కాగితాలపైనే విచారణ!
ABN , First Publish Date - 2022-06-22T05:05:10+05:30 IST
వైద్యఆరోగ్యశాఖలో అక్రమాల విషయమై.. స్పీకర్ ఫిర్యాదు చేయగా రెండేళ్ల తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. తెరవెనుక ‘కాగితాల’పైనే గుట్టుగా విచారణ పూర్తిచేసేశారనే ఆరోపణలు ఉన్నాయి. నలుగురిపై ఫిర్యాదు చేయగా.. ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై బదిలీ వేటు వేసి.. మిగిలిన ముగ్గురిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది. వైద్యఆరోగ్యశాఖ తీరుపై ఏసీబీ దృష్టి సారిస్తేనే.. మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువులు అభిప్రాయపడుతున్నారు.

స్పీకర్ ఫిర్యాదుపై రెండేళ్ల తర్వాత కదలిక
ఎన్హెచ్ఎం ఏవో బదిలీ
మిగిలిన ముగ్గురిపై చర్యలు శూన్యం
వైద్యఆరోగ్యశాఖ తీరుపై చర్చ
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)
వైద్యఆరోగ్యశాఖలో
అక్రమాల విషయమై.. స్పీకర్ ఫిర్యాదు చేయగా రెండేళ్ల తర్వాత మళ్లీ కదలిక
వచ్చింది. తెరవెనుక ‘కాగితాల’పైనే గుట్టుగా విచారణ పూర్తిచేసేశారనే ఆరోపణలు
ఉన్నాయి. నలుగురిపై ఫిర్యాదు చేయగా.. ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై బదిలీ వేటు
వేసి.. మిగిలిన ముగ్గురిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది.
వైద్యఆరోగ్యశాఖ తీరుపై ఏసీబీ దృష్టి సారిస్తేనే.. మరిన్ని వాస్తవాలు
వెలుగులోకి వస్తాయని పలువులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పూర్వపు డీఎంహెచ్‌వో చెంచయ్య, పరిపాలనాధికారి
చిట్టిబాబు(రిటైర్డ్), డీఎంహెచ్‌వో సీసీ శివప్రసాద్, జాతీయ
ఆరోగ్యమిషన్‌లో జిల్లా అకౌంట్స్ అధికారి సాల్మన్‌రాజు(ఔట్ సోర్సింగ్
ఉద్యోగి)పై తీవ్ర అభియోగాలతో స్పీకర్ తమ్మినేని సీతారాం వైద్యఆరోగ్యశాఖ
మంత్రికి 2020 ఫిబ్రవరి 5న ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల్లోని అవినీతి
వివరాలు పొందుపరుస్తూ.. వాటిపై విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ
విచారణాధికారి వివిధ కారణాలతో విచారణ వాయిదా వేస్తూ వచ్చారు. అయితే
సాల్మన్‌రాజు మినహా మిగిలిన ముగ్గురు ప్రస్తుతం శ్రీకాకుళంలో లేరు. అప్పటి
డీఎంహెచ్ఓ చెంచయ్య, పరిపాలనాధికారి చిట్టిబాబు రిటైర్ అయిపోయారు. సీసీ
శివప్రసాద్ బదిలీపై విజయనగరం జిల్లాకు వెళ్లిపోయారు. ఇటీవల సాల్మన్‌రాజు
బదిలీ ఉత్తర్వులతో అసలు విషయం బయట పడింది. స్పీకర్ ఫిర్యాదుపై విచారణలో
భాగంగానే సాల్మన్‌రాజును అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేసినట్టు
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగి అక్రమాలకు
పాల్పడినట్లు తేలినా.. ఇతరత్రా వాటిలో ప్రమేయమున్నా సంబంధిత పోస్టు నుంచి
శాశ్వతంగా తొలగిస్తారు. కానీ అలాచేయలేదు. సాల్మన్‌రాజును మరొక జిల్లాకు
బదిలీచేశారు. ఇదిలా ఉండగా.. స్పీకర్ ఫిర్యాదుపై విచారణ పూర్తయితే
ఔట్సోర్సింగ్ ఉద్యోగి మినహా.. అప్పటి డీఎంహెచ్‌వో, ఏవో, సీసీలపై
తీసుకున్న చర్యలేంటని కొంతమంది ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురినీ
కాపాడేందుకు తెరవెనుక శక్తుల లాబీయింగ్ పని చేసిందనే అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ‘కాగితాల’పైనే గుట్టుగా విచారణ సాగిందనే
ప్రచారం జరుగుతోంది. విచారణాధికారిగా శ్రీకాకుళం ఎవరు వచ్చారు? ఎప్పుడు ఏయే
తేదీల్లో విచారణ నిర్వహించారన్నదీ బయటకు వెల్లడించకపోవడమే ఇందుకు
నిదర్శనమని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. స్పీకర్ ఫిర్యాదుపై
ఏసీబీ స్థాయిలో విచారణ నిర్వహిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని..
పెద్ద అవినీతిపరులు చిక్కుతారని పేర్కొంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే
అజ్ఞాతవ్యక్తుల ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై
ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.