ఏప్రిల్ కల్లా మీ చిట్టా విప్పుతా!
ABN , First Publish Date - 2022-12-16T22:52:36+05:30 IST
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్ష కోసం నెలనెలా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లతో నిర్వహించే సమీక్షా సమావేశాన్ని 76 రోజుల తర్వాత శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించారు. ఎప్పటిలాగే మరొకరికి అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచి చివర వరకు మాట్లాడే సీఎం జగన్ ఈసారి కూడా అలానే చేశారు. తొలుత ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లకు వచ్చే ఏప్రిల్ నాటికి మీ జాతకచక్రంపై ప్రత్యేక నివేదికలు తెప్పిస్తానని స్పష్టం చేశారు. మీ పనితీరు, లోపాలు, ప్రజల్లో, కేడర్లో మీకున్న బలాలేంటో తేటతెల్లమవుతాయి.. తదనుగుణంగా బరిలో ఉండేదెవరో పోయేదెవరో అప్పుడే తేల్చేస్తానని స్పష్టం చేశారు.
ఉండేదెవరో అప్పుడు తేలుద్ధి
ఎమ్మెల్యేలను హెచ్చరించిన జగన్
గడపగడపలో వెనుకబడ్డ మంత్రి, మరో నలుగురు ఎమ్మెల్యేలు
రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన రావి
తిరిగిన రోజులు తగ్గిస్తున్నారంటూ ఎమ్మెల్యేల ఆవేదన
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్ష కోసం నెలనెలా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లతో నిర్వహించే సమీక్షా సమావేశాన్ని 76 రోజుల తర్వాత శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించారు. ఎప్పటిలాగే మరొకరికి అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచి చివర వరకు మాట్లాడే సీఎం జగన్ ఈసారి కూడా అలానే చేశారు. తొలుత ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లకు వచ్చే ఏప్రిల్ నాటికి మీ జాతకచక్రంపై ప్రత్యేక నివేదికలు తెప్పిస్తానని స్పష్టం చేశారు. మీ పనితీరు, లోపాలు, ప్రజల్లో, కేడర్లో మీకున్న బలాలేంటో తేటతెల్లమవుతాయి.. తదనుగుణంగా బరిలో ఉండేదెవరో పోయేదెవరో అప్పుడే తేల్చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన గడపగడపకులో ముందు ఎవరు ఉన్నారు, వెనకెవరు ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావించారు. గడచిన 76 రోజుల్లో 20 రోజులు కూడా కార్యక్రమం నిర్వహించని జాబితాలో మంత్రి సురే్షతోపాటు ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మీరు కనీసం 20రోజులు కూడా తిరగలేదు. ఇలాగైతే ఇబ్బందిపడతారని హెచ్చరించారు. ఎక్కువ రోజులు పాల్గొన్న వారి పేర్లునూ ప్రకటించారు. అందులో రాష్ట్రంలోనే 2వ స్థానంలో పర్చూరు ఇన్చార్జ్ రావి రామనాథంబాబు నిలిచారు. బాగా తిరుగుతున్న వారిని అభినందిస్తూనే, తిరగని వారు రానున్న మూడు నాలుగు నెలల్లో పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో మీరే నష్టపోతారు, మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేరని సూటిగా చెప్పారు.
రామనాథంబాబు ఒక్కరే..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం బాగా నిర్వహించిన తొలి 20మందిలో ఒక్క పర్చూరు ఇన్చార్జ్ రామనాథంబాబు మినహా మరెవ్వరూ లేకపోవటం మంత్రితో సహా ఐదుగురు ఎమ్మెల్యేలు 20 రోజులు కూడా తిరగకపోవటంతో సహా ఇతరత్రా తన చేతిలో ఉన్న సమాచారం దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లను సూటిగానే హెచ్చరించినట్లు చెప్తున్నారు. దీనికితోడు గడపగడపకు కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లాల్సిందేనన్న అంశాన్ని ప్రస్తావించి మీకు ఓటు వేయడని తెలిసినా, ప్రత్యర్థి నాయకుడైనా వారి ఇంటికి కూడా వెళ్లి మనం చేస్తున్న సంక్షేమ ఫలాలను వివరించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ కారణంతో కొందరి ఇళ్లను వదిలేస్తే ఆ మేరకు కార్యక్రమ నిర్వహణలో వెనుకబడినట్లు అవుతారని కూడా చెప్నారు.
ఇలా అయితే ఎలా ?
ఇదిలాఉండగా ఎమ్మెల్యేల్లో కొందరు అధికారులు పూర్తయిన జాబితా నుంచి కొన్ని సచివాలయాలను తొలగించటం తాము కార్యక్రమం నిర్వహించిన అన్ని రోజులను పరిగణనలోకి తీసుకోకపోవటంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన పనులు మంజూరుచేయకుండా అధికారులు ఇచ్చిన కొన్ని పనులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పటంపై ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు మధనపడుతున్నారు. అంతేగాక తెలిసి తెలిసి గ్రామాల్లో విపక్ష టీడీపీకి చెందిన ముఖ్యనాయకుల ఇళ్లకు వెళ్తే గ్రామాల్లోని పార్టీ నాయకులు ఎలా అంగీకరిస్తారని ఆ విషయంలో అధినేత నిర్ణయం సరైంది కాదని చర్చించుకోవటం వినిపిస్తోంది. తాము సూచించిన పనులు కాకుండా అధికారులు ఇచ్చిన జాబితాలోని పనులను మంజూరు చేస్తామని సీఎం చెప్పటం కూడా సరైన నిర్ణయం కాదంటూ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు.