ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-10-07T05:41:57+05:30 IST

జిల్లాను ముసురు కమ్ముకుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ధ్రోణి ప్రభావంతో మూడురోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండురోజుల పాటు ఇదేరీతిలో జిల్లా అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం నాటికి ఇచ్ఛాపురంలో అత్యధికంగా 41.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమో దైంది. కోటబొమ్మాళిలో అత్యల్పంగా 0.25 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి, వంశధార, బహుదా నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. వాగులు, వంకలూ పొంగి ప్రవహిస్తు న్నాయి.

ముంచెత్తిన వాన
పలాస : వరహాలగెడ్డ ఉధృతి కారణంగా.. తాళ్ల సహాయంతో ప్రయాణికులను వాగు దాటిస్తున్న దృశ్యం

- జిల్లాలో మూడురోజులుగా వర్షాలు

- పొంగుతున్న నదులు, కాలువలు

- నీట మునిగిన పంట పొలాలు

- మరో రెండురోజులపాటు ఇదే పరిస్థితి

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ పలాస/ పలాస రూరల్‌/ ఇచ్ఛాపురం/ ఇచ్ఛాపురం రూరల్‌/ సోంపేట రూరల్‌ పొందూరు / వజ్రపుకొత్తూరు)

జిల్లాను ముసురు కమ్ముకుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ధ్రోణి ప్రభావంతో మూడురోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండురోజుల పాటు ఇదేరీతిలో జిల్లా అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం నాటికి ఇచ్ఛాపురంలో అత్యధికంగా 41.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమో దైంది. కోటబొమ్మాళిలో అత్యల్పంగా 0.25 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి, వంశధార, బహుదా నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. వాగులు, వంకలూ పొంగి ప్రవహిస్తు న్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాకుళంలో పలు వార్డుల్లో మురుగు కాలువల్లో వర్షపునీరు చేరి.. రోడ్లపై ప్రవహించింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఎప్పటి మాదిరిగా వర్షపునీరు నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

పలాస మండలం కేదారిపురం వద్ద వరహాలగెడ్డ ఉధృతిగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పూర్ణభద్ర వద్ద వర హాలగెడ్డ ఉధృతికి రోడ్డుపై రెండడుగుల మేర నీరు నిలిచిపోయింది. రాకపోకలు స్తంభించాయి. జయరామకృష్ణాపురం వద్ద అండర్‌ పాసేజ్‌లో నీరు చేరడంతో ఒక కారు చిక్కుకుంది. స్థానికులు స్పం దించి కారులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీశారు. బ్రాహ్మణతర్లా గ్రామానికి వెళ్లే దారంతా బంద్‌ కావడంతో జాతీయ రహదారిపై నుంచి ఆ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 1వవార్డు మొగిలిపాడు వద్ద నీరంతా రోడ్డుపైకి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అం డర్‌పాసేజ్‌ వద్ద రెండడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో ద్విచక్రవాహన చోదకులు చుట్టుపక్కల తిరిగి వెళ్లి స్వగ్రామాలకు చేరుకున్నారు. పలాస నుంచి లొత్తూరు వెళ్లే దారిలో మొత్తం మూడు చోట్ల వరదనీరు రోడ్డుపైనే ప్రవహించింది. హరిసాగ రం, వరహాలగెడ్డ రిజర్వాయరు పొంగి ప్రవహించ డంతో ఆ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ జలదిగ్బం ధంలో చిక్కుకున్నాయి. బ్రాహ్మణతర్లా, పూర్ణభద్ర, అమలకుడియా, కేశుపురం ప్రాంతాల్లో మొత్తం పంట పొలాలన్నీ నీట మునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రాంతాలను తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, సీఐ శంకరరావు పరిశీలించారు. ప్రజలను అప్ర మత్తం చేశారు. 


