ఆశలు ఆవిరి..

ABN , First Publish Date - 2022-06-13T05:05:51+05:30 IST

ఆశలు ఆవిరి..

ఆశలు ఆవిరి..
తీరం ఒడ్డుకు చేరిన మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

- సముద్రంలో గల్లంతైన ముగ్గురూ మృతి

- జీరుపాలెం తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు 

- కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

రణస్థలం, జూన్‌ 12: సముద్రంలో గల్లంతైన తమవారు ప్రాణాలతో తిరిగొస్తారన్న కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరయ్యాయి. గల్లంతైన ముగ్గురూ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ శుభకార్యం కోసం రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి వచ్చిన విశాఖపట్నం జిల్లా  భీమునిపట్నం మండలం కె.నగరపాలెం గ్రామానికి చెందిన తిరుపతి గణేష్‌(33), ఈయన కుమార్తె మానస(9), మేనకోడలు వానమామల దీవెన(18)లు పోతయ్యవలస సముద్ర తీరంలో శనివారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. వీరి కోసం రాత్రంతా పోలీసులు, మత్స్యకారులు, కుటుంబ సభ్యులు సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు. ఆదివారం ఉదయం వీరి మృతదేహాలు జీరుపాలెం తీరానికి కొట్టుకొచ్చాయి. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల సమాచారంతో కుటుంబ సభ్యులు జీరుపాలెం తీరానికి చేరుకున్నారు. అక్కడ తన భర్త, కుమార్తె, మేనకోడలు మృతదేహాలను చూసి ఈశ్వరమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. పదేళ్ల కొడుకు యశ్వంత్‌.. తండ్రి మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కంటితడి పెట్టించింది. గణేష్‌ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  తమకు ఇప్పుడు దిక్కెవ్వరని గుండెలు పగిలేలా ఈశ్వరమ్మ రోదించింది. దీవెన చోడవరంలో ఇంటర్‌ చదువుతుంది. ఘటనాస్థలానికి జేఆర్‌పురం సీఐ స్వామినాయుడు, ఎస్‌ఐ జి.రాజేష్‌ చేరుకొని శపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం  సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.   

Updated Date - 2022-06-13T05:05:51+05:30 IST