పురుగు దడ మందులు దడ

ABN , First Publish Date - 2022-01-03T05:47:03+05:30 IST

వ్యవసాయం వ్యయసాయంగా మారింది.. ఏటికేడు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా అందుకు అనుగుణంగా ధరలు లభించకపోవడం రైతులను కుంగదీస్తోంది. మరోవైపు ప్రకృతి ప్రతికూలత తీవ్రంగా దెబ్బతీస్తుండగా ప్రభుత్వం నుంచి అవసరమైన చేయూత కరువైంది. ఈ నేపథ్యంతో ఎరువులు, పురుగు మందుల కంపెనీలు ధరలను పెంచి ఎడాపెడా బాదేస్తున్నాయి. అన్నదాతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.

పురుగు దడ    మందులు  దడ
పురుగుమందుల డబ్బాలు (ఫైల్‌)

భారీగా ధర పెంచిన కంపెనీలు

సగటున 10శాతం వడ్డన

ఇప్పటికే 40శాతం మేర 

బాదేసిన ఎరువుల కంపెనీలు 

పెరగనున్న సాగు వ్యయం

జిల్లా రైతులపై ఏడాదికి

రూ.50కోట్ల అదనపు భారం 

ఒంగోలు (జడ్పీ), జనవరి 2 :


ప్రకృతి ప్రతికూలత, పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన అన్నదాతలపై మరో పిడుగు పడింది. పురుగు మందుల కంపెనీలు ధరలను భారీగా పెంచేశాయి. గతంలో ఉన్న రేట్ల కంటే పదిశాతం అదనంగా బాదేశాయి. ప్రతిదానిపై రూ.100 నుంచి రూ.200 వరకూ వడ్డించాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు మరింత అధికం కానున్నాయి. రెండు నెలల క్రితం ఎరువుల ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ వంటి వాటితోపాటు వ్యవపాయ ఉపకరణాల రేట్లు సైతం ఎగబాకాయి. ఇప్పుడు ఆ జాబితాలో పురుగుమందులు కూడా చేరడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత నవంబర్‌లో కురిసిన వరుస వర్షాలకు పంటలు దెబ్బతిని, ఉన్న వాటిపై తెగుళ్లదాడి తీవ్రమై పుట్టెడు కష్టాల్లో ఉన్న సమయంలో ధరల పెంపు శరాఘాతంలా మారింది. 


 వ్యవసాయం వ్యయసాయంగా మారింది.. ఏటికేడు పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా అందుకు అనుగుణంగా ధరలు లభించకపోవడం రైతులను కుంగదీస్తోంది. మరోవైపు ప్రకృతి ప్రతికూలత తీవ్రంగా దెబ్బతీస్తుండగా ప్రభుత్వం నుంచి అవసరమైన చేయూత కరువైంది. ఈ నేపథ్యంతో ఎరువులు, పురుగు మందుల కంపెనీలు ధరలను పెంచి ఎడాపెడా బాదేస్తున్నాయి. అన్నదాతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. 

ఇప్పటికే భారీ పెరిగిన పెట్టుబడి ఖర్చులు 

 ఈఏడాది పెట్రోలు, డీజిల్‌ ధరలతోపాటు, కూలిరేట్లు పెరగంతో సేద్యపు ఖర్చులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. అయినప్పటికీ రైతులు వెనుకాడకుండా పంటలు సాగు చేశారు. రెండు నెలల క్రితం ఎరువుల కంపెనీలు ధరలను పెంచి భారం మోపాయి. ఆ మోత మోయలేక అల్లాడుతున్న అన్నదాతలను వరుస వాయుగుండాల ప్రభావంతో కురిసిన వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అనేక పంటలు వర్షార్పణం అయ్యాయి. ఇప్పుడు తెగుళ్లు, చీడపీడల బెడద అధికమైంది. ఈ నేపథ్యంలో మిగిలి ఉన్న పంటలను దక్కించుకునేందుకు పడరానిపాట్లుపాడుతున్న సమయంలో పురుగుమందుల కంపెనీలు ధరలు పెంచడం కన్నీరు తెప్పిస్తోంది. 

