వంశధారకు కోత

ABN , First Publish Date - 2022-12-05T00:15:25+05:30 IST

వంశధార నది గట్టు కోతకు గురవుతోంది. ఎల్‌.ఎన్‌.పేట మండలం వాడవలస వద్ద నదిలో నిర్మించిన గ్రోయిన్స్‌ గోడ శిథిలావస్థకు చేరుకుంది.

వంశధారకు కోత
వాడవలస గ్రామంవద్ద కోతకు గురై వేళ్లు కనిపిస్తున్న మర్రిచెట్టు

శిథిలమైన గ్రోయిన్స్‌.. దెబ్బతిన్న గట్లు

(ఎల్‌.ఎన్‌.పేట)

వంశధార నది గట్టు కోతకు గురవుతోంది. ఎల్‌.ఎన్‌.పేట మండలం వాడవలస వద్ద నదిలో నిర్మించిన గ్రోయిన్స్‌ గోడ శిథిలావస్థకు చేరుకుంది. గ్రామ సమీపంలో నది చెంత ఉన్న మర్రిచెట్టు వద్ద గట్టు కోతకు గురికాకుండా ఉండేందుకు రాళ్లతో ర్యాంపు నిర్మించారు. ప్రస్తుతం ఆ ర్యాంపు కూడా కోతకు గురై రాళ్లు తేలిపోతున్నాయి. వరద ఉధృతి ఏమాత్రం పెరిగినా.. గండి పడి.. తమ గ్రామానికి ముప్పు తప్పదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తారు. వాడవలసతో పాటు మిరియాపల్లి, దబ్బపాడు, లక్ష్మీనర్సుపేట, పెద్దకోట, బసవరాజుపేట తదితర నదీ తీరప్రాంత గ్రామాల్లో కూడా ఇదే దుస్థితి. వరదల సమయంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు నదీ తీర ప్రాంత గ్రామాలను పరిశీలిస్తారు. వంశధార నదికి వరదనీటి ముప్పు లేకుండా కరకట్టలు నిర్మిస్తామని హామీలు ఇస్తారు. కానీ అవి కార్యరూపం దాల్చడం లేదని వాడవలసకు చెందిన సీహెచ్‌ భాస్కరరావు, పి.మల్లేశ్వరరావు, ఎ.రమణ, ఎన్‌.రామారావు, బి.నారాయణరావు తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరకట్టలు నిర్మించాలని కోరుతున్నారు.

భయాందోళనలతో..

వర్షాకాలం వచ్చిందటే రాత్రింబవళ్లు భయాందోళనతో గడపవలసిందే. వంశధార నదికి ఏ రోజు ఏ రాత్రి వరదనీరు వచ్చి గట్టు కొట్టుకుపోతుందో తెలియని పరిస్థితి. వరదనీరు ఉధృతంగా వచ్చినప్పుడు రాత్రి సమయాల్లో నది గట్టుపై ఉన్న మర్రిచెట్టు వద్ద గ్రామస్థులమంతా కాపలా కాస్తాం.

- పి.మల్లేశ్వరరావు, వాడవలస గ్రామం, ఎల్‌.ఎన్‌.పేట

అమలుకాని హామీలు

వంశధార నదికి వరదలు వచ్చిన సమయంలో గ్రామాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు కరకట్టలు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ, ఆ హామీలు అమలుకావడం లేదు. ఏటా వర్షాకాలంలో నది గట్టు కోతకు గురవుతూనే ఉంది.

పి.అప్పలనాయుడు, దబ్బపాడు గ్రామం, ఎల్‌.ఎన్‌.పేట

Updated Date - 2022-12-05T00:15:29+05:30 IST