విధులపై వెళ్లి వస్తూ...

ABN , First Publish Date - 2022-10-19T05:09:19+05:30 IST

విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తున్న ఓ హోంగార్డును బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. శ్రీకాకుళం నగరంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

విధులపై వెళ్లి వస్తూ...
రామారావు మృతదేహం.. ఇన్‌సెట్‌లో ఫైల్‌ఫొటో

- రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం
- చింతలబడవంజలో విషాదఛాయలు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ఆమదాలవలస/ఎల్‌.ఎన్‌,పేట, అక్టోబరు 18 :
విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తున్న ఓ హోంగార్డును బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. శ్రీకాకుళం నగరంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్‌.ఎన్‌.పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన సనపల రామారావు(37).. ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. పట్టణంలోని మోనింగి వీధిలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. కార్యాలయం పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వెళ్లి తిరిగి ఆమదాలవలస వస్తుండగా ఆదివారంపేట-బలగ జంక్షన్‌ వద్ద శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. బస్సును తప్పించే క్రమంలో ఢీ కొని.. బైక్‌తో సహా రోడ్డుపై పడిపోవడంతో రామారావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఆమదాలవలస సీఐ పల్లా పైడయ్య, ఎస్‌ఐ వై.కృష్ణ చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రామారావు మృతిపై విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. రామారావుకు తల్లిదండ్రులు అమ్మారావు, మహలక్ష్మి, భార్య ధనలక్ష్మి, పన్నెండేళ్ల కుమార్తె తేజశ్రీ, తొమ్మిదేళ్ల కుమారుడు రుషి ఉన్నారు. రామారావు మృతితో చింతలబడవంజ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై శ్రీకాకుళం ట్రాఫిక్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Updated Date - 2022-10-19T05:09:19+05:30 IST