నగదు ఏమవుతోంది?

ABN , First Publish Date - 2022-03-17T05:23:48+05:30 IST

నగదు ఏమవుతోంది?

నగదు ఏమవుతోంది?

- కవిటిలో బ్యాంకు ఖాతా నుంచి మాయం

- బెంబేలెత్తుతున్న ఖాతాదారులు

- స్పష్టత ఇవ్వని బ్యాంకర్లు

కవిటి, మార్చి 16 : ఖాతాదారుల డబ్బులకు రక్షణగా నిలవాల్సిన బ్యాంకులో నగదు మాయమవుతోంది. రోజూ క్షణాల్లో వేలాది రూపాయలు ఖాళీ అవుతున్నాయి. ఆ నగదు ఏమవుతుందో? ఎవరి ఖాతాలో జమవుతుందో? తెలియక ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై బ్యాంకర్ల నుంచి కూడా స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కవిటి ఎస్‌బీఐ పరిధిలో ఖాతాదారుల సొమ్ము మాయమవుతోంది. కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులో దాచుకోగా.. దానికి భద్రత లేకపోవడంపై ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు కవిటి మండలం డీజీ పుట్టుగ పంచాయతీలో చందాన పూర్ణచంద్రరావు బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 5న రూ.10 వేలు, 9న రూ.7వేలు చొప్పున మాయమైంది. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఇదే పంచాయతీ జల్లుపుట్టుగ గ్రామానికి చెందిన పూడి చందనం బ్యాంకు ఖాతా నుంచి ఈ నెల 4న సాయంత్రం 6.10 గంటలకు, 6.15 గంటలకు, 6.20 గంటలకు వరుసగా రూ.10 వేలు చొప్పున రెండుసార్లు, రూ.6 వేలు ఒకసారి విత్‌డ్రా చేసినట్టు ఫోన్‌కు సమాచారం వచ్చింది. మళ్లీ 5న మరో రూ.20 వేలు మాయమవడంతో లబోదిబోమంటూ బ్యాంకు మేనేజర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి బ్యాంకులో మిగతా ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తమ సొమ్ముకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. 


90 రోజుల్లో జమ

బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయంపై ఆందోళన వద్దు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 90 రోజుల్లో వారి ఖాతాలకు నగదు జమ చేస్తాం. మొబైల్‌ బ్యాంకింగ్‌ వాడడం, వేలిముద్రలు క్లోనింగ్‌ ద్వారా హ్యాక్‌ చేసి ఉండవచ్చు. ఈ విషయం బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఫోన్‌లో ఓటీపీలు, ఏటీఎం పిన్‌ నెంబర్లు ఎవరు అడిగినా చెప్పవద్దు. 

- అశోక్‌, బీఎం, ఎస్‌బీఐ కవిటి


ఓటీపీ విధానం అమలు చేయాలి

మినీ బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయడం మంచిది కాదు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌తో నగదు మాయమయ్యే ప్రమాదం ఉంది. బ్యాంకర్స్‌ ఓటీపీ విధానం అమలు చేయడం చేస్తే మంచిది. దీనివల్ల కొంతవరకు ఈ దోపిడీని అరికట్టవచ్చు.

- జి.అప్పారావు, ఎస్‌ఐ, కవిటి

Read more