నదుల అనుసంధానం.. ఆలస్యం!

ABN , First Publish Date - 2022-12-09T23:51:21+05:30 IST

నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌ నాటికైనా సాగునీటి విడుదల సాధ్యమవుతుందో? లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నదుల అనుసంధానం.. ఆలస్యం!
బూర్జలో చేపడుతున్న కాలువ తవ్వకాలు

2018 నుంచి కొనసాగుతున్న పనులు

వచ్చే ఖరీఫ్‌ నాటికి సాగునీరు సాధ్యమేనా?

భూ సేకరణకు మంజూరుకాని పరిహారం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

నదుల అనుసంధానం.. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ఎంతో ముందుచూపుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. 2018లో రూ.85కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటిపై దృష్టి సారించలేదు. ఇప్పుడా వ్యయం రూ.145 కోట్లకు పెరిగింది. ఇప్పుడు పనులు నత్తనడక సాగుతున్నాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌ నాటికి సాగునీరందడం అనుమానమే.

................

నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌ నాటికైనా సాగునీటి విడుదల సాధ్యమవుతుందో? లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అన్ని సీజన్‌లలోనూ పూర్తిస్థాయిలో సాగునీరు అందజేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హిరమండలం రిజర్వాయర్‌ నుంచి వంశధార నీటిని.. హైలెవెల్‌ కాలువ ద్వారా మళ్లించి నారాయణపురం ఆనకట్టలో నాగావళి నదిలోకి చేరవేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా 36వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుంది. అదనంగా 5వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు చేరుతుంది. 2018లో రూ.85కోట్ల వ్యయంతో నదుల అనుసంధానం పనులు ప్రారంభించారు. కొంతమేర పనులు చేపట్టారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ పనులపై దృష్టి సారించలేదు. తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా ఏడాదికిపైగా పనులు నిలిచిపోయాయి. ఇలా పనుల జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. దీంతో రూ.145కోట్లతో ప్రతిపాదనలు సవరించారు. ప్రస్తుతం కొత్త ఆయకట్టుతోపాటు నారాయణపురం ఆనకట్ట నుంచి స్థిరీకరణ పనులు సాగుతున్నాయి. హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, బూర్జ మండలాల మీదుగా మొత్తం 33 కిలోమీటర్ల పొడవున కాలువ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 30 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వకాలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించి ఇంకా రూ.5కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. బూర్జ మండలంలో సేకరించిన భూమి దేవదాయశాఖది కావడంతో కాలువ నిర్మాణానికి కొర్రీ పడింది. రైతులు కూడా విడిచిపెట్టడం లేదు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఇటీవల ఈ భూమికి సంబంధించి దేవదాయశాఖ కమిషనర్‌ విచారణ చేపట్టారు. కానీ సమస్య కొలిక్కిరాలేదు.

66 స్ట్రక్చర్లకు 36 పూర్తి...

నారాయణపురం, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి నీరు తగ్గితే.. నదుల అనుసంధానం ద్వారా వంశధార నీటిని నాగావళి నీటితో కలిపేందుకు హైలెవెల్‌ కాలువలో 66 స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 36 స్ట్రక్చర్లను మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 30 స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తయితేనే నీటిని మళ్లించేందుకు వీలుంటుంది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం వచ్చే ఖరీఫ్‌నాటికి నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తిచేస్తామని చెబుతున్నారు. భూసేకరణకు సంబంధించి రూ.5కోట్ల పరిహారంతో పాటు బిల్లుల బకాయిలు చెల్లిస్తేనే పనులు వేగవంతం కానున్నాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

బిల్లుల సమస్యలేదు

నదుల అనుసంధానానికి సంబంధించి బిల్లుల చెల్లింపు సమస్యలేదు. ఇప్పటివరకు రూ.95కోట్ల మేర చెల్లించాం. ఇంకా 20 స్ట్రక్చర్లను నిర్మిస్తే సాగుకు ఇబ్బంది లేకుండా నీటిని మళ్లించవచ్చు. ఈ దిశగా పనులు జరుగుతున్నాయి. కచ్చితంగా 2023 ఖరీఫ్‌ నాటికి నదుల అనుసంధానం పూర్తిచేసి నీటిని విడుదల చేస్తాం.

- డోల తిరుమలరావు, వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ

Updated Date - 2022-12-09T23:51:25+05:30 IST