సమస్యలు పరిష్కరిస్తేనే..
ABN , First Publish Date - 2022-10-18T04:44:17+05:30 IST
‘భావనపాడు పోర్టు కాదు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుగా పిలవాలి. మా సమస్యలను 75 డిమాండ్ల రూపంలో మీముందు ఉంచాం. వాటిని పరిష్కరిస్తేనే.. పోర్టు నిర్మాణానికి అంగీకరిస్తాం’ అని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామపెద్దలు స్పష్టం చేశారు.
- పోర్టు నిర్మాణానికి అంగీకరిస్తాం
- స్పష్టం చేసిన మూలపేట వాసులు
- మీ త్యాగం వృథాగా పోదు: మంత్రి అప్పలరాజు
- డిమాండ్లు నెరవేర్చేందుకు కృషి చేస్తాం: కలెక్టర్
టెక్కలి, అక్టోబరు 17: ‘భావనపాడు పోర్టు కాదు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుగా పిలవాలి. మా సమస్యలను 75 డిమాండ్ల రూపంలో మీముందు ఉంచాం. వాటిని పరిష్కరిస్తేనే.. పోర్టు నిర్మాణానికి అంగీకరిస్తాం’ అని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామపెద్దలు స్పష్టం చేశారు. సోమవారం టెక్కలిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధ్యక్షతన.. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పోర్టు ఏర్పాటు విషయమై మూలపేట గ్రామ పెద్దలతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏపీ మారిటైం బోర్డు ప్రతినిధులు, టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రామ పెద్దలు జీరు రాంబాబు, బాబూరావు, నక్క బీమారావు తదితరులు మాట్లాడుతూ.. ‘భూములు కోల్పోతున్న మాక్కు ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే రూ.18 లక్షల పరిహారం చాలా తక్కువ. పరిహారాన్ని పెంచాలి. గ్రామంలో పీడీఎఫ్ కింద ఎంతమంది అర్హులో వివరాలు ఇవ్వాలి. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. 75 డిమాండ్లను పరిష్కరించాలి’ అని కోరారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతే పోర్టు నిర్మించాలని స్పష్టం చేశారు.
- మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ మూలపేట ప్రజల త్యాగంతో పోర్టు నిర్మిస్తాం. మీ త్యాగం వృథా పోదు. భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ పరిహారం అందజేస్తాం. యూత్ ప్యాకేజీ కల్పిస్తాం. స్థానికులకే అధికంగా ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తాం. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. చట్టప్రకారం మీకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా అందుతుంది. ఎవరైనా తప్పుడు వివరాలు సమర్పించి లబ్ధి పొందితే రికవరీ తప్పదు’ అని తెలిపారు. ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మూలపేట వాసులకు మంత్రి సూచించారు.
- కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ మాట్లాడుతూ ‘మూలపేట పంచాయతీ ప్రజల 75 డిమాండ్లలో సాధ్యమైనంత మేర పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగాలకు సంబంధించి లీగల్‌గా ఎటువంటి హామీ ఇవ్వలేం. మీరు కోరుకునే చోట.. మీకు ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ప్రస్తుత సౌకర్యాలకు మించి ఉంటుంది. ప్రభుత్వ ధర ప్రకారం భూములకు పరిహారం చెల్లిస్తాం. వచ్చే మంగళ, బుధవారాల నాటికి మూలపేట పంచాయతీ ప్రజలంతా సిద్ధమవ్వాలి’ అని సూచించారు. ఇందుకు సంబంధించి సర్వే ప్రక్రియ ఈ వారంలో పూర్తిచేయాలని సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి, సంతబొమ్మాళి తహసీల్దార్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నవీన్‌కుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.