జిల్లాలో నకిలీ మద్యం!
ABN , First Publish Date - 2022-12-16T00:05:22+05:30 IST
జిల్లాలో పొరుగు మద్యం, సారా ఏరులై పారుతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. కొంతమంది వ్యాపారులు బ్రాండెడ్ పేరిట నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణంలో నాసిరకం, కొత్త బ్రాండ్లే దొరుకుతున్నాయి.
సీసాలపై తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల ముద్ర
బ్రాండెడ్ పేరిట జిల్లాలో చెలామణి
వారం క్రితం పోలీసులకు చిక్కిన భారీ డంప్
దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఈబీ అధికారులు
ఇది ఒడిశా ముఠా పనేనని అనుమానం
(రణస్థలం)
- ఈ నెల 3న ఒడిశా నుంచి విశాఖకు ఓ ముగ్గురు వ్యాన్‌లో తరలిస్తుండగా.. జేఆర్ పురం(రణస్థలం) పోలీసులకు పట్టుబడిన మద్యం నిల్వలు ఇవి(పై చిత్రం). ఈ మద్యం సీసాలపై తెలంగాణ ప్రభుత్వం సీల్ ఉంది. దీనిపై పోలీసులు నిందితులను విచారణ చేపట్టగా.. నకిలీ మద్యంగా ఒప్పుకున్నట్టు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు ఆమదాలవలస మండలం కుద్దిగాం వద్ద భారీ డంప్ లభ్యమైంది. ఈ వ్యవహారంలో గతంలో నకిలీ మద్యం తయారు చేసిన ముఠాల పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు, ఎస్ఈబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
..................
- ఏడాది కిందట రణస్థలం మండలం దోనిపేట సముద్ర తీరానికి అనుమానాస్పదంగా ఓ నాటుపడవ చేరింది. అప్పటికే సమాచారముందుకున్న పోలీసులు, ఎస్ఈబీ అధికారులు పడవను పరిశీలించారు. సుమారు 5వేల సారా ప్యాకెట్లు పడవలో లభ్యమయ్యాయి.
..................
- రెండేళ్ల కిందట కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమదాలవలసలో నకిలీ మద్యం తయారుచేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో మహిళ సూత్రధారి. ఒడిశాకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి బ్రాండెడ్ మద్యం పేరిట నకిలీ మద్యం చలామణి చేసేవారు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు వల పన్ని పట్టుకున్నారు.
..................
..ఇలా జిల్లాలో పొరుగు మద్యం, సారా ఏరులై పారుతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. కొంతమంది వ్యాపారులు బ్రాండెడ్ పేరిట నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణంలో నాసిరకం, కొత్త బ్రాండ్లే దొరుకుతున్నాయి. ఒడిశాలో మాత్రం అన్నిరకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే వాటిని తెచ్చి జిల్లాలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. నకిలీ మద్యం తాగితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. ఒడిశా నుంచి తెచ్చిన మద్యం సీసాల్లో కొన్ని రసాయనాలు నింపుతారు. నిషా కోసం కొన్నిరకాల అల్కాహాల్ డోస్ పెంచుతారు. బ్యాటరీ గుండతో పాటు ఇతరత్రా వ్యర్థ పదార్థాలను సైతం కలిపి నకిలీ మద్యాన్ని తయారుచేస్తారు. అచ్చం ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు, అక్కడి ఎక్సైజ్ ముద్రలను అతికిస్తారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న ముఠా ద్వారా వాటిని చెలామణి చేస్తున్నారు. అలాగే జిల్లాలో సారా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఒక్కో ప్యాకెట్ రూ.80 నుంచి రూ.100కు లభిస్తుండడంతో మందుబాబులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒడిశా నుంచి రోడ్డు, రైలు, చివరకు నాటుపడవల ద్వారా సైతం సారాను జిల్లాకు చేర్చుతున్నారు. ఒడిశాలోని గోపాల్పూర్ తీరం నుంచి రణస్థలం మండలం దోనిపేట తీరానికి సారా నిల్వలు చేర్చారంటే రవాణా ఏ రేంజ్లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
మూతపడిన చెక్‌పోస్టులు
జిల్లా ఒడిశాకు ఆనుకుని ఉంది. 30 మండలాల్లో సగానికిపైగా ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. దీంతో జిల్లాలో అక్రమ మద్యం, సారా రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగానికి సిబ్బంది కొరత వేదిస్తోంది. దీంతో పోలీసులే సాధారణ తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. అంతర్ జిల్లా, రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టులను సైతం ఎత్తివేశారు. అక్కడ తనిఖీలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ.. మాజీ సైనికులను ప్రత్యేక పోలీసులుగా నియమించింది. సారా, మద్యం రవాణా నియంత్రణ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆరు నెలల కిందట స్పెషల్ పోలీసులను విధుల నుంచి తొలగించింది. చెక్‌పోస్టులు కూడా మూతపడ్డాయి. దీంతో ఒడిశా నుంచి మద్యం, సారాను జిల్లాకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల మద్యం మాటున నకిలీ మద్యాన్ని తెచ్చి ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం విక్రయాలపైనా పోలీసులు ఆరా తీస్తూ.. వాటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనివెనుక ఒడిశా ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ మద్యం ప్రాణాంతకం
మద్యం ఆరోగ్యానికి హానికరం. నకిలీ మద్యం తాగితే ప్రాణాంతకం. ప్రధానంగా ఊపిరితిత్తులను హరిస్తాయి. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. మత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో రకరకాల రసాయనాలు వినియోగిస్తారు. రంగు కోసం ఉత్ర్పేరకాలను వాడుతారు. అవి చాలా ప్రమాదకరం. అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందుకే వీలైనంత వరకూ మద్యానికి దూరంగా ఉండడమే మంచిది.
- డాక్టర్ కృష్ణచైతన్య, వైద్యాధికారి, పాతర్లపల్లి
..................
దర్యాప్తు చేస్తున్నాం
ఇటీవల తనిఖీల్లో ఓ వ్యాన్‌లో మద్యం పట్టుబడింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వారిచ్చిన సమాచారం మేరకు ఆమదాలవలస మండలం కుద్దిరాంలో నిల్వ ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నాం. మద్యం సీసాలపై తెలంగాణ సీలు ఉంది. ఎస్ఈబీ అధికారులకు సమాచారమిచ్చాం. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం.
- జి.రాజేష్, ఎస్ఐ, జేఆర్ పురం