మాస్టార్లూ.. వెనక్కి వచ్చేయండి

ABN , First Publish Date - 2022-12-15T23:59:30+05:30 IST

బదిలీల షెడ్యూల్‌ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో సందడి నెలకొంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ ప్రక్రియ ప్రారంభమవడంతో భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఉపాఽధ్యాయేతర విధుల్లో ఉన్నవారి డిప్యూటేషన్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మాస్టార్లూ.. వెనక్కి వచ్చేయండి

ఉపాధ్యాయులకు బోధనేతర డిప్యుటేషన్లు రద్దు

(ఎచ్చెర్ల)

బదిలీల షెడ్యూల్‌ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో సందడి నెలకొంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ ప్రక్రియ ప్రారంభమవడంతో భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఉపాఽధ్యాయేతర విధుల్లో ఉన్నవారి డిప్యూటేషన్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్వశిక్ష అభియాన్‌, మండల విద్యా వనరుల కేంద్రం(ఎంఆర్‌సీ), రాజధాని అమరావతిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొంతమంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరందర్నీ వెనక్కి తీసుకురావాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటేషన్‌పై ఉన్న ఉపాధ్యాయులు ఇక బడిబాట పట్టాల్సిందే.

బోధనేతర పనుల్లో..

జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులు ఎంఆర్‌సీల్లో బోధనేతర పనులు చేపడుతున్నారు. ఎంఆర్‌సీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐసీ కోఆర్డినేటర్‌లు ఉన్నప్పటికీ.. కొన్ని మండలాల్లో ఇప్పటికీ ఉపాధ్యాయులతోనే జీతాల బిల్లులు చేయిస్తున్నారు. వీటితో పాటు వార్షిక ఇంక్రిమెంట్లు, మెడికల్‌ రీయింబర్స్‌మెంటు బిల్లులు, సెలవుల అప్‌లోడ్‌ చేయడం తదితర పనులు ఉపాధ్యాయులకు తప్పడం లేదు. మరికొందరు సర్వశిక్ష అభియాన్‌, అమరావతిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలానికి నలుగురు.. ఐదుగురు ఉపాధ్యాయులు బోధనేతర పనుల్లో నిమగ్నమవుతున్నారని సమాచారం. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనుల్లో వినియోగించరాదు. అయినా, కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు విద్యాయేతర పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారన్న ఫిర్యాదులు విద్యాశాఖకు అందాయి. దీంతో డిప్యూటేషన్‌లను రద్దు చేసేందుకు నిర్ణయించినట్టు ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు మాతృ స్థానాలకు రానున్నట్టు పేర్కొంటున్నారు.

సర్దుబాటుతోనే సమస్య

జీవో నెంబరు 17 ప్రకారం విలీనమైన పాఠశాలల్లో సర్దుబాట్లతో ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. అలా కాకుండా బదిలీ ప్రక్రియ ద్వారానే విలీన పాఠశాలల్లో ఉపాధాయులను కేటాయిస్తే మంచిది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని కుదించడంతో ప్రాథమిక పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పదోన్నతుల ద్వారానే నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. బదిలీ ప్రక్రియ న్యాయబద్ధంగానే జరగాలి. విద్యా బోధనకే ప్రాఽధాన్యం ఇచ్చేలా ఉపాధ్యాయులను వినియోగించుకోవాలి.

- పప్పల తిరుమలరావు, ఏపీటీఎఫ్‌ సీనియర్‌ నాయకుడు

Updated Date - 2022-12-15T23:59:31+05:30 IST