సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-08-15T05:56:32+05:30 IST
జెండా పండగకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు స్వాతంత్య్ర వేడుకలు.. పూర్తయిన ఏర్పాట్లు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి,
ఆగస్టు 14 : జెండా పండగకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో
ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి
బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై
ప్రసంగించనున్నారు. ప్రభుత్వ పనితీరును తెలిపేలా శకటాలను
ప్రదర్శించనున్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు
నిర్వహించనున్నారు. జిల్లాలో ఉత్తమసేవలందించిన అధికారులు, ఉద్యోగులు,
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అవార్డులు,
ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. కాగా, అల్పపీడనం కారణంగా కురుస్తున్న
వర్షాలతో పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నీరు నిలిచిపోయింది. శ్రీకాకుళం
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి
సూచనలు ఇచ్చారు. ఇదిలాఉండగా శ్రీకాకుళంలో జెండా పండగ వాతావరణం నెలకొంది.
నాగావళి వంతెనపై, రహదారులపై జాతీయ జెండాలను అమర్చారు. అన్ని ప్రభుత్వ
కార్యాలయాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు త్రివర్ణ విద్యుత్ కాంతులతో
వెలిగిపోతున్నాయి.
ఉత్తమ పురస్కారాలకు 263 మంది ఎంపిక
కలెక్టరేట్,
ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో 263 మందిని
ఉత్తమసేవా పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ జాబితాను కలెక్టర్ శ్రీకేష్
బాలాజీ లఠ్కర్ ఆదివారం ప్రకటించారు. జిల్లాలో 82 ప్రభుత్వ శాఖలకు
సంబంధించి 256 మంది అధికారులను ఉత్తమ సేవకులుగా ఎంపిక చేశారు. వీరిలో
నలుగురు ఉన్నతాధికారులు, 22 మంది రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నారు. అలాగే,
వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఏడుగురిని ఎంపిక చేశారు. మొత్తం 263 మందికి
సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో నిర్వహించే
స్వాతంత్య్ర వేడుకల్లో పురస్కారాలు అందించనున్నారు.