ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చు చేయరా?

ABN , First Publish Date - 2022-07-06T05:14:45+05:30 IST

‘ప్రజోపయోగ పనులకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు కేటాయించాను. నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతేనా’..అంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు విద్యుత్‌ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చు చేయరా?
ఈఈతో మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

తొమ్మిది నెలలవుతున్నా పనులు ఎందుకు చేపట్టలేదు?

విద్యుత్‌ శాఖ అధికారులపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం

టెక్కలి, జూలై 5: ‘ప్రజోపయోగ పనులకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు కేటాయించాను. నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతేనా’..అంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు విద్యుత్‌ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయానికి వెళ్లిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఎంపీ ల్యాడ్‌ నిధులతో చేపట్టాల్సిన పనుల్లో జాప్యంపై ప్రశ్నించారు. తాను ఎంపీ అయిన తరువాత ఎంపీ ల్యాడ్స్‌లో 1,400 పనులకు నిధులు ఇచ్చినట్టు చెప్పారు. కానీ ఏనాడూ కార్యాలయాలకు వెళ్లి ప్రశ్నించింది లేదన్నారు. నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతోనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వీఏ రాజశేఖర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  మందస మండలం లింబుగాం, బేతాళపురం, పోలాకి మండలం ముప్పిడి, కుసింపాలవలస, నరసన్నపేట పట్టణంలో రెండుచోట్ల విద్యుత్‌ శాఖకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్‌ నిధులు విడుదల చేశానని... తొమ్మిది నెలలు గడుస్తున్నా ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించారు.  ఎంపీ లాడ్స్‌ నిధులు ఖర్చు చేయడం తప్పా?  ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఎందుకు చేయడం లేదు? కావాలనే మీరు జాప్యం చేస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  జిల్లా కలెక్టర్‌ పాలనా అనుమతులు ఇచ్చినప్పటికీ... మళ్లీపనులకు రిజిస్ట్రేషన్లు చేయాలని మీ శాఖ కొర్రీలు వేయడంలో ఆంతర్యం ఏమిటని మండిపడ్డారు.ఈ ఏడు పనులకు సంబంధించి పరిశీలించి విషయం తెలియజేస్తామని ఈఈ రాజశేఖర్‌ ఎంపీకి బదులిచ్చారు. వీరితో పాటు మెండ దాసునాయుడు, మట్ట పురుషోత్తం, బాలకృష్ణ, దల్లి ప్రసాద్‌రెడ్డి, చోడిముడి కిరణ్‌, లవకుమార్‌, కామేసు, మామిడి రాము, కాళీ బెహరా, రెయ్యి ప్రీతీష్‌ తదితరులున్నారు.
Read more