భల్లూకం బీభత్సం

ABN , First Publish Date - 2022-06-21T05:18:09+05:30 IST

వజ్రపుకొత్తూరులో భల్లూకం బీభత్సం సృష్టించింది. ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన కడమటి కోదండరావు(72) ఎలుగుబంటి దాడికి గురై మృతిచెందిన విషయం తెలిసింది. సోమవారం వజ్రపుకొత్తూరులోని జీడి తోటలో పని చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరి చింది. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ ఆర్మీ జవాన్‌ ప్రాణాలకు తెగించి ఎలుగును నిలువరించడంతో వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు.

భల్లూకం బీభత్సం
ఎలుగుబంటి దాడిలో గాయాలపాలైన వజ్రపుకొత్తూరు గ్రామస్థులు

ఎలుగు దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలు
ఆర్మీ జవాన్‌ తెగింపుతో ప్రాణాలతో బయటపడిన వైనం
వజ్రపుకొత్తూరులో ఘటన
భీతిల్లుతున్న ఉద్దానం వాసులు
పట్టించుకోని అటవీశాఖాధికారులు
వజ్రపుకొత్తూరు, జూన్‌ 20 :
వజ్రపుకొత్తూరులో భల్లూకం బీభత్సం సృష్టించింది. ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన కడమటి కోదండరావు(72)  ఎలుగుబంటి దాడికి గురై మృతిచెందిన విషయం తెలిసింది. సోమవారం వజ్రపుకొత్తూరులోని జీడి తోటలో పని చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరి చింది. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ ఆర్మీ జవాన్‌ ప్రాణాలకు తెగించి ఎలుగును నిలువరించడంతో వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు.  స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు.. వజ్రపుకొత్తూరు గ్రామ సమీపంలోని సంతోషిమాత ఆలయం దగ్గరలోని తామాడ షణ్ముఖరావు అనే వ్యక్తి జీడితోటలో పశువుల శాలను నిర్మించేందుకు మిత్రులు కలిశెట్టి అప్పలస్వామి (ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌), ఉప్పరపల్లి సంతోష్‌, శిర్ల చలపతితో పాటు ఇద్దరు ఆర్మీ జవాన్‌లు పోతనపల్లి తారకేశ్వరరావు, పోతనపల్లి పురుషోత్తంలు వెళ్లారు. పశువుల శాల పనిలో నిమగ్నమై ఉన్న వీరిపై తోటలో మాటువేసి ఉన్న ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో అప్పలస్వామికి ముఖం, ముక్కు, నోరు భాగంలో, చలపతిరావుకు కన్ను, నోరు, ముఖం భాగంలో, షణ్ముఖరావుకు తలపై, సంతోష్‌కు తల, ముఖంపై,  తారకేశవరావుకు వీపు వెనుక భాగమంతా తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కొక్కరిపై ఎలుగు దాడి చేస్తుండడంతో ఆర్మీ జవాన్‌ పురుషోత్తం ప్రాణాలకు తెగించి భల్లూకాన్ని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనను చూస్తున్న చుట్టుపక్క రైతులు భయంతో కేకలు వేయడంతో ఎలుగుబంటి జీడి తోటలోకి పరుగులు తీసింది.  ఎలుగును నిలువరించే క్రమంలో ఆర్మీ జవాన్‌ పురుషోత్తం చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.
 
భయపడుతున్న రైతులు
వజ్రపుకొత్తూరు మండలంలో వరుసగా జరుగుతున్న ఎలుగుబంట్ల దాడులతో రైతులు తోటలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎలుగు దాడిలో ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన కడమట కోదండరావు అనే వ్యక్తి మృతి చెందగా, నర్తు దానయ్యకు చెందిన ఓ ఆవు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అదే భల్లూకం సోమవారం వజ్రపుకొత్తూరులో ఆరుగురిపై దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలుగు ప్రజలపై దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తుండడంతో  ఉద్దానం వాసులు వణికిపోతున్నారు. ఇంతజరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాగా, ఎలుగు దాడి నేపథ్యంలో తోటలకు ఎవరూ వెళ్లరాదని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు.  

 

Updated Date - 2022-06-21T05:18:09+05:30 IST