కపాసుకుద్ధిలో భరతమాత ఆలయం

ABN , First Publish Date - 2022-08-15T05:16:21+05:30 IST

మండలంలోని కపాసుకుద్ధిలో భరతమాతకు 18ఏళ్ల కిందట ఆల యాన్ని నిర్మించారు.

కపాసుకుద్ధిలో భరతమాత ఆలయం
పూజలందుకుంటున్న భరతమాత


  ప్రతి గురువారం పూజలు, భజన  

 ఏ పని మొదలుపెట్టినా భరతమాతకే తొలి పూజ

 ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్థులు


(కవిటి) 

మండలంలోని కపాసుకుద్ధిలో భరతమాతకు 18ఏళ్ల కిందట ఆల యాన్ని నిర్మించారు. వాస్తవానికి 200 ఏళ్ల కిందట ఇక్కడ భరతమాత వెలసినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో కలరా మహమ్మారి ఈ ప్రాంతాన్ని కబలిస్తున్న పరిస్థితుల్లో గుళ్ల కర్రయ్య అనే వ్యక్తిని భరతమాత ఆవరించి  ఆలయాన్ని నిర్మిస్తే  ఈ మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ పరిస్థితుల్లో స్థానికులంతా భరతమాతను గ్రామంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని చెబుతున్నారు.అప్పటి నుంచి ఏ శుభకార్యం చేసినా, మత్స్యకారులు వేటకు వెళ్లినా, గ్రామంలో ఏ పని ప్రారంభించినా తొలిపూజ భరతమాతకే చేయడం  సంప్రదాయం. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.  గుళ్ల కర్రయ్య కుటుంబసభ్యులే నేటికి  భరతమాతకు దూప, దీప నైవేద్యాలు అందించడం ఆచారంగా వస్తోంది. ఏటా వార్షికోత్సవం రోజున మహిళలు సామూహిక కుంకుమ పూజలు, పూర్ణ కుంభాలతో గ్రామంలో ఊరేగింపు అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి గురువారం భరతమాతకు ప్రత్యేక పూజలు, రాత్రికి భజన కాలక్షేపం నిర్వహిస్తుంటారు. మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

పూర్వీకుల నుంచే..

మా గ్రామంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలిపూజ భరతమాతకే చేయడం ఆనవాయితీ. ఎక్కడా లేని విధంగా భరతమాతకు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నాం. భరతమాతకు పూజ చేసి ఏ పని ప్రారం భించినా శుభం జరుగుతుంది. మా తాత ముత్తాతలు నుంచి భరతమాతకు పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఐదేళ్లకు ఒకసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాం.

- బడే కృష్ణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు, కపాసుకుద్ధి


వంశపారంపర్యంగా పూజలు 

 భరతమాత ఆలయం నిర్మించినప్పటి నుంచి మా కుటుంబానికి చెందిన వాళ్లమే పూజలు నిర్వహిస్తున్నాం. ప్రారంభంలో మా మమ గుళ్ల కర్రయ్య ప్రారంభించారు. గ్రామదేవతగా కొలుస్తూ భరతమాతకు దూపదీప నైవేధ్యాలు అందజేస్తున్నాం. ప్రతి గురువారం గ్రామం నుంచి ఒకరు బాధ్యతగా భజన చేయించి తమ భక్తిని చాటుకుంటున్నారు. గ్రామంలో ఎవరు ఏ శుభకార్యం ప్రారంభించినా తొలి పూజ భరతమాతకు చేయడం ఆనవాయితీ. వేటకు వెళ్లే వారు సైతం ముందుగా భరతమాతకు పూజచేసి వెళ్తారు. అంతా శుభమే జరుగుతుందనే విశ్వాసం.

- గుళ్ల చక్రపాణి, ఆలయ ప్రధాన అర్చకుడు, కపాసుకుద్ధి



Updated Date - 2022-08-15T05:16:21+05:30 IST