రోడ్లు ఇలా.. ‘గ్రోత్‌’ ఎలా?

ABN , First Publish Date - 2022-10-11T05:30:00+05:30 IST

పారిశ్రామిక అభివృద్ధికి మోడల్‌గా ఉండాల్సిన ఆ ప్రాంతం కాలు పెట్టినంతనే నిరాశ పడేలా తయారైంది. రహదారులన్నీ గోతులతోనూ... వాటి నిండా నీటితోనూ.. బురదమయంగానూ మారాయి. ఎక్కడికక్కడే వాహనాలు బురదలోకి దిగబడి నిలిచిపోతున్నాయి.

రోడ్లు ఇలా.. ‘గ్రోత్‌’ ఎలా?
గుంతలో దిగిన లారీతో తంటాలు పడుతున్న డ్రైవర్‌


బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో కానరాని మౌలిక సౌకర్యాలు
పాడైన రోడ్లపై అవస్థలు పడుతున్న లారీ డ్రైవర్లు
రిపేరు వస్తున్నాయని గగ్గోలు
నిరాశ చెందుతున్న పరిశ్రమల యజమానులు


 పారిశ్రామిక అభివృద్ధికి మోడల్‌గా ఉండాల్సిన ఆ ప్రాంతం కాలు పెట్టినంతనే నిరాశ పడేలా తయారైంది. రహదారులన్నీ గోతులతోనూ... వాటి నిండా నీటితోనూ.. బురదమయంగానూ మారాయి. ఎక్కడికక్కడే వాహనాలు బురదలోకి దిగబడి నిలిచిపోతున్నాయి. జిల్లాలోనే పేరొందిన బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో నెలకొన్న దుస్థితిది. పరిశ్రమలు ఏర్పాటు చేయదలుచుకునేవారికి మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ నేడు పేరు గొప్ప.. ఊరుదిబ్బగా మారింది. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలతో రోడ్లన్నీ అధ్వానంగా దర్శన మిస్తున్నాయి. ఎక్కడ దిగబడి పోతాయోనన్న భయంతో ముడిసరుకు తీసుకొచ్చే వాహనాల డ్రైవర్లు గ్రోత్‌ సెంటర్‌లోకి ప్రవేశించేందుకు వెనుకంజ వేస్తున్నారు.

బొబ్బిలి, అక్టోబరు 11:
బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లోని ఏపీఐఐసీ కార్యాలయాన్ని విజయనగరానికి తరలించాక అక్కడ నామమాత్రంగానే కార్యకలాపాలు సాగుతున్నాయి. అధికారులు, నేతలు మౌలిక సౌకర్యాలపై కూడా దృష్టిపెట్టక నానాటికీ గ్రోత్‌ లేకుండా పోతోంది. పక్కా రహదారులైనా లేకపోవడంపై పరిశ్రమల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు.

గ్రోత్‌సెంటర్‌లో పారిశ్రామిక యూనిట్‌లను స్థాపించాలనుకునేవారికి పూర్తి విక్రయం ద్వారా కాకుండా 33 ఏళ్ల లీజు పద్ధతిలో స్థలాలు కేటాయిస్తారు. పదేళ్ల తరువాత సేల్‌డీడ్‌ కావాలనుకుంటే ఇస్తారు. కాగా భూమి ధరను ప్రభుత్వం కొద్ది నెలల కిందట పెంచింది. రూ.1479 ఉండే చదరపు మీటరు భూమి ధరను రెట్టింపునకు అంటే రూ.2950కు అమాంతం పెంచేశారు. పెరిగిన ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలులోకి వచ్చాయి. ఎన్టీఆర్‌ హయాంలో ఏర్పాటైన ఈ గ్రోత్‌సెంటరులో తర్వాత వచ్చిన ప్రభుత్వాల చొరవ లేక ఇప్పటికీ పారిశ్రామిక ప్రగతి లేదు. ఒకానొక దశలో చదరపు మీటరు భూమిని రూపాయికి ఇస్తామని ప్రకటించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కదలిక లేకపోయింది. ఇప్పుడేమో ఏకంగా రూ.2950కు పెంచేశారు. ఇక్కడ పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి నీరు సరఫరా చేస్తున్నారు. నీటి ధరను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా నిర్ణయించారు. కిలోలీటరు వద్ద రూ.50 నుంచి రూ.120కు పెంచారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ మార్కు ప్రోత్సాహకం అంటే ఇదే కాబోలు అని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. మరోవైపు కీలకమైన రహదారులను పూర్తిగా విస్మరించారు. పదిరోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లు మరింతగా పాడయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడే దిగబడిపోతున్నాయి. వాటిని యథాస్థితికి తెచ్చేందుకు డ్రైవర్లు చాలా ప్రయాస పడుతున్నారు. ఇక్కడున్న దుస్థితి వల్లే కొన్ని పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయాయి. మరికొందరు భూములు పొంది కూడా పరిశ్రమల ఏర్పాటుకు సుముఖంగా లేరు. గతంలో బీకే స్టీల్స్‌ కోసం కేటాయించిన సుమారు వందెకరాల భూమి కేటాయింపు రద్దు అయిన సంగతి తెలిసిందే. వంద ఎకరాలున్న మోయర్స్‌ సంస్థ విశాఖ ప్రాంతానికి తరలి వెళ్లాలని నిర్ణయించింది.

గ్రోత్‌సెంటర్‌లో పరిశ్రమలు ఇలా..
ప్రస్తుతం నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లు: 117
ఖాళీ స్థలాలు: 96 (280 ఎకరాలు)
వెనక్కి తీసుకునేందుకు నోటీసులు జారీ అయినవి: 50
ఖాయిలా పడిన యూనిట్లు: 70

ఆస్తిపన్ను బకాయిల వల్లే..
బొబ్బిలి పారిశ్రామిక వాడలో మౌలిక వసతులు మెరుగుపడాలంటే కోట్లాది రూపాయల ఆస్తిపన్ను వసూలు కావాలి. సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా ఉన్న బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమిని పొంది పరిశ్రమలు స్థాపించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం.
                     -యతిరాజులు, జోనల్‌ మేనేజరు , ఏపీఐఐసీ


ఇలాంటి రోడ్లు ఎక్కడా చూడలేదు
దేశంలోని అనేక రాష్ర్టాలను తిరిగి వస్తున్నాను. ఈ రోడ్లంత ఘోరం ఇంకెక్కడా చూడలేదు. గౌహతి నుంచి బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌కు లోడు తీసుకొచ్చాను. ఇంతవరకూ బాగానే వచ్చాను. ఇక్కడి గోతిలో పడి లారీ వెనుక రెండు ఐరన్‌ కట్టలూ విరిగిపోయాయి. పైకి లేపటానికి నానా తంటాలు పడ్డాను.
                    - శివశంకర్‌, లారీ డ్రైవర్‌, విజయవాడ


Updated Date - 2022-10-11T05:30:00+05:30 IST