ముడి పదార్థాల ధరలు పెరగడమే కారణం

పురుగు మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు అధికశాతం జపాన్‌, చైనా తదితర దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. వీటి ధరలు ఇటీవల పెరిగాయి.  ఈ కారణంగానే దేశీయంగా పురుగుమందుల ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. దీనికితోడు ఇంధన ధరలు ఎగబాకిన ప్రభావంతో రవాణా ఖర్చులు పెరిగి ఽఅది ధరలపై పడింది. కరోనా తదనంతర పరిణామాల నేపథ్యలో విదేశాలలో సైతం ముడిపదార్థాల కొరత తలెత్తిందని అందువల్లే రేట్లు పెరుగుతున్నాయని కూడా వ్యాపారులు అంటున్నారు. 

ప్రభుత్వం ప్రేక్షకపాత్ర

గతంలో ఎరువుల ధరలు పెరిగినప్పుడు కొన్నింటిపై కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచేది. దీంతో రైతులకు కొంత ఊరట లభించేది. కానీ రసాయన మందుల విషయంలో అలాంటి రాయితీలేవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పురుగుముందుల ధరల పెరుగుదలతో రైతులకు పెట్టుబడి ఖర్చుల్లో భారీ తేడా రానుంది. ఎకరానికి దాదాపు రూ.2,500 వరకూ అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అదే మిర్చికి అయితే రూ.3,500 వరకు పెట్టుబడి అదనంగా అవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో ఏటా పురుగు మందుల కోసం రైతులు రూ.500కోట్ల వరకూ వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం పురుగు మందుల ధరలు పెరగడం వలన మరో రూ.50కోట్ల వరకూ రైతులపై భారం పడనుంది. 

ఈసారి పెరిగిన పురుగుమందుల వాడకం

జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో వరుస వర్షాలు కురిశాయి. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ప్రస్తుతం తెగుళ్లు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే మిర్చి చాలా వరకూ తుడిచిపెట్టుకుపోగా, మిగిలిన పంటపై కూడా రకరకాల తెగుళ్లు దాడి చేస్తున్నాయి. రైతులు గతంలో కన్నా అధికంగా పురుగుమందులను పిచికారీ చేయాల్సి వస్తోంది. పత్తిపై గులాబీ తెగులు ఆశించడంతో రైతులు అధికంగా మందులను వాడాల్సి వచ్చింది. అయినప్పటికీ దిగుబడులు తగ్గిపోయాయి. ఇలా చీడపీడల నుంచి పంటను కాపాడుకొనేందుకు గతం కంటే అధికంగా వినియోగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ధరలు పెరగడం ‘మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు’ అయ్యింది.

వాణిజ్య పంటల సాగుదారులపై మరింత భారం

పురుగు ముందుల పెరుగుదల ప్రభావం వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి సాగుదారులపై అధికంగా పడనుంది. ఈ రెండు పంటలకు తెగుళ్లు, చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. వరికి సైతం క్రమం తప్పకుండా మందులను పిచికారీ చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని రైతులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ధరలను పెంచడంతో పెట్టుబడి ఖర్చులు అధికంకానున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

పురుగు మందుల ధరలు ఇవీ

 (లీటరుకు రూ.లలో)

మందుపేరు                         పాతధర                     కొత్తధర

ఎసిఫేట్‌                              520                         620

ఇమిడాక్లోప్రిడ్‌                        1000                        1200

మోనో క్రోటోపాస్‌                      370                        450

గ్లైఫోనిల్‌                             470                          570

రైతులపై పెనుభారం

వ్యవసాయ సంబంధమైన అన్నింటి ధరలు పెరగడంతో రైతులకు సేద్యం పెనుభారంగా మారింది. ఇప్పటికే ఎరువుల రేట్లు పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలకు కళ్లెం లేకపోవడంతో యాంత్రీకరణ మందగించింది. ఇప్పుడేమో పురుగు మందుల ధరలు పెరిగాయి. రైతుకిచ్చే మద్దతు ధరలు మాత్రం పెరగకపోగా పెట్టుబడి ఖర్చులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల కట్టడికి పటిష్ట కార్యాచరణ రూపొందