వద్దన్నా.. ‘ఆపరే’షన్లు!

ABN , First Publish Date - 2022-06-02T05:48:27+05:30 IST

‘బిడ్డ ఉమ్మనీరు తాగేసింది. మరోవైపు అడ్డం తిరిగింది. అయినా.. ఏం ఫర్వాలేదు. మంచి ముహూర్తం చూసుకోండి. ఆపరేషన్‌ చేసేస్తాం. లేదంటే తల్లికీ బిడ్డకూ చాలా ప్రమాదం’ - ఇదీ ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణుల కుటుంబ సభ్యులకు వైద్యుల నోట వినిపించే హెచ్చరిక. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఉన్నతాధికారులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలని ఆదేశిస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు ఆపరేషన్లు వద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ప్రసవాల కోసం వెళ్లే గర్భిణుల కుటుంబం నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నారు.

వద్దన్నా.. ‘ఆపరే’షన్లు!

- ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్లు
- సాధారణ ప్రసవానికి ససేమిరా
- గర్భిణుల కుటుంబాలపై ఆర్థిక భారం
- పర్యవేక్షించని అధికారులు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

‘బిడ్డ ఉమ్మనీరు తాగేసింది. మరోవైపు  అడ్డం తిరిగింది. అయినా.. ఏం ఫర్వాలేదు. మంచి ముహూర్తం చూసుకోండి. ఆపరేషన్‌ చేసేస్తాం. లేదంటే తల్లికీ బిడ్డకూ చాలా ప్రమాదం’
- ఇదీ ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణుల కుటుంబ సభ్యులకు వైద్యుల నోట వినిపించే హెచ్చరిక.
ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఉన్నతాధికారులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలని ఆదేశిస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు ఆపరేషన్లు వద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ప్రసవాల కోసం వెళ్లే గర్భిణుల కుటుంబం నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నారు.

---------------
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు సంబంధించిన ఆపరేషన్లు అత్యధికంగా జరుగుతున్నాయి. పండంటి బిడ్డను ప్రసవించాలనే ఉద్దేశంతో గర్భిణులు ప్రతినెలా వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. వైద్యులు సూచించిన తేదీ మేరకు ప్రసవానికి  రెండు రోజుల ముందే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కాగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిబ్బంది.. సాధారణ ప్రసవాల కన్నా,  ఆపరేషన్లకే ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2020-21లో 39,792 ప్రసవాలు, 2021-22లో 40,043 ప్రసవాలు అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరగ్గా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఆపరేషన్లు అత్యధికంగా అయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 2020-21లో 18,802, 2021-22లో 20,339 ఆపరేషన్లు అయ్యాయి. వీలైనంత వరకు గర్భిణుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని.. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలని ఉన్నత వైద్య సిఫారసులు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడం లేదు. సాధారణ ప్రసవం కోసం గంటల తరబడి ఎదురుచూసే ఓపిక కూడా లేకపోవడంతో ఆపరేషన్లు చేసేస్తున్నారు. గర్భిణులకు సంబంధించి ప్రసవాలు, ఆపరేషన్ల సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన విషయం తెలిసిందే. దీంతో వసతుల సౌకర్యం, మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో చాలామంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండరనే ఉద్దేశంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వారికి పరీక్షించి అంతర్గత ఇబ్బందులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మనీరు పోతుందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. ఇలా వివిధ కారణాలు చెబుతున్నారు. దీంతో గర్భిణుల బంధువులు ఆందోళన చెందుతూ.. ఏమి చేస్తే బాగుంటుందని వైద్యులను సలహా అడుగుతున్నారు. దీంతో ఆపరేషన్‌ తప్పదని స్పష్టం చేస్తున్నారు. ముహూర్తం చూసుకుని వస్తే.. ఆ సమయానికి ఆపరేషన్లు చేస్తామని బదులిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణులు ఆపరేషన్లకు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్లు చేస్తూ.. రూ.వేలల్లో బిల్లులు గుంజుతున్నారు.
 
 సమీక్షతో సరి...
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో ప్రతి కార్యక్రమంపైనా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. కానీ జిల్లాలో జరుగుతున్న సిజేరియన్లపై ఏనాడూ సమీక్ష జరగలేదు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు కూడా సమీక్ష చేపట్టిన దాఖలాలులేవు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రం అప్పుడప్పుడు సమీక్షల్లో ఉన్నతాఽధికారులు సూచనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు, సిజేరియన్ల సంఖ్యలో ఎందుకంత వ్యత్యాసం ఉంటుందన్నదీ ఆరాతీయట్లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షించాలని, ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

 
 జిల్లాలో నివేదికలు ఇవీ..
------------------------------------------------------------------------------------------------
ఏడాది    మొత్తం ప్రసవాలు    ప్రభుత్వ ఆసుపత్రిల్లో    ప్రభుత్వ ఆసుపత్రిల్లో    ప్రైవేటు ఆసుపత్రిల్లో        ప్రైవేటు  ఆసుపత్రిల్లో
                                 సాధారణ ప్రసవాలు     ఆపరేషన్లు               సాధారణ ప్రసవాలు         ఆపరేషన్లు
-------------------------------------------------------------------------------------------------
2020-21       39,792        9,495                7522                        3971            18802
2021-22       40,043        8587                    7250                    3807            20339       
ఏప్రిల్‌               2,128        434                        360                      223            1111
---------------------------------------------------------------------------------------

 
పర్యవేక్షణ చేస్తున్నాం
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్లపై సమీక్ష చేస్తున్నాం. అవసరమైతేనే గర్భిణీ ఆరోగ్యపరిస్థితి ఆధారంగా సిజేరియన్‌ చేయాలి. సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమవ్వాలని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి.. హెచ్చరిస్తున్నాం.
- బి.మీనాక్షి, డీఎంహెచ్‌వో

Updated Date - 2022-06-02T05:48:27+05:30 IST