కాళీయమర్దనా.. పాహిమాం

ABN , First Publish Date - 2022-02-13T04:12:26+05:30 IST

కాళీయమర్దనా.. పాహిమాం

కాళీయమర్దనా.. పాహిమాం
వంశధారలో స్వామిచక్రతీర్థస్నానం..

- శాలిహుండం యాత్రకు పోటెత్తిన భక్తులు

- జనసంద్రంగా శ్వేతగిరి

- ఘనంగా వేణుగోపాల స్వామి చక్రతీర్థస్నానం

శ్వేతగిరి (గార), ఫిబ్రవరి 12:  శాలిహుండం కొండపై కొలువైన కాళీయమర్దన వేణుగోపాలస్వామి యాత్రకు భక్తులు పోటెత్తారు. భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం శ్వేతగిరి భక్తజనంతో నిండిపోయింది. వేణుగోపాలుని నామస్మరణతో కొండ మార్మోగిపోయింది. ఈ యాత్రకు ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌, తదితర ప్రాంతాల నుంచి భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. శనివారం వేకువజామున స్వామివారి తిరువీఽధులను ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో  ఉత్సవమూర్తులను పల్లకిలో కొండపక్కనే ఉన్న వంశధార నదికి తీసుకెళ్లి  చక్రతీర్థస్నానం చేయించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వేలాదిమంది భక్తులు స్వామివారితో పాటు నదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. తిరిగి కాలినడకన కొండపైకి చేరుకొని వేణుగోపాలుడిని దర్శించుకున్నారు. కొండ మధ్యలో ఉన్న  వీరవసంతేశ్వర, కొండ కిందన ఉన్న నర్సింహ, వేంకటేశ్వర, వరదరాజస్వాములను కూడా భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. 


కిటకిటలాడిన క్యూలైన్లు..

వేణుగోపాలుని దర్శనానికి భక్తులు గంటల తరబడి బారులుతీరారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి.  నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలసల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. దూరప్రాంత భక్తులు ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాల్లో యాత్రకు చేరుకున్నారు.  భక్తులు రెండుమెట్ల మార్గాలతో పాటు ఘాట్‌రోడ్‌ గుండా ఎత్తయిన కొండపైకి చేరుకున్నారు.  దీంతో వేకువజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. అర్చకస్వాములు, ట్రస్ట్‌బోర్డు అధ్యక్షులు  సుగ్గు మధురెడ్డి దంపతులు స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విశేష పుష్పమాలలతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో గార ఎస్‌ఐ కె.లక్ష్మి, ఇతర ఎస్‌ఐలతో పాటు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.


స్వచ్ఛంద సంస్థల సేవలు 

వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలు అందించాయి. బోరవానిపేట, బూరవెల్లి, గార ప్రాంతాలకు చెందిన సత్యసాయి భక్తులు మంచినీరు, మజ్జిగ, ప్రసాదం పంచిపెట్టారు. పూసర్లపాడు, వస్త్రపురి కాలనీల వద్ద అన్నదానం చేశారు.

Updated Date - 2022-02-13T04:12:26+05:30 IST