అరకొరగా

ABN , First Publish Date - 2022-03-06T03:46:42+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్ల సరఫరాలో జాప్యమవుతోంది. జిల్లాకు అవసరమైన నిల్వలు రాక లబ్ధిదారులకు సకాలంలో పాలప్యాకెట్లు పంపిణీ కావడం లేదు. ఆరేళ్ల లోపు చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం ద్వారా పాలు, బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తోంది. నిల్వలు సకాలంలో రాకపోవడంతో కొన్ని కేంద్రాల్లో వీటిని లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 16,639 మంది గర్భిణులు, 18,303 మంది బాలింతలు ఉన్నారు.

అరకొరగా
సీతంపేట ఐటీడీఏ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతున్న 180 మిల్లీ లీటర్ల పాల ప్యాకెట్‌లు ఇవే...

అంగన్‌వాడీల్లో సకాలంలో అందని పాలు
అవసరమైన నిల్వలు రాక ఇబ్బందులు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

అంగన్‌వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్ల సరఫరాలో జాప్యమవుతోంది. జిల్లాకు అవసరమైన నిల్వలు రాక లబ్ధిదారులకు సకాలంలో పాలప్యాకెట్లు పంపిణీ కావడం లేదు. ఆరేళ్ల లోపు చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం ద్వారా పాలు, బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తోంది. నిల్వలు సకాలంలో రాకపోవడంతో కొన్ని కేంద్రాల్లో వీటిని లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 16,639 మంది గర్భిణులు, 18,303 మంది బాలింతలు ఉన్నారు. వీరికి వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం పేరుతో ఒకపూట మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. వీటితో పాటు ఒక కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలప్యాకెట్‌ పంపిణీ చేయాలి. కొన్ని కేంద్రాల్లో గత నెల నుంచి కాంట్రాక్టర్‌ కేవలం 180 మిల్లీలీటర్ల పాలప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో బెంగళూరు నుంచి పాలప్యాకెట్లు రాగా, పంపిణీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఐసీడీఎస్‌ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తయారవుతున్న ఏపీ డెయిరీ విజయ పాలప్యాకెట్లను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లాకు కావాల్సిన పాల ప్యాకెట్ల నిల్వల వివరాలు ఐసీడీఎస్‌ అధికారులు ఇండెంట్‌ పెడుతున్నా.. ప్రతినెలా సక్రమంగా సరఫరా కావడం లేదు. జిల్లాకు ప్రతినెలా సుమారు 8 లక్షల లీటర్ల పాలు అవసరమని ప్రతిపాదించగా.. కేవలం 5 లక్షల నుంచి 6.50 లక్షల లీటర్ల పాలప్యాకెట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో లబ్ధిదారులకు సకాలంలో  అందడం లేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో మారుమూల గ్రామాల్లో పాలప్యాకెట్లు సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
అర్బన్‌ కేంద్రాల్లో అరకొరగా పంపిణీ...
మునిసిపాలిటీల్లో నగర పోషక కేంద్రాలు ఇప్పటికే మూలకు చేరాయి. గతంలో శ్రీకాకుళం కార్పొరేషన్‌, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం వంటి మునిసిపాలిటీల్లో నగర పోషణ మిత్రల ద్వారా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పాలు పంపిణీ చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో పోషణమిత్రలు విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో లబ్ధిదారులకు సక్రమంగా పాలు పంపిణీ కావడం లేదు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అరకొరగానే పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతినెలా పాలప్యాకెట్లు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
చర్యలు చేపడతాం
దూరప్రాంతం నుంచి పాలప్యాకెట్లు జిల్లాకు రావడం వల్ల పంపిణీలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజులు ఆలస్యమైనా.. లబ్ధిదారులందరికీ అందజేస్తున్నాం. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం.  
 - జయదేవి, సీడీపీఓ, శ్రీకాకుళం

Read more