మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-12-07T23:57:05+05:30 IST
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ హెచ్చరించారు.
అరసవల్లి: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ హెచ్చరించారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ (మారథాన్)లో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీ మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో లింగ వివక్షతకు ఇక ఎంతమాత్రం చోటు లేదన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు సమాజంలో ముందుకు వెళ్లాలని చెప్పారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ టీపీ విఠలే శ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు విద్యాసాగర్, మహిళా శిశు సంక్షేమాధికారి కె.అనంతలక్ష్మి, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్ పాల్గొన్నారు.
రైతులను ప్రోత్సహించాలి
సేంద్రియ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని రైతుబజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యూ ఆర్గా నిక్ స్టోర్స్‌ను బుధవారం ప్రారంభించారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగానికి బదులు ఆవు పేడతో తయారు చేసిన ఎరువులతో పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మూకళ్ల తాతబాబు, మార్కెటింగ్‌శాఖ ఏడీ కైలాసరావు పాల్గొన్నారు.