Dasara: దసరాకు ఊళ్లకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా.. మీది ఏపీ అయితే మీకో గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-09-25T19:44:50+05:30 IST

దసరాకు ఊరు వెళ్లే ఏర్పాట్లు చేసుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా..

Dasara: దసరాకు ఊళ్లకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా.. మీది ఏపీ అయితే మీకో గుడ్‌న్యూస్

ఆర్టీసీ దసరా ‘స్పెషల్స్‌’

ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు 

సాధారణ చార్జీలు.. రిజర్వేషన్‌ సౌకర్యం

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలకు స్పెషల్‌ బస్సులు


దసరాకు ఊరు వెళ్లే ఏర్పాట్లు చేసుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ నెల 29 నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. దసరా సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. స్పెషల్‌ బస్సు సర్వీసులు అనడంతో ప్రయాణికులు అధిక ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళనలో ఉన్నారు. కానీ ఈ ప్రత్యేక బస్సులో సాధారణ చార్జీలతోనే ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ప్రకటించింది. రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించింది.


కాకినాడ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ నుంచి తుని పరిసర ప్రాంతాలకు వచ్చే ప్రజల కోసం తుని డిపో నుంచి ఏడు బస్సులు, హైదరాబాద్‌ నుంచి ఏలేశ్వరం ప్రాంతాలకు ఏలేశ్వరం డిపో నుంచి ఏడు బస్సులు, హైదరాబాద్‌ నుంచి కాకినాడ పరిసర ప్రాంతాలకు వచ్చేవారికి 15 బస్సులు, తిరుగు ప్రయాణానికి మరో 15 బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ దుర్గ గుడికి తుని నుంచి 20 బస్సులు, ఏలేశ్వరం నుంచి 15బస్సులు, కాకినాడ నుంచి 30 బస్సు సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నుంచి కాకినాడ వచ్చేవారికోసం, దసరా తర్వాత హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే వారి సౌకర్యార్థం కాకినాడ డిపో నుంచి స్పెషల్‌ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యమైన దూరప్రాంత రూట్లలో స్పెషల్‌ బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేశామ న్నారు. దసరా సందర్భంగా విజయవాడ భవాని భక్తులకు వారు కోరిన చోట నుంచి అద్దె ప్రాతిపదికన బస్సులు ఇస్తామన్నారు. వివరాలకు 99592 25543, 98592 25564, 73829 10778, 73829 10869 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.


ప్రైవేట్‌ బస్సులపై నిఘా

దసరాకు ప్రైవేట్‌ బస్సు యాజమాన్యాలు బస్సు చార్జీలు అధికంగా పెంచకుండా ఉండేలా పోలీసులు, ఆర్టీవో అధికారుల సహకారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాం.


-ఎం.శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి

Updated Date - 2022-09-25T19:44:50+05:30 IST