యువకుడిపై బీరు బాటిల్‌తో దాడి

ABN , First Publish Date - 2022-10-15T05:14:16+05:30 IST

ఒక యువకుడిపై మరో యువకుడు బీరు బాటిల్‌తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతని తలపై మోదడంతోపాటు, వీపుపైనా పొడిచాడు. క్షతగాత్రుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు చేరుకోగా బంధువులు అక్కడికి వచ్చి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన సింగరాయకొండలో శుక్రవారం చోటుచేసుకుంది.

యువకుడిపై బీరు బాటిల్‌తో దాడి
క్షతగాత్రుడు పవన్‌

తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు 

ఇటీవల హత్యకు గురైన రవితేజపై వ్యాఖ్యలే కారణం

పరారీలో నిందితుడు


సింగరాయకొండ, అక్టోబరు 14 : ఒక యువకుడిపై మరో యువకుడు బీరు బాటిల్‌తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతని తలపై మోదడంతోపాటు, వీపుపైనా పొడిచాడు. క్షతగాత్రుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు చేరుకోగా బంధువులు అక్కడికి వచ్చి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన సింగరాయకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు..  సింగరాయకొండ బస్టాండ్‌ వెనుక వైపు బ్యాగుల దుకాణం నడుపుతున్న పెండ్యాల పవన్‌, సింగరాయకొండకు చెందిన షేక్‌ షరీఫ్‌, సోమరాజుపల్లి పంచాయతీలోని ఆవులవారిపాలెంకు చెందిన శీలం రవి మిత్రులు. వీరికి కొద్దిరోజుల క్రితం జాతీయ రహదారిపై హత్యకు గురైన పసుపులేటి రవితేజతో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇటీవల రవితేజనుద్దేశించి పవన్‌... పోతేపోయాడులే అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పవన్‌ దుకాణం వద్దకు  రవితేజ బంధువైన శీలం రవి వెళ్లి బెదిరించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా శుక్రవారం తన మరో స్నేహితుడైన షేక్‌ షరీ్‌ఫను పంపి మాట్లాడాలని పవన్‌ను బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న మద్యం దుకాణం వద్దకూ పిలిపించాడు. తరువాత పక్కనే ఉన్న మరో దుకాణంలోకి తీసుకెళ్లారు. వెంటనే రవితేజపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తావా అంటూ పవన్‌ తలపై రవి బీరు బాటితో దాడి చేశాడు. బాఽధితుడు అక్కడ నుంచి వెనుదిరిగే క్రమంలో వెనుకవైపు నుంచి మరలా విచక్షణా రహితంగా వీపుపై పొడిచాడు. అనంతరం అక్కడ నుంచి రవి, షరీఫ్‌ పరారయ్యారు. బాధితుడు గాయాలతో నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకొన్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి వచ్చి 108లో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంటనే సీఐ రంగనాథ్‌, ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తనను కులం పేరుతో దూషించి, చంపడానికి బీరుబాటిల్‌తో రవి దాడి చేశాడని బాధితుడి పవన్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు, హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


పోలీసుల వైఫల్యంపై విమర్శలు

సింగరాయకొండ జాతీయ రహదారిపై గత నెల 22న వైసీపీకి చెందిన పసుపులేటి రవితేజను అధికారపార్టీకి చెందిన ప్రత్యర్థులే లారీతో డీకొట్టి హత్య చేశారు. అనంతరం చోటుచేసుకున్న పలు పరిణామాలను అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అప్పటి సీఐ మర్రి లక్ష్మణ్‌పై వేటు పడింది. ఎస్పీ మలికగర్గ్‌ లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ  చేశారు. హత్య జరిగి నెల కూడా గడవక ముందే మరలా బస్టాండ్‌ సెంటర్‌లో యువకుడిపై బీరు బాటిల్‌తో దాడి చేయడం చర్చనీయాంశమైంది. పోలీసుల ఉదాసీనత వైఖరి వలనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

Read more