ప్రభుత్వ కార్యాలయాల్లో.. కరోనా కలకలం!
ABN , First Publish Date - 2022-01-23T04:38:19+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో.. కరోనా కలకలం!

- కొంతమంది ఉద్యోగులకు పాజిటివ్
- పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల్లోనూ బాధితులు
- మంత్రి, స్పీకర్ కార్యాలయాలయాల మూత
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తిలో భాగంగా విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కలకలం సృష్టిస్తోంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. కలెక్టరేట్, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు గ్రామ,వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బందిలో అధిక శాతం మంది కరోనా బాధితులు ఉన్నారు. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. విధులకు హాజరుకాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చిన ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటా జ్వరపీడితులు ఉన్నారు. చాలామంది దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్తే కరోనా పరీక్ష తప్పనిసరిగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామందిలో వైరస్ బయటపడుతోంది. ప్రతి పదిమందిలో ఆరుగురుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న కొంతమంది వైద్యులతో పాటు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో నలుగురి సిబ్బంది ‘పాజిటివ్’ కారణంగా సెలవులో ఉన్నారు. సంక్షేమ భవన్‌లోని డ్వామా, వెలుగు, ఎస్సీ, బీసీ, డీఆర్‌డీ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో పలువురు కరోనాతో బాధపడుతున్నారు. వీరంతా సెలవులు పెట్టి ఐదు రోజుల పాటు ఇంటివద్ద చికిత్సలు పొందుతున్నట్లు సమాచారం. చాలా కార్యాలయాల్లో కనీసం అర్జీలను స్వీకరించేవారు కూడా లేకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వివిధ శాఖల ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా ఎవరినీ కలిసేందుకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా వ్యవహారాలు చక్కబెడుతున్నారు.
స్పందన కార్యక్రమం రద్దు...
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కూడా గత వారం రద్దు చేశారు. ఈ వారం కూడా ఆన్‌లైన్‌లోనే అర్జీలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ బ్యాంకుల్లో ఉద్యోగులకు పాజిటివ్ నిర్థారణ జరగడంతో క్యాష్‌లెస్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్రీకాకుళం ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంలో పలువురుకి కరోనా పాజిటివ్ నిర్థారణ జరిగింది. జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు కొన్ని పోలీసు స్టేషన్లలో సిబ్బందికి కూడా కరోనా సోకడంతో సెలవుపై వెళ్లిపోతున్నారు. దాదాపు అన్ని పోలీసు స్టేషన్లలో ఒకరిద్దరు చొప్పున బాధితులు ఉన్నారు.
మంత్రి, స్పీకర్ కార్యాలయాలకు సెలవులు...
కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. క్యాంపు కార్యాలయానికి గత వారం రోజులుగా సెలవు ప్రకటించారు. ఆమదాలవలసలోని స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాలయానికి కూడా ఈ నెలాఖరు వరకు సెలవు ప్రకటించేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్యాంపు కార్యాలయాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. నేతలంతా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను వాయిదా వేసేశారు.