అయ్యో.. ఆక్వా!

ABN , First Publish Date - 2022-12-16T00:02:38+05:30 IST

ఆక్వా రైతులకు కొత్త నిబంధనలు షాక్‌నిస్తున్నాయి. జాతీయ జలకృషివల సుస్థిర అభివృద్ధి కేంద్రం(ఎంపెడా) ఆధ్వర్యంలో కేంద్రం వివిధ పథకాల ద్వారా ఆక్వా రైతులకు రాయితీ కల్పిస్తోంది. ఇటీవల వాటిని సహకార సంఘాలు చేస్తేనే ప్రయోజనాలు అందుతాయని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

అయ్యో.. ఆక్వా!
బూర్జపాడు వద్ద సాగు చేస్తున్న రొయ్యిల చెరువు

- కొత్త నిబంధనలతో రాయితీకి ఎసరు

- సంఘాలకు లైసెన్స్‌ తప్పనిసరి

- ఆందోళన చెందుతున్న రైతులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఆక్వా రైతులకు కొత్త నిబంధనలు షాక్‌నిస్తున్నాయి. జాతీయ జలకృషివల సుస్థిర అభివృద్ధి కేంద్రం(ఎంపెడా) ఆధ్వర్యంలో కేంద్రం వివిధ పథకాల ద్వారా ఆక్వా రైతులకు రాయితీ కల్పిస్తోంది. ఇటీవల వాటిని సహకార సంఘాలు చేస్తేనే ప్రయోజనాలు అందుతాయని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంఘం ఏర్పాటు చేయాలంటే కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ లైసెన్సు ఉండాలి. కానీ చాలామంది రైతులు సాగు చేస్తున్నవి అసైన్డ్‌ భూములు కావడం, వాటికి లైసెన్సులు మంజూరు చేయకపోవడంతో రాయితీలు వర్తించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో ఇప్పటివరకు 26 సంఘాలు.. 405 సభ్యులు ఉన్నట్లు ఎంపెడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎంపెడా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఆ శాఖ పరిధిలోనే సంఘాలకు లైసెన్సులు జారీ చేసి రైతులకు రాయితీలు ఇచ్చేవారు. ఒక్కో సంఘానికి రూ.5 లక్షలు నుంచి రూ.30లక్షల వరకు ఇస్తూ.. 50 శాతం రాయితీ కల్పించేవారు. రైతులు ఈ నగదును ఎరియేటర్లు, జనరేటర్లు, విద్యుత్‌ సౌకర్యం, అప్రోచ్‌ రోడ్లు, సోలార్‌ సిస్టమ్‌ ఇతర సాగు అవసరాలకు వినియోగించుకునేవారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం వరకు రాయితీ వర్తించేది. ప్రస్తుతం ఆక్వా సాగుకు అవసరాలు పెరగడంతోపాటు అనుబంధంగా శీతల గిడ్డంగులు తదితరాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. తాజాగా మారిన నిబంధనల ప్రకారం రైతులు సాగు చేసే ఆక్వా చెరువులకు కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అఽథారిటీ లైసెన్స్‌ కచ్చితంగా ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న సంఘాలకు రూ.కోటి వరకు రుణాలు అందించడంతోపాటు నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాయితీ కల్పిస్తారు. కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ లైసెన్స్‌ పొందాలంటే రైతులందరూ సొంతంగా సాగు భూమి కలిగి ఉండాలి. సంక్షేమ సంఘాలను సహకార సంఘాలుగా మార్చుకుంటేనే రాయితీలు వర్తించే అవకాశం ఉంది. కాగా జిల్లాలో చాలామంది ఇతరుల వద్ద భూములు తీసుకొని లీజుకు సాగు చేస్తున్నారు. దీంతో అటువంటి వారికి పథకాలు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నారు.

పథకాలు అండంలేదు

కొన్నేళ్లుగా సొంత భూమిలోనే రొయ్యలు చెరువు సాగు చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు అందడం లేదు. అధికారులు వచ్చి చెబుతున్నారు కానీ పథకాలు అందించడంలో శ్రద్ధ చూపడంలేదు. డీజిల్‌ రాయితీ, పుడ్‌ సబ్సిడీపై ఇవ్వడం లేదు.

- డి.కృష్ణారావు, ఆక్వా రైతు, లక్ష్మీపురం

......................

నిబంధనలు సడలించాలి

మారిన నిబంధనలతో ఆయా సంఘాలలో కౌలుకు రొయ్యిల చెరువులు చేసే రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కౌలు రైతులకు ఎటువంటి పథకాలు అందడం లేదు. పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్నా అధిక వర్షాలు, వైరస్‌లు వలన నష్టపోతున్నాం. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని నిబంధనలు సడలించాలి.

- పి.వల్లభరావు, ఆక్వా కౌలురైతు, డొంకూరు

......................

అవగాహన కల్పిస్తున్నాం

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ మండలాల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఆక్వాసాగు చేసే ప్రాంతాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాం. రైతులు బృందంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. లైసెన్స్‌ మాత్రం కచ్చితంగా ఉండాలి.

- పొందూరు రాము, ఎంపెడా(నాక్సా) ఫీల్డ్‌ మేనేజర్‌, శ్రీకాకుళం

Updated Date - 2022-12-16T00:02:39+05:30 IST