కుండపోత

ABN , First Publish Date - 2022-10-08T05:02:35+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం శ్రీకాకుళంతో పాటు చుట్టు పక్క మండలాల్లో భారీ వర్షం పడింది.పది నిమిషాలు.. అరగంటకోసారి తెరిపిస్తూ.. మళ్లీ వర్షం కురుస్తూనే ఉంది. శ్రీకాకుళంలో అత్యధికంగా 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో శ్రీకాకుళం నగరం జలమయమైంది.

కుండపోత
శ్రీకాకుళం పాత బస్టాండ్‌ వద్ద రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

- జిల్లాలో విస్తారంగా వర్షాలు
- జలమయమైన రహదారులు
- శ్రీకాకుళంలో అత్యధికంగా వర్షపాతం నమోదు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ ఎచ్చెర్ల/ టెక్కలి)

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం శ్రీకాకుళంతో  పాటు చుట్టు పక్క మండలాల్లో భారీ వర్షం పడింది.పది నిమిషాలు.. అరగంటకోసారి తెరిపిస్తూ.. మళ్లీ వర్షం కురుస్తూనే ఉంది. శ్రీకాకుళంలో అత్యధికంగా 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో శ్రీకాకుళం నగరం జలమయమైంది. రహదారులన్నీ ముంపునకు గురయ్యాయి. హడ్కోకాలనీ, ఆదివారం పేట, బలగమెట్టు, పెట్రోమాక్స్‌వీధి, ఇలిసిపురం, డేఅండ్‌నైట్‌ జంక్షన్‌, రైతుబజార్‌ రోడ్డు, రామలక్ష్మణ్‌ జంక్షన్‌ వద్ద నీరు నిలిచిపోయింది. రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఎచ్చెర్ల, బూర్జ, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. కవిటి మండలంలో అత్యల్పంగా 0.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో నాగావళి, వంశధార, బాహుదా నదులు ఉప్పొంగుతున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురై.. చెరువులను తలపించాయి. టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి పంచాయతీ పరిధిలో సీతగెడ్డపై భారీగా వరదనీరు రావడంతో లోతట్టు ప్రాంతం ముంపునకు గురైంది. పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామ్‌నగరం తదితర గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. టెక్కలిలో మాలపేటగెడ్డ, దుర్గగెడ్డ, బొప్పాయిపురంగెడ్డల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. నౌపడా-మెళియాపుట్టి రోడ్డులో డమర సమీపంలో రోడ్లపైకి నీరు చేరింది. శనివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా అధికారులు ప్రకటించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. వర్షాలు తగ్గేవరకు తీర ప్రాంతం దాటవద్దని సూచించారు.

 కొట్టుకుపోయిన కల్వర్టు
 భారీ వర్షాలకు ఎచ్చెర్ల మండలంలోని అంబేడ్కర్‌ నగ ర్‌-కొయ్యవానిపేట గ్రామాల మధ్య ఎర్రగెడ్డపై ఉన్న కల్వర్టు శుక్రవారం కొట్టు కుపోయింది.  పదిహేను రోజుల కిందట ఈ కల్వర్టు పాక్షికంగా దెబ్బతింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్వర్టు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో సెగిడిపేట, రుప్పపేట, అంబేడ్కర్‌ నగర్‌, కొయ్యవానిపేట, పెదకొయ్యవానిపేట, తంగివానిపేట గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎర్రగెడ్డపై శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.


శుక్రవారం నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లలో)
------------------------
శ్రీకాకుళం    54.25
ఎచ్చెర్ల    30.25
బూర్జ    26.0
ఎల్‌.ఎన్‌.పేట 15.75
లావేరు    12.75
పొందూరు    12.0
ఆమదాలవలస 11.75
రణస్థలం      11.25
హిరమండలం 10.5
కొత్తూరు       8.5
సంతబొమ్మాళి  7.25
జలుమూరు       6.0
నందిగాం     6.0
నరసన్నపేట  6.0
టెక్కలి     5.75
ఇచ్ఛాపురం     4.75
పాతపట్నం     4.5
పలాస    4.25
సరుబుజ్జిలి    3.75
జి.సిగడాం    3.5
సోంపేట    3.25   
మందస    2.0
గార    1.0
కవిటి    0.25

Read more