బాహుదాకి వరద 

జిల్లాతో పాటు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలతో బాహుదా నదికి వరదనీరు పోటెత్తింది. గురువారం సాయంత్రం 4 గంటలకు 25,801 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. బాహుదానదికి వరద పోటెత్తడంతో ఈనేసుపేట జల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్డుపై భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి మరింత పెరిగితే ఇబ్బందులు తప్పవని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇచ్ఛాపురం మండ లం బూర్జపాడు, డొంకూరు, చిన్న లక్ష్మీపురం, పెద్ద లక్ష్మీపురం, ఇనేసుపేట, ధర్మపురం, తులసిగాం తీర ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. సోంపేట మండలం పలాసపురం, లక్కవరం, బారువ, బారువపేట, రుషికుడ్డ తదితర గ్రామాల్లో వరిపంట ముంపునకు గురైంది. పొట్టదశలో నీరు నిల్వ ఉండిపోతుండడంతో.. పంట దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందో ళన చెందుతున్నారు. ముంపు తగ్గిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరి యా, 20 కిలోల పొటాష్‌ పిచికారీ చేయాలని సోంపేట మండల వ్యవ సాయాధికారి బి.నర్సింహమూర్తి సూచించారు. 


జల దిగ్బంధం

వజ్రపుకొత్తూరు మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుల్లలపాడు, తాడివాడ, నగరంపల్లి గ్రామా ల్లోకి మూడు అడుగుల ఎత్తులో నీరు చేరడంతో ప్రజలు భయాందోళన చెందారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లోని చెరువులకు గండి పడ డంతో.. ఈ మూడు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పవు. వారం రోజు లపాటు గ్రామాల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలు గుతుంది. తాజాగా.. గుల్లలపాడు, తాడివాడ గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. తహసీల్దార్‌ బి.అప్పలస్వామి, చినవంక సర్పంచ్‌ దువ్వాడ విజయలక్ష్మి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేంబాబు చౌదరి గురువారం ముంపు గ్రామాలను పరిశీలించారు. పక్క గ్రామమైన కిడిసింగి చెరువు వద్ద అనధికారికంగా ఎత్తైన గోడ కట్టడం వల్ల గుల్లలపాడు, తాడివాడ గ్రామా లు ఏటా ముంపునకు గురవుతున్నాయని హేంబాబు చౌదరి అధికా రులకు వివరించారు. ముంపు సమస్య తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.  అలాగే చినడోకులపాడు సమీపంలోని దేశబట్టి చెరువుకు గండి పడడంతో ఆయుకట్టు పంట పొలాలు నీటమునిగాయి. హుకుంపేట లోని సూరాడవీధిలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. 


పొందూరులో ఇళ్లలోకి నీరు

పొందూరులోని చేపలవీధి, కస్పావీధి, పార్వతీనగర్‌ కాలనీ, సెగిడివీధి కాలనీలో వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. చేపలవీధిలో రెండు రోజు లుగా ఆయా కుటుంబాలు నరకయాతన పడుతున్నాయి. సెగిడివీధిలో జాక చిన్నా రావుకు చెందిన పూరింటి గోడ, పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆయా కాలనీలను సర్పంచ్‌ రేగిడి లక్ష్మి, ఈవో జనార్దనరావు, వీఆర్‌వో వేణు పరిశీలించారు. ఇదిలా ఉండగా.. నీలమ్మ చెరువు నిండిన తర్వాత వరదనీరు పెద్దచెరువుకు వెళ్తోంది. సుమారు 20 అడుగుల వెడల్పు ఉండే కాలువ ఆక్రమణలకు గురై.. ఆరడుగులు మాత్రమే మిగిలింది. దీంతో చెరువు నీరు ఇళ్లల్లోకి చేరుతోందని అధికారులు చెప్పడం గమనార్హం. 


పలాసలో కూలిన రెండంతస్తుల భవనం

పలాసలోని కేటీ రోడ్డు మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లే రహ దారిలో గురువారం రాత్రి మల్లా కామేశ్వరరావు అనే వ్యాపారికి చెందిన రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంటి యజమానులు కానీ, రోడ్డుపై పాద చారులు, వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మున్సిపల్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 40 ఏళ్ల కిందట మట్టితో నిర్మించిన ఈ భవనంలో.. మల్లా కామేశ్వరరావు టిఫిన్‌ దుకా ణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ భవనానికి సమీపంలో మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు దుకాణం మూసివేసి.. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో జోరున వర్షం పడుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లేదంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనానికి వెనుక ఉన్న రాంబాబు, పరాశయ్య లకు చెందిన రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు బాధితులు వాపోయారు. సంఘటన స్థలాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ టి.రాజగోపాలరావు, పోలీసులు పరిశీలించారు. ప్రొక్లెయినర్‌తో భవన శిథిలాలు తొలగించి.. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. ఆస్తినష్టం తప్ప.. ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


Updated Date - 2022-10-07T05:41:57+05:30 IST