ఇది జిల్లా ఆసుపత్రా.. పీహెచ్‌సీనా?

ABN , First Publish Date - 2022-12-30T23:42:11+05:30 IST

‘ఇది జిల్లా ఆసుపత్రి అనుకుంటున్నారా? గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుకుంటున్నారా..? జిల్లా ఆసుపత్రి స్థాయి సేవలు ఇక్కడ ఎందుకు అందడంలేదు..?’ కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది జిల్లా ఆసుపత్రా.. పీహెచ్‌సీనా?
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- టెక్కలిలో వైద్యులు, సిబ్బంది తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

- పనిచేయకపోతే గౌరవంగా తప్పుకోవాలని ఆదేశం

టెక్కలి, టెక్కలి రూరల్‌, డిసెంబరు 30 : ‘ఇది జిల్లా ఆసుపత్రి అనుకుంటున్నారా? గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుకుంటున్నారా..? జిల్లా ఆసుపత్రి స్థాయి సేవలు ఇక్కడ ఎందుకు అందడంలేదు..?’ కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 30 నెలల తరువాత స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆసుపత్రి సలహా సంఘ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పనిచేయడం ఇష్టం లేకపోతే గౌరవంగా తప్పుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది వేతనాలు, ఇతర బిల్లుల విషయంలో డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి రుజువైతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అధునాతన పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు ఉన్నా.. ప్రతి చిన్న కేసుకు శ్రీకాకుళం ఎందుకు రెఫర్‌ చేస్తున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను డా.సూర్యారావును ప్రశ్నించారు. ప్రసూతి వైద్యులు ఉన్నా.. ఎందుకు ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించే పరిస్థితి వస్తుందని సంబంధిత వైద్యులు డా.ధనలక్ష్మీ, డా.జ్ఞానప్రసూనాంబలను నిలదీశారు. కిడ్నీవ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులను శ్రీకాకుళం ఎందుకు పంపిస్తున్నారని ల్యాబ్‌ సిబ్బందిని ప్రశ్నించారు. ఇక్కడ ఇలీసా రీడర్‌ పరీక్షకు సంబంధించి పరికరం లేదని.. వ్యాధి నిర్థారణ శాతం గుర్తింపునకు శ్రీకాకుళం పంపించాల్సి వస్తుందని సిబ్బంది చెప్పారు. వారి సమాధానంపై కలెక్టర్‌ సంతృప్తి చెందలేదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వైద్యుల లైసెన్స్‌ను రద్దుచేసేందుకు సైతం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఆస్పత్రిలో 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెరుగైన సేవలు అందజేయాలని స్పష్టం చేశారు. ఆస్పత్రి సేవలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సైతం అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు సమావేశం అజెండాలలో ఉన్న పలు అంశాలను ఆమోదించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డా.బొడ్డేపల్లి మీనాక్షి, డీసీహెచ్‌ఎస్‌ డా.జె.భాస్కరరావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:42:11+05:30 IST

Read more