ప్రమాదమని తెలిసినా!

ABN , First Publish Date - 2022-08-16T05:36:00+05:30 IST

అది నాగావళి నదీ తీరమని తెలుసు. అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం సరికాదని తెలుసు. నిబంధనలకు విరుద్ధమని కూడా తెలుసు. అయినా అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా రాజకీయ ఒత్తిళ్లతో రూ.39 లక్షలతో వెల్‌నెస్‌ కేంద్రంతో పాటు రైతుభరోసా కేంద్రాన్ని నిర్మించారు. తీరా నాగావళి నదిలో వరదలకు రెండు నిర్మాణాలు కొట్టుకుపోయాయి.

ప్రమాదమని తెలిసినా!
ఆర్బీకేలో గుంతలను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ పద్మావతి

నాగావళి నదీ తీరంలో ప్రభుత్వ భవనాలు
తొలుత వెల్‌నెస్‌ కేంద్రం.. ఇప్పుడు ఆర్బీకే
వరదలకు కొట్టుకుపోయిన నిర్మాణాలు
రూ.39 లక్షల ప్రజాధనం వృథా
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
ఆమదాలవలస రూరల్‌, ఆగస్టు 15:
అది నాగావళి నదీ తీరమని తెలుసు. అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం సరికాదని తెలుసు. నిబంధనలకు విరుద్ధమని కూడా తెలుసు. అయినా అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా రాజకీయ ఒత్తిళ్లతో రూ.39 లక్షలతో వెల్‌నెస్‌ కేంద్రంతో పాటు రైతుభరోసా కేంద్రాన్ని నిర్మించారు. తీరా నాగావళి నదిలో వరదలకు రెండు నిర్మాణాలు కొట్టుకుపోయాయి. రూ.లక్షల ప్రజాధనం వృథా అయ్యింది. కలివరంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేసే ఘటనలు వెలుగుచూశాయి. తొలుత రూ.17 లక్షలతో వెల్‌నెస్‌ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. అయితే నదీ తీరం కావడంతో అక్కడ నిర్మాణం సరికాదని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినకుండా నిర్మించారు. తీరా వరదలకు హిల్‌నెస్‌ కేంద్రం కొట్టుకుపోయింది. పోనీ అక్కడ నుంచైనా అధికారులు మేల్కొన్నారంటే అదీ లేదు. రైతుభరోసా కేంద్రాన్ని కూడా నదీ తీరంలో రూ.22 లక్షలతో నిర్మించారు. తాజాగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ నిర్మాణం కూడా కొట్టుకుపోయింది. అధికారుల అనాలోచిత నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కొట్టుకుపోయిన ఆర్బీకేను సోమవారం తహసీల్దారు వైవీ పద్మావతి పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్టు  తెలిపారు.


 

Updated Date - 2022-08-16T05:36:00+05:30 IST