పునర్విభజన సరే.. అభివృద్ధి ఏదీ?

ABN , First Publish Date - 2022-12-31T00:33:26+05:30 IST

2022.. మరికొద్ది గంటల్లో కాలగమనంలో కలసిపోనుంది. ఈ ఏడాది జిల్లావాసులకు ఎన్నో తీపి జ్ఞాపకాలు... చేదు సంఘటనలు... మధుర ఘట్టాలను మిగిల్చింది. కొత్త ఏడాదిలో అడుగు పెట్టేముందు.. గత సంవత్సర కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న మార్పులు... సంఘటనలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన తరుణమిది.

పునర్విభజన సరే.. అభివృద్ధి ఏదీ?
పొందూరులో ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు (ఫైల్‌)

- 2022లో జిల్లాకు ఒరిగిందేమీ లేదు

- యథావిధిగా సమస్యలు

- అమలుకాని హామీలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

2022.. మరికొద్ది గంటల్లో కాలగమనంలో కలసిపోనుంది. ఈ ఏడాది జిల్లావాసులకు ఎన్నో తీపి జ్ఞాపకాలు... చేదు సంఘటనలు... మధుర ఘట్టాలను మిగిల్చింది. కొత్త ఏడాదిలో అడుగు పెట్టేముందు.. గత సంవత్సర కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న మార్పులు... సంఘటనలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన తరుణమిది. ఈ ఏడాది ప్రత్యేకంగా జిల్లా పునర్విభజన ప్రక్రియ సాగింది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల మోత మోగింది. జిల్లాలో మూడు సార్లు సీఎం పర్యటించగా.. సమస్యలు మాత్రం యథావిధిగానే ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా రెండుసార్లు జిల్లాకు వచ్చారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

..............

పునర్విభజన తర్వాత సిక్కోలు ఎంతో అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రజలు భావించారు. కానీ యథావిధిగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 4న జిల్లా పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు, 38 మండలాలు ఉండేవి. పునర్విభజనతో ఎనిమిది నియోజకవర్గాలు, 30 మండలాలతో సిక్కోలు మిగిలింది. భౌతికంగా విస్తీర్ణం తగ్గింది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరంలో, పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమయ్యాయి. పాలకొండ కేంద్రంగా కొనసాగుతున్న రెవెన్యూ డివిజన్‌ రద్దయింది. కొత్తగా 8 మండలాలతో పలాస రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటైంది. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లు యఽథావిధిగా కొనసాగుతున్నాయి. తొలుత జి.సిగడాం మండలాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌లో చేర్చుతూ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తిరిగి శ్రీకాకుళంలో డివిజన్‌లో చేర్చుతూ నోటిఫికేషన్‌ జారీచేశారు. రెవెన్యూ డివిజన్‌ విషయంలో చాలా మండలాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని మండలాలను పలాస డివిజన్‌లో చేర్చింది. టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలాన్ని టెక్కలి నుంచి వేరుచేసి కొత్తగా ఏర్పాటైన పలాస డివిజన్‌లో చేర్చడంపై మండలవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గంలోని అన్ని మండలాలను టెక్కలి డివిజన్‌లో చేర్చారు. దీంతో శివారుగా ఉన్న కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల ప్రజలకు వ్యయప్రయాసలు తప్పడం లేదు. ఇచ్ఛాపురం, కవిటి తదితర ఉద్దాన ప్రాంతవాసులూ జిల్లా కేంద్రానికి రావాలంటే వందలాది కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. పాలకొండ, రాజాం నియోజకవర్గ ప్రజలు ధ్రువపత్రాలు, ఇతరత్రా అవసరాల కోసం కొత్త జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

- ధరల బాదుడుపై టీడీపీ పోరుబాట

ఈ ఏడాది నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దిగుమతి నిలిచి నూనె ధరలు సలసల కాగాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. జనవరిలో గ్యాస్‌ సిలిండర్‌ రూ.931 ఉండగా.. ప్రస్తుతం రూ.1,084.50కి చేరింది. కరోనా వ్యాప్తి తర్వాత అన్నింటా ధరలు భారీగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. దీనినే అజెండాగా తీసుకుని టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితిపై ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుట ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాకు రెండుసార్లు వచ్చారు. పొందూరు మండలంలోని దళ్లవలసలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాల మీదుగా పర్యటించారు. పొందూరులో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెరిగింది.

