పతులే ప్రత్యక్ష ప్రతినిధులు!

ABN , First Publish Date - 2022-03-06T03:42:43+05:30 IST

అది పేరుకే మండల సర్వసభ్య సమావేశం. కానీ అక్కడ సభ్యులు ఒకరిద్దరు మాత్రమే కనిపించారు. మిగతా వారంతా మహిళా ప్రజాప్రతినిధుల పతులే. వారే ప్రశ్నలతో హడలెత్తించారు. ఆపై ఏ సంబంధమూ లేని ఇతర మండలాల నాయకులు సైతం కుర్చీల్లో కొలువుదీరారు. అంతటితో ఆగకుండా సమస్యలపై అధికారులను నిలదీశారు. శనివారం టెక్కలి మండల సర్వసభ్య సమావేశంలో కనిపించిన దృశ్యాలివీ. కనీస నిబంధనలు పాటించకుండా.. నేతలు శ్రుతి మించి వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

పతులే ప్రత్యక్ష ప్రతినిధులు!
టెక్కలి మండల సర్వసభ్య సమావేశంలో దామోదరపురంకు చెందిన వ్యక్తి ఇళ్ల కాలనీ బిల్లుకు సంబంధించి ప్రశ్నిస్తున్న దృశ్యం.

 సభ్యులు కాని వారిదే పెత్తనం
 ప్రశ్నలు, నీలదీత లూ అంతా వారే
 పక్క మండలాల నుంచీ హాజరు
 బూరగాం ఫీల్డ్‌ అసిస్టెంటూ సభ్యుడేనా?
టెక్కలి మండల సమావేశం తీరిదీ
- పేరుకే మహిళా ప్రతినిధులు. పెత్తనం అంతా భర్తలదే. కొన్నిచోట్ల కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఆ ‘బాధ్యత’ తీసుకుంటున్నారు. మామూలు సభలలోనే కాదు. ఏకంగా మండల సమావేశాలలోనూ ఇదే తీరు. టెక్కలి మండల సర్వసభ్య సమావేశంలో శనివారం ఇదే దృశ్యం కనిపించింది.  అధికారులపై వారే ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరు మహిళలు హాజరై..ప్రేక్షక పాత్ర పోషిస్తే...మరికొందరు ఇళ్లలోనే ఉండి...పతులను సమావేశానికి పంపించారు.  

టెక్కలి, మార్చి 5: అది పేరుకే మండల సర్వసభ్య సమావేశం. కానీ అక్కడ సభ్యులు ఒకరిద్దరు మాత్రమే కనిపించారు. మిగతా వారంతా మహిళా ప్రజాప్రతినిధుల పతులే. వారే ప్రశ్నలతో హడలెత్తించారు. ఆపై ఏ సంబంధమూ లేని ఇతర మండలాల నాయకులు సైతం కుర్చీల్లో కొలువుదీరారు. అంతటితో ఆగకుండా సమస్యలపై అధికారులను నిలదీశారు. శనివారం టెక్కలి మండల సర్వసభ్య సమావేశంలో కనిపించిన దృశ్యాలివీ. కనీస నిబంధనలు పాటించకుండా.. నేతలు శ్రుతి మించి వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఎంపీపీ ఆట్ల సరోజినమ్మ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హాజరయ్యారు. సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు ఆహ్వానాలు పంపారు. కానీ ప్రజాప్రతినిధుల భర్తలే  అధికంగా హాజరయ్యారు. శాఖల వారీగా నిర్వహించిన సమీక్షలో వారే ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సమాధానం చెప్పేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో అసలు సంబంధమే లేని వ్యక్తులు సైతం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ధర్మనీలాపురానికి చెందిన గూన భాను, దామోదరపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి విద్యుత్‌శాఖ, గృహనిర్మాణశాఖ అధికారుల తీరును ప్రశ్నించారు. బూరగాం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తిరుమలరెడ్డి విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం కొనుగోలు అంశంలో అధికారుల వైఫల్యాలపై నిలదీశారు. పాడి ఆవు చనిపోతే ఇంతవరకూ బీమా పరిహారం చెల్లించలేదని తొలుసూరుపల్లి ఎంపీటీసీ భర్త చింతాడ అప్పన్న పశువైద్యాధికారులను నిలదీశారు. మేఘవరం సర్పంచ్‌ భర్త తుఫాన్‌రావు, అక్కవరం సర్పంచ్‌ భర్త పొట్నూరు అప్పలనాయుడు, పాతనౌపడ సర్పంచ్‌ భర్త దల్లి లోకేశ్వరరెడ్డి, పెద్దరోకళ్లపల్లి సర్పంచ్‌ భర్త రామపాత్రుని మురళీరెడ్డి, సీతాపురం ఎంపీటీసీ భర్త బెండి ఉదయ్‌, చాకిపల్లి ఎంపీటీసీ భర్త పొందల శ్రీను ఇలా మహిళా ప్రజాప్రతినిధుల బదులు పతులే సమావేశంలో ఆద్యంతం ప్రశ్నలు, నిలదీతలతో హల్‌చల్‌ చేశారు. వీరికి సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకున్నారు. సమావేశంలో నందిగాం మండలానికి చెందిన కొందరు నేతలూ పాల్గొనడం గమనార్హం.


Updated Date - 2022-03-06T03:42:43+05:30 IST