ఎన్నాళ్లీ నిరీక్షణ?

ABN , First Publish Date - 2022-03-06T03:40:39+05:30 IST

జిల్లాలో 8,529 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. తమకు పీఎఫ్‌ (ప్రావిడెంట్‌ ఫండ్‌) ఖాతాల నుంచి రుణాలు మంజూరు చేయాలని కోరినా ఫలితం లేకపోతోంది. మరోవైపు పదవీవిరమణ చేసిన వారికి సైతం ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఎఫ్‌ నిల్వలు రూ.395.06 కోట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్‌ నిల్వపై 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన రూ.402.50 కోట్ల వరకూ నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది తమ అవసరాలకు పీఎఫ్‌ నుంచి రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకూ వాటికి మోక్షం కలగడం లేదు.

ఎన్నాళ్లీ నిరీక్షణ?

నెలల తరబడి అందని పీఎఫ్‌ రుణాలు
ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ లేకపోవడమే కారణం
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఎదురుచూపు
(మెళియాపుట్టితి/ఇచ్ఛాపురం రూరల్‌)
- మెళియాపుట్టి మండలం గంగరాజపురం పాఠశాలలో కేసీహెచ్‌ కుంటియా ఒడియా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లికి అనారోగ్యం కావడంతో అత్యవసర వైద్యం కోసం గత ఏడాది మేలో పీఎఫ్‌ ఖాతా నుంచి రూ.3 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైనా.. ఇంతవరకూ ఖాతాలో నగదు జమ కాలేదు.
- నందవ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన వై.రాజమోహన్‌ గత ఏడాది మేలో ఉద్యోగ విరమణ చేశారు. కానీ ఇంతవరకూ పీఎఫ్‌ఎస్‌ నిల్వలకు సంబంధించిన నగదు ఆయన ఖాతాల్లో జమ కాలేదు. దీంతో విశ్రాంత ఉపాధ్యాయుడికి ఎదురుచూపులు తప్పడం లేదు.

- జిల్లాలో 8,529 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. తమకు పీఎఫ్‌ (ప్రావిడెంట్‌ ఫండ్‌) ఖాతాల నుంచి రుణాలు మంజూరు చేయాలని కోరినా ఫలితం లేకపోతోంది. మరోవైపు పదవీవిరమణ చేసిన వారికి సైతం ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఎఫ్‌ నిల్వలు రూ.395.06 కోట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్‌ నిల్వపై 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన రూ.402.50 కోట్ల వరకూ నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది తమ అవసరాలకు పీఎఫ్‌ నుంచి రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకూ వాటికి మోక్షం కలగడం లేదు. ప్రభుత్వ వాటాకు సంబంధించి పీఎఫ్‌ నిల్వలు, వడ్డీ శాతం క్లియరెన్స్‌ చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. అత్యవసర, అనారోగ్య సమయాల్లో పీఎఫ్‌ కొండంత అండ. కొవిడ్‌ తరువాత ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులబాట్లు సైతం కల్పించింది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ తరువాత పీఎఫ్‌ నగదు ఉపయోగపడుతుందని భావించి విత్‌ డ్రా చేయకుండా ఉంచుతారు. కొందరు పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు వినియోగిస్తుంటారు. ఇటువంటి వారు దరఖాస్తు చేసుకున్నా పీఎఫ్‌ నగదు జమ కావడం లేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేది. కానీ గత ఎనిమిది నెలలుగా దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. మంజూరైనట్టు చూపుతున్నా నగదు మాత్రం ఖాతాల్లో జమకావడం లేదు. దీంతో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ అవసరాలకు అధిక వడ్డీకి బయట రుణాలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ పరిస్థితి ఎదురైందని వారు వాపోతున్నారు.
కేంద్రం వెసులుబాటు
కొవిడ్‌ తరువాత కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ విత్‌డ్రాల విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. పీఎఫ్‌ ఖాతా నుంచి ఎక్కువ శాతం విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దీంతో ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ పీఎఫ్‌కు జమయ్యే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌తో పాటు అనారోగ్య సమస్యతో మృతిచెందిన వారి విషయంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. బాధిత కుటుంబ సభ్యులు జడ్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. గత ఏడాది మే నుంచి దరఖాస్తు చేసుకున్నవారు చెల్లింపుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
జడ్పీ పరిధిలోనూ అగమ్యగోచరం
 జిల్లాపరిషత్‌ ఆధీనంలో ఉన్న 500 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పీఎఫ్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు రుణాలకు నోచుకోక సతమతమవుతున్నారు. ఏపీజీఎల్‌ఐ ఖాతా నుంచి జడ్పీలకు నిధులు మంజూరవుతాయి. ఆ నిధుల లభ్యతకు అనుగుణంగా జడ్పీ పీఎఫ్‌ విభాగం అధికారులు చెక్కులు రాసి వాటి క్లియరెన్స్‌ కోసం సీఎఫ్‌ఎంఎస్‌కు పంపుతారు. అక్కడ నుంచి నేరుగా ఉద్యోగి ఖాతాకు రుణ మొత్తం జమవుతుంది. జిల్లావ్యాప్తంగా ఆరు నెలలుగా వచ్చిన రుణ దరఖాస్తుల విలువ సుమారు రూ.50కోట్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తం ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, మరికొన్ని నెలలు నిరీక్షించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. దీంతో  కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అప్పుల కోసం బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దాచుకున్న డబ్బులు సకాలంలో అందక తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌  
రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న ఉద్యోగుల బిల్లులు అన్ని ట్రెజరీలకు పంపించాం. అక్కడ సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ అనుమతులు వచ్చిన వెంటనే అందరికీ చెల్లిస్తారు. మా వద్ద ఎటువంటి పెండింగ్‌ బిల్లులు లేవు.
- బి.లక్ష్మీపతి, జడ్పీ సీఈవో

Read more