- పడకేసిన ప్రాజెక్టులు

సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వంశధార ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. నేరడి బ్యారేజీ నిర్మించాలంటే.. ఒడిశా ప్రభుత్వంతో ఉన్న చిక్కులను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్‌ భావించారు. ఈ మేరకు ఒడిశా వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిశారు. కానీ, ఇప్పటికీ నేరడి బ్యారేజీ నిర్మాణానికి కదలిక లేదు. ఒడిశా ప్రభుత్వం కొర్రీలు వేయడంతో.. ప్రత్నామ్నాయంగా వంశధార హిరమండలంపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇటీవల టెండర్లను పిలిచారు. పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయన్నదీ స్పష్టత లేదు. ఇక నదుల అనుసంధానం కూడా బిల్లుల చెల్లింపులు.. ఇతరత్రా కారణాలతో ఆలస్యమవుతోంది.

ముడుసార్లు సీఎం వచ్చినా..

- సీఎం జగన్‌ జిల్లాకు ఈ ఏడాది మూడు సార్లు వచ్చారు. అమ్మఒడి పథకం మూడో విడత ఇక్కడే ప్రారంభించారు. ఆ సమయంలో జిల్లాకు సంబంధించి ఇచ్చిన హామీలు.. ఇప్పటివరకూ నెరవేరలేదు. మరోసారి స్పీకర్‌ తమ్మినేని కుమారుడు వివాహ కార్యక్రమానికి వచ్చారు. ఇంకోసారి నరసన్నపేటలో భూహక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు వచ్చారు.

మంత్రి వర్గ విస్తరణకే పరిమితం

- అధికారపార్టీ మంత్రి వర్గ విస్తరణకే పరిమితం కావడం తప్ప.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఏప్రిల్‌లో మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలిచినా.. స్తబ్దతగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి వరించింది. అన్న ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రి బాధ్యతల నుంచి తొలగించి.. తమ్ముడు ప్రసాదరావుకు అప్పగించారు. సీదిరి అప్పలరాజును ఊహించని విధంగా రెండోసారి మంత్రివర్గంలో కొనసాగించారు. మంత్రి పదవి ఆశించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు మాత్రం నిరాశే ఎదురైంది.

- ప్రతి నియోజకవర్గంలోనూ అధికారపార్టీ నేతలకు అసమ్మతి సెగ రాజుకుంది. గడపగడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు గ్రామాల్లో పర్యటించగా.. నిలదీతలు ఎదురయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులకు సీఎం జగన్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. పరిస్థితి మారకపోతే రానున్న ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తప్పదని చెప్పడంతో చర్చనీయాంశమైంది. మరోవైపు సర్వే నివేదికలు కూడా అనుకూలంగా లేకపోవడంతో అధికారపార్టీ నేతల్లో కలవరం రేగుతోంది.

- తొలిసారి రైలు దుర్ఘటన..

జి.సిగడాం మండలం బాతువ వద్ద ఈ ఏడాది ఏప్రిల్‌ 11న అర్ధరాత్రి రైలు ప్రమాదం సంభవించింది. కొయంబత్తూరు నుంచి సిల్చూర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు జనరల్‌ బోగీలో స్వల్పంగా పొగలు వచ్చాయి. ప్రయాణికులు ఆందోళన చెంది.. బాతువ వద్ద రైలు చైన్‌లాగి దిగిపోయారు. అదే సమయంలో పక్క పట్టాలపై నుంచి భువనేశ్వర్‌ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కొంతమంది ప్రయాణికులను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మృతిచెందారు.

- పింఛన్ల తొలగింపు

ఈ ఏడాది చివరలో పింఛన్‌దారులకు కొత్త టెన్షన్‌ ఎదురైంది. రానున్న జనవరి నుంచి ప్రభుత్వం 9,346 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనుంది. కాగా పాత పింఛన్లకు కోత వేసేందుకు.. వివిధ నిబంధనలను సాకుగా చూపి.. 5,994 మందికి నోటీసులు అందజేశారు. దీంతో ఆయా పింఛన్‌దారులంతా ఆందోళన చెందుతున్నారు. కొత్తసంవత్సర ప్రారంభంలో.. పింఛన్‌దారుల ఆక్రందనను అధికార పార్టీ ఎదుర్కోవాల్సిందే.

Updated Date - 2022-12-31T00:34:46+05:30 IST