డేంజర్‌ బెల్స్‌!

ABN , First Publish Date - 2022-01-22T04:48:42+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కొత్త సంవత్సరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ.. సిక్కోలును వైరస్‌ చుట్టేస్తోంది. జిల్లాలో కేవలం పదిరోజుల్లోనే పది రెట్ల మేర పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 1,230 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యవర్గాల్లో సైతం అలజడి రేగుతోంది.

డేంజర్‌ బెల్స్‌!

- జిల్లాలో కరోనా విజృంభణ

- ఒక్కరోజులో 1,230 పాజిటివ్‌ కేసులు

- నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని వైద్య నిపుణుల హెచ్చరిక

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కొత్త సంవత్సరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ.. సిక్కోలును వైరస్‌ చుట్టేస్తోంది. జిల్లాలో కేవలం పదిరోజుల్లోనే పది రెట్ల మేర పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 1,230 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యవర్గాల్లో సైతం అలజడి రేగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 20,39,874 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 1,28,150కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,007 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 120 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 122 మంది  డిశ్చార్జ్‌ అయ్యారు. పదిరోజుల కిందట హోం ఐసోలేషన్‌లో కేవలం వందమందిలోపు బాధితులు ఉండేవారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య వేలల్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రెండో డోస్‌ తీసుకున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, వృద్ధులకు బూస్టర్‌ డోస్‌ వేస్తున్నారు. 15 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో 12 కొవిడ్‌కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో రెండు, టెక్కలి, నరసన్నపేట, ఎచ్చెర్ల, పాతపట్నం, కవిటి, వజ్రపుకొత్తూరు, సీతంపేట, సంతబొమ్మాళి, ఆమదాలవలస, రాజాం ఒక్కో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. బాధితులకు అవసరమైన చికిత్సలు అందజేయనున్నారు.


 బడికి పంపాలా? వద్దా?...

సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 17 నుంచి పాఠశాలలు తెరచుకున్నాయి. కానీ, కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 3.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.  గడిచిన వారం రోజులుగా కేవలం లక్ష మందిలోపు విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. కరోనా కేసులు పెరగడం, ఒమైక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పిల్లలను బడికి పంపడం లేదని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు పరీక్షలు దగ్గర పడుతుండడంతో పాఠశాలలకు పంపాలా? వద్దా? అని కొందరు సతమతమవుతున్నారు. 


 రాకపోకలపై కానరాని ఆంక్షలు...

జిల్లాకు సంక్రాంతి పండుగ సందర్భంగా వేలాది మంది వచ్చి పోతున్నారు. ఆర్డీసీ లెక్కల ప్రకారం ప్రతిరోజు  20 వేలమంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ ద్వారా మరో 5 వేల మందికిపైగా  రాకపోకలు సాగిస్తున్నారు. విదేశాల నుంచి పండుగ సందర్భంగా 1,450 మంది వచ్చి వెళ్లారు. యూరఫ్‌ కంట్రీస్‌ నుంచి వచ్చేవారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా, వారి కదలికలపై పెద్దగా నిఘా లేదనే చెప్పాలి. దీంతో ఒమైక్రాన్‌ వేరియంట్‌ గ్రామాలను సైతం చుట్టేస్తోంది. ఇప్పటికే 63 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు రెండు రోజుల కిందటే ప్రకటించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మరింత ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ఉపాధ్యాయుడుకి కరోనా

సంతకవిటి: సంతకవిటి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల పక్కనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కూడా ఉండడంతో అక్కడి విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-22T04:48:42+05:30 IST