకేతిక సమస్యలు పరిష్కారమైనందున ఆన్‌లైన్‌  హాజరు నమోదును గురువారం నుంచి  తప్పని సరిచేస్తాం. 

యాప్‌ డౌన్‌లోడ్‌ బహిష్కరణ 

ఫ్యాప్టో పిలుపునకు మద్దతు.. పలుచోట్ల సర్వర్‌ సమస్య 

తమ సెల్‌ఫోన్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ విధిగా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని విద్యా శాఖ ఆదేశాలను జిల్లాలో ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటం ఆపేశారు. విద్యాశాఖ అధికారుల ఒత్తిళ్ల మేరకు పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు యాప్‌ డౌన్‌ లోడ్‌కు ప్రయత్నించారు. అయితే సర్వర్‌ సహకరించ లేదు. భీమవరం, వీరవాసరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల నుంచి కొంతమంది ఉపాధ్యాయులు డౌన్‌ లోడ్‌కు ప్రయత్నించినా కాలేదు. అయితే ఈ యాప్‌ కొత్త కాబట్టి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తాత్కాలికమేనని విద్యా శాఖ అధికారులు సమర్ధించుకున్నారు. ఫ్యాఫ్టోతో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, జేడీ సర్వీసెస్‌తో యాప్‌కు సంబంధించి మంగళవారం జరిగిన చర్చల్లో ఉపాధ్యాయుల వ్యక్తిగత సెల్‌ఫోన్లో నుంచి యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, యాప్‌ల కోసం సెపరేట్‌ డివైస్‌ ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్‌ చేశాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మన డిమాండ్‌ను పరిశీలిస్తామని చెప్పారు. అప్పటి వరకూ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దని ప్యాఫ్టో నిర్ణయం. అధికారుల నుంచి ఒత్తిడి వచ్చినా స్థిరంగా నిలబడాలని చెప్పి ఉపాధ్యాయులందరినీ ఫ్యాఫ్టో రాష్ట్ర కమిటీ కోరుతుందని ఫ్యాఫ్టో రాష్ట్ర కమిటీ తరుపున యూటీఎఫ్‌ నాయకుడు బి గోపిమూర్తి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 5,441 మంది ఉపాధ్యాయులు ఉండగా 2021 మంది రిజిస్టర్‌ అయ్యారు. 402 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఈ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ నమోదు చేయించుకున్నారు. 


మన్యంలో అవస్థలు 

బుట్టాయగూడెం: ఏజెన్సీలో మొదటిరోజునే టీచర్ల యాప్‌ మొరాయించింది. ఇక్కడ అసలే సిగ్నల్స్‌ అంతంతమాత్రంగా ఉండడంతో టీచర్లు పాఠశాలకు సమయానికి వచ్చినప్పటికీ హాజరు నమోదుకు ఎంతగా ప్రయత్నించినా టెక్నికల్‌ సమస్యతో యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో టీచర్లు అనేకచోట్ల హాజరు నమోదు చేయలే కపోయారు. పిల్లలకు పాఠాలు చెప్పవలసిన టీచర్ల హాజరు కోసం గంటల తరబడి యాప్‌తో పోటీ పడ్డా ప్రయోజనం లేకపోయింది. ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో అనేక చోట్ల పాఠశాలల్లో హాజరు నమోదు  కాలేదు. 

Updated Date - 2022-08-17T06:45:37+05:30 IST