వైటీసీల నిర్వీర్యం
ABN , First Publish Date - 2022-11-20T00:12:36+05:30 IST
వైటీసీలు.. గిరిజన యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెలకొల్పారు. ఎంతోమంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. స్వయం ఉపాధి కల్పించారు. కానీ వైసీపీ వచ్చాక వాటి గురించే పట్టించు కోవడంలేదు. నిధులు ఇవ్వక పోవడంతో అవి నిర్వీర్యమై పోతున్నాయి. ఈ కారణంగా శిక్షణ నిలిచిపోయి గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభం
అత్యాధునిక భవనాల నిర్మాణం
నిరుద్యోగ గిరిజన యువతకు శిక్షణ
వైసీపీ వచ్చాక నిధులివ్వని వైనం
13 నెలలుగా సిబ్బందికి అందని జీతాలు
యువతకు నిలిచిపోయిన తర్ఫీదు
ఉపాధికి దూరమవుతున్న గిరిజనులు
(మెళియాపుట్టి)
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కరువవుతోంది. గిరిజనులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో యువత శిక్షణ కేంద్రాలు(వైటీసీ) నెలకొల్పారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించడం లేదు. ఫలితంగా శిక్షణ నిలిచిపోయి గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారు. సిబ్బంది వేతనాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో శ్రీకాకుళం, పాతపట్నం, మందస, సీతంపేటలో యువత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో లక్షలాది రూపాయలతో అత్యాధునిక భవనాలు నిర్మించారు. వందలాది మంది గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాలపై శిక్షణ ఇచ్చేవారు. వివిధ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా కృషి చేసేవారు. టైలరింగ్, ఫ్లంబింగ్, పుట్టగొడుగుల పెంపకం, కంప్యూటర్స్, నర్సింగ్, ఆటోమెబైల్ తదితర రంగాలపై శిక్షణ కల్పించేవారు. దీంతోపాటు అధికంగా డీఎస్సీ, కానిస్టేబుల్, ఆర్మీ, టెట్, ఆర్‌ఆర్‌బీ వంటి పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. శ్రీకాకుళంలో 53 బ్యాచ్‌ల్లో 1,446 మందికి, పాతపట్నంలో 28 బ్యాచ్‌ల్లో 853 మందికి, మందసలో 15 బ్యాచ్‌లో 544 మందికి, సీతంపేటలో 26 బ్యాచ్‌ల్లో 900 మంది నిరుద్యోగులకు శిక్షణ కల్పించామని అధికారులు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైటీసీలను పట్టించుకోవడం లేదు. సిబ్బందికి వేతనాలు అందజేయడం లేదు. కేంద్రాల నిర్వహణకు సైతం నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని నెలలుగా శిక్షణలు నిలిచిపోయాయి. దీంతో గిరిజన యువత ఉపాధికి దూరమవుతున్నారు.
సిబ్బందికి.. ఇబ్బందులు
సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నాలుగు యువత శిక్షణ కేంద్రాల్లో మేనేజర్, కేర్‌టేకర్స్, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ గార్డులు.. ఇతర సిబ్బందిని కలుపుకొని మొత్తం 24 మంది పనిచేస్తున్నారు. వీరికి గత ఏడాది అక్టోబరు నుంచి జీతాలు చెల్లించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబ్బందిని ఆప్కాస్‌లో విలీనం చేసింది. కానీ, నిధులు లేక జీతాలు చెల్లించడం లేదు. ఐటీడీఏ అధికారులను అడుగుతుంటే రకరకాల కారణాలు చూపుతున్నారు. 13 నెలలుగా వేతనాల బకాయి ఉండడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మందస వైటీసీ భవనాలను కృష్ణపట్నం పోర్టు అద్దెకు తీసుకుంది. కానీ సక్రమంగా అద్దె చెల్లించడం లేదు. రూ.10 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పాతపట్నం వైటీసీలో మెళియాపుట్టి ఏకలవ్య పాఠశాల నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం వైటీసీలో మాత్రం సూపర్-60 విద్యార్థులకు ఐఐటీ శిక్షణ ఇస్తున్నారు. సీతంపేట వైటీసీలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జీతాల బకాయిలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు. తమకు సక్రమంగా శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుద్యోగులుగా మిగులుతున్నాం..
టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన నిరుద్యోగులకు వైటీసీల ద్వారా శిక్షణ ఇచ్చేవారు. చాలా మంది శిక్షణ పొంది.. వివిధ పరిశ్రమల్లో ఉపాధి పొందారు. ప్రస్తుతం శిక్షణ లేకపోవడంతో నా లాంటి ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం.
- సవర దేసయ్య, నందవ
నివేదికలు అందజేశాం..
వైటీసీలో శిక్షణ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. సిబ్బంది జీతాల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తప్ప జీతాలు చెల్లించలేం.
- రోసిరెడ్డి, ఐటిడిఏ ఏపివో, సీతంపేట.