చెరకు రైతుకు చేదు

ABN , First Publish Date - 2022-12-31T00:30:42+05:30 IST

చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్న చందంగా తయారైంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, వన్యప్రాణుల ఇబ్బందులను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్నా.. సరైన గిట్టుబాటు ధర రావడం లేదు.

చెరకు రైతుకు చేదు
పొందూరు మండలం బురిడికంచరాం వద్ద చెరకును కట్‌ చేస్తున్న దృశ్యం

- గిట్టుబాటు కాని పంట

- టన్నుకు రూ.2,850 చెల్లింపు

- పెట్టుబడులు కూడా రాని వైనం

- కానరాని ప్రభుత్వ రాయితీలు

(ఎచ్చెర్ల)

చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్న చందంగా తయారైంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, వన్యప్రాణుల ఇబ్బందులను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్నా.. సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కూడా కల్పించకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రైతులు ఒకప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా చెరకును సాగు చేస్తూ.. సాఫీగా జీవనం సాగించేవారు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు విరుద్ధంగా మారింది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. మరోవైపు చీడపీడలు, తెగుళ్ల బెడద ఎక్కువై దిగుబడి తగ్గుతోంది. ఇంతకష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో దిగులు చెందుతున్నారు. జిల్లాలో ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, పోలాకి, నరనసన్నపేట తదితర మండలాల్లో చెరకు సాగుచేస్తున్నారు. గతంలో ఈ ప్రాంత రైతులు చెరుకును విస్తారంగా పండించేవారు. అయితే, ఆమదాలవ లస చక్కెర కర్మాగారం మూతపడడంతో విస్తీర్ణం క్రమేణా తగ్గుతూ వస్తోంది. వీరంతా ఇప్పుడు విజయనగరం జిల్లాలోని సంకిలి సుగర్‌ ప్యాక్టరీకి చెరకును పంపిస్తున్నారు. చెరుకు కటింగ్‌ ఆర్డర్‌ వరకు రైతులకు ఇబ్బంది లేకపోయినా, ధర గిట్టుబాటు కావడంలేదని ఆందోళన చెందుతున్నారు.

టన్ను రూ.2,850

చెరకు క్వింటాకు రూ.283, టన్నుకు రూ.2,850 చెల్లిస్తున్నారు. ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కంటే కేవలం 8 రూపాయలు మాత్రమే క్వింటాకు పెంచారు. ఇదీ ఒక పెంపేనా అని రైతులు పెదవివిరుస్తున్నారు. ఎకరాకు 50 టన్నుల వరకు దిగుబడి వస్తే తప్ప పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 టన్నులకు మించి దిగుబడి రావడంలేదని వాపోతున్నారు. ఎకరా చెరకు సాగుకు రూ.15వేలకు పైబడి, కటింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌కు టన్నుకు మరో రూ.2,500 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టన్నుకు రూ.2,850 ధర చెల్లిస్తే పంటను సాగుచేసేదెలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మద్దతు ధరను పెంచాలని కోరుతున్నారు.

కానరాని రాయితీలు

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు దాదాపు రాయితీలన్నీ నిలిపివేశారు. గతంలో పంట పొలంలో బావి తవ్వడానికి, ఆయిల్‌ ఇంజన్లు, పవర్‌ టిల్లర్లు, ఎరువులు, పురుగుల మందులపై రాయితీలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఎలాంటి రాయితీలు లేకపోవడంతో సాగు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చెరుకును సాగుచేసేవారు కనుమరుగయ్యే ప్రమాదముందని చెబుతున్నారు.

గిట్టుబాటు ధర కల్పించాలి

చెరుకుకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇచ్చిన రాయితీలు కూడా నిలిపివేశారు. దీంతో చెరుకు సాగు చేయడం మరింత కష్టమైంది. రైతులను ప్రోత్సహించకపోతే భవిష్యత్‌లో చెరువు సాగు క్రమేణా తగ్గే అవకాశం ఉంది.

- సంపతిరావు గణపతిరావు, చెరకు రైతు, ఎస్‌ఎంపురం, ఎచ్చెర్ల మండలం

Updated Date - 2022-12-31T00:30:44+05:30 IST