రాళ్ల ఖర్చుకు రాంరాం!

ABN , First Publish Date - 2022-06-28T05:35:16+05:30 IST

జిల్లాలో సమగ్ర భూసర్వే అన్ని మండలాల్లో చేపడుతున్నారు. తొలుత వివిధ కారణాలతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో కాస్త వేగం పుంజుకుంది. కానీ సరిహద్దు రాళ్ల విషయంలో కొత్త చిక్కొచ్చి పడింది. రాళ్లు పాతే పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు.

రాళ్ల ఖర్చుకు రాంరాం!
పొలంలో సర్వే రాయి పాతుతున్న సిబ్బంది

సమగ్ర సర్వేలో రాళ్ల వ్యయాన్ని తగ్గించిన ప్రభుత్వం

కూలీ ఖర్చు కుదింపు
ఆసక్తి చూపని వేతనదారులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో సమగ్ర భూసర్వే అన్ని మండలాల్లో చేపడుతున్నారు. తొలుత వివిధ కారణాలతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో కాస్త వేగం పుంజుకుంది. కానీ సరిహద్దు రాళ్ల విషయంలో కొత్త చిక్కొచ్చి పడింది. రాళ్లు పాతే పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. జిల్లాలో 30 మండలాల్లో 158 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. సరిహద్దు రాళ్లను ఆయా గ్రామాలకు చేరవేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు గతం కంటే చెల్లింపులు తక్కువ చేస్తుండడంతో కూలీలు ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. సర్వే పూర్తయిన గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన సరిహద్దు రాళ్లు పాతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిధులు కూడా విడుదల చేశారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధరలు తక్కువగా ఉన్నాయని.. పనులు చేయించడం కష్టతరమని సిబ్బంది వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి..
 భూసర్వే ప్రక్రియలో భాగంగా సరిహద్దుల్లో మూడు రకాల రాళ్లను వినియోగిస్తారు. మొదటి తరగతి ‘ఏ’ రాళ్లను మూడు గ్రామాలు కలిసే సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తారు. ‘బీ’ విభాగం రాళ్లను గ్రామ సరిహద్దుల్లో, ప్రభుత్వ స్థలాల చుట్టూ వేసేందుకు వినియోగిస్తారు. మూడో విభాగం రాళ్లను రైతుల పొలాల సరిహద్దులను నిర్ణయించాక పాతుతారు. ఈ మూడు రకాల రాళ్లను నాటేందుకు సర్వే ప్రారంభంలో.... ‘ఏ’ విభాగం రాయి పాతేందుకు రూ.120,  ‘బీ’ విభాగం రాయి పాతేందుకు రూ.100 వరకు ఇస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.36 వరకూ మాత్రమే కూలీ చెల్లిస్తున్నారు. అంతే కాకుండా రవాణా చార్జీలు కూడా ఆ మొత్తంలోనే భరించాలని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. నలుగురు కూలీలను నియమించుకుని వారందరికీ కలిపి రోజుకు రూ.2,000 ఇవ్వాలంటే కనీసం 56 రాళ్లు పాతాల్సి వస్తుంది. పొలాల్లో ఒక్క రోజులోనే అన్ని రాళ్లు పాతడం సాఽధ్యమయ్యేలా కనిపించడం లేదు. వాహనం సమకూర్చుకుని లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసుకుని గ్రామాలకు తీసుకువెళ్లాంటే మరింత కష్టతరంగా మారుతుందని సిబ్బంది వాపోతున్నారు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రక్రియ వేగవంతం
గతంలో ఒక్కో రాయికి రూ.100కుపైగా ఖర్చు చేసిన విషయం వాస్తవమే. పైలెట్‌ గ్రామాలు కావడంతో వేగంగా చేయించాల్సి వచ్చింది. అందుకు ఖర్చు కాస్త ఎక్కువైంది. ప్రస్తుతం జిల్లా మొత్తం చేయాలి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉన్నతాధికారులు కొత్త ధరలు నిర్ణయించారు. ప్రస్తుతం కూలీలు ఈ మొత్తానికి పని చేసేందుకు కొన్ని చోట్ల వెనుకంజ వేస్తున్నారు. అయినా పని ఆపకుండా ప్రక్రియ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
- కె.ప్రభాకర్‌, జిల్లా సర్వే అండ్‌ లాండ్‌ అధికారి

  

Updated Date - 2022-06-28T05:35:16+05:30 IST