పొందూరు ఖాదీ ప్రత్యేకం

ABN , First Publish Date - 2022-08-14T04:33:55+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో పొందూరు ఖాదీకి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ వంటి ఎందరో మహానుభావులు పోరాటం చేశారు. విదేశీ వస్తువుల బహిష్కరణ నిర్వహించారు. ఇందులో భాగంగా.. పొందూరు ఖాదీ, చేనేత వస్ర్తాలకు ప్రాధాన్యం దక్కింది.

పొందూరు ఖాదీ ప్రత్యేకం
పొందూరులోని ఏఎఫ్‌కేకే సంఘం.. ఖాదీవస్త్రాలు

విదేశీ వస్తువుల బహిష్కరణతో చేనేత వస్ర్తాలకు ప్రాధాన్యం
(పొందూరు)

స్వాతంత్య్ర ఉద్యమంలో పొందూరు ఖాదీకి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ వంటి ఎందరో మహానుభావులు పోరాటం చేశారు. విదేశీ వస్తువుల బహిష్కరణ నిర్వహించారు. ఇందులో భాగంగా.. పొందూరు ఖాదీ, చేనేత వస్ర్తాలకు ప్రాధాన్యం దక్కింది. 1921లో విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర మహాసభలో మహాత్మాగాంధీ పాల్గొన్నారు. సభలో ముఖ్యపాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాబి సీతారామయ్య పొందూరు ఖాదీ వస్ర్తాలను గాంధీజీకి బహుమతిగా అందజేశారు. ఈ వస్ర్తాలను చూసి గాంధీజీ ముగ్దుడయ్యారు. ఖాదీ కార్మికుల పనితనాన్ని మెచ్చుకున్నారు. తర్వాత తన కుమారుడు దేవదాస్‌గాంధీని పొందూరు ప్రాంతానికి పంపించి ఖాదీ వస్త్రాల విశిష్టతను తెలుసుకున్నారు. అదే ఏడాది పొందూరు ఖాదీ వస్త్రాలను కీర్తిస్తూ యంగ్‌ఇండియా పత్రికలో ప్రత్యేక కఽథనాన్ని సంపాదకీయంగా రాశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పొందూరు ఖాదీ వస్ర్తాల గొప్పతనం, నేత కార్మికుల పనితనం తెలిసింది. అనంతరం విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా గాంధీజీ పిలుపు మేరకు.. పొందూరు నుంచి భారీగా చేనేత, ఖాదీ వస్ర్తాలను ఉత్పత్తి చేసి దేశానికి అందించారు. అనంతరం ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధుల నుంచి పొందూరు ఖాదీకి ప్రశంసలు దక్కాయి. 1955 అక్టోబరు 1న భూదాన్‌ ఉద్యమ సృష్టికర్త, నాయకుడు ఆచార్య వినోభాభావే పొందూరు వచ్చి ఖాదీ వస్త్రాలను పరిశీలించి ప్రశంసించారు. 1997 డిసెంబరు 9న గాంధీ మనుమరాలు తారా భట్టాచార్య పొందూరులోని ఏఎఫ్‌కేకే సంఘాన్ని సందర్శించారు. వడుకు, నేత కార్మికుల పనితీరును అభినందించారు. ఇలా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో స్థానం లభించడం తమ అదృష్టంగా  చేనేత కార్మికులు  భావిస్తున్నారు.

 

Updated Date - 2022-08-14T04:33:55+05:30 IST