భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-25T06:32:38+05:30 IST

అనారోగ్యంతో భార్య మృతిచెందడంతో వేదనకు గురైన భర్త మరుసటిరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
సత్యనారాయణ (ఫైల్‌ ఫొటో)

- అనాథలైన పిల్లలు 


చింతపల్లి, సెప్టెంబరు 24: అనారోగ్యంతో భార్య మృతిచెందడంతో వేదనకు గురైన భర్త మరుసటిరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగళ్లు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...రేగళ్లు గ్రామంలో పాలిక సత్యనారాయణ (45), చందో (38) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె పాలిక సురేఖకు రెండేళ్ల కిందట వివాహమైంది. ఆమె అత్తవారి ఇంట్లో ఉంటోంది. పెద్ద కుమారుడు సూర్రాజు ఎనిమిదో తరగతి వరకు చదివి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్నాడు. మరో కుమార్తె చిన్నారి చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి, కుమారుడు కిరణ్‌ బాలుర ఆశ్రమ పాఠశాల-2లో ఆరో తరగతి చదువుతున్నారు. సత్యనారాయణ భార్య చందో రెండు వారాల కిందట అనారోగ్యానికి గురైంది. భార్యను లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఆమెకు వ్యాధి నయం కాకపోవడంతో లోతుగెడ్డ పీహెచ్‌సీ వైద్యుల సూచన మేరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించారు. కేజీహెచ్‌సీలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం క్షీణించడంతో చందో గురువారం మృతిచెందింది. భార్య మృతదేహానికి శుక్రవారం ఉదయం స్వగ్రామంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మరణంతో సత్యనారాయణ తీవ్ర వేదనకు గురయ్యాడు. అదేరోజు సాయంత్రం పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. స్థానిక వైద్యులు కేజీహెచ్‌కి తరలించారు. శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు రోజుల వ్యవధిలో తల్లి, తండ్రి మరణించడంతో నలుగురు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాభర్తల మృతితో రేగళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Read more