పట్టుబడిన మద్యం దొంగలు

ABN , First Publish Date - 2022-12-07T23:42:35+05:30 IST

మురపాక ప్రభుత్వ మద్యం షాపులో గత నెల 29న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పది మందిని అరెస్టు చేసి 6,328 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

  పట్టుబడిన మద్యం దొంగలు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాధిక, వెనుకన నిందితులు

లావేరు, డిసెంబరు 7: మురపాక ప్రభుత్వ మద్యం షాపులో గత నెల 29న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పది మందిని అరెస్టు చేసి 6,328 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను లావేరు పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఎస్పీ జీఆర్‌ రాధిక విలేకరులకు వెల్లడించారు. లావేరు మండలం కేశవరాయునిపాలెంకు చెందిన నాయిన సతీష్‌ గత నెల రోజులుగా మురపాక మద్యం షాప్‌కు తాగడానికి వచ్చేవాడు. ఈ షాపులో భారీ మద్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని తన గ్రామానికి చెందిన స్నేహితులు నాయిన ఆదినారాయణ, జీరు శ్రీనివాసరెడ్డి, నాయిన రామారావు, గుజ్జు భాస్కరరావు, నాయిన గోవింద, నాయిన ఆదినారాయణకు, రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బసవ అప్పన్నకు, విశాఖపట్నంకు చెందిన బుచ్చ దుర్గాప్రసాద్‌, పోలవరపు చంద్రరావుకు చెప్పాడు. వీరంతా గత నెల 29న వేకువజామున పోలవరపు చంద్రరావు వ్యాన్‌లో మురపాక మద్యం దుకాణానికి వచ్చారు. షాపు వద్ద కాపలా ఉన్న ఇద్దరు వాచ్‌మన్‌లను బంధించారు. వారిని ఆ షాపు పక్కనే ఉన్న నీలగిరి తోటలోకి తీసుకెళ్లి వారి లుంగీలతోనే కాళ్లు, చేతు లను కట్టేశారు. తరువాత తమ వెంట తెచ్చుకున్న సమ్మెటతో మద్యం దుకాణా నికి కన్నం పెట్టారు. లోపలకు వెళ్లి సుమారు రూ11.62 లక్షల విలువ గల మద్యాన్ని దొంగిలించారు. ఈ సీసాలను వ్యాన్‌లో తీసుకెళ్లి కేశవరాయుని పాలెంలోని ఓ ఇంటిలో దాచిపెట్టారు. ఆ తర్వాత గ్రామ సమీపంలోని ఓ తోటలో ఉన్న వరిగడ్డి వాము కింద దాచి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ నేపథ్యంలో బుధవారం బుడుమూరు జంక్షన్‌ వద్ద వీరందరినీ పట్టుకొని జేఆర్‌పురం సీఐ స్వామినాయుడు అరెస్టు చేశారు. వీరి నుంచి 6,328 మధ్యం సీసాలు, ఆరు చాకులు, ఒక సమ్మెట, ఒక మోటార్‌ సైకిల్‌, ఒక లగేజ్‌ వ్యాన్‌, వాచ్‌మన్‌లకు చెందిన రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ.10,29,600 ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులంతా 22 నుంచి 25 ఏళ్ల వయస్సు వారేనని చెప్పారు. కేసును త్వరగా ఛేదించిన జేఆర్‌పురం, ఆమదాలవలస సీఐలు స్వామి నాయుడు, పైడియ్య, లావేరు, జి.సిగడాం, రణస్థలం, ఎచ్చెర్ల ఎస్‌ఐలు ఎ.కోటేశ్వరరావు, సీహెచ్‌ రామారావు, రాజేష్‌, సత్యనారాయణ, ఏఎస్‌ఐ భుజింగరావుతో పాటు పలువురు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందింది రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ మహేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:42:36+05:30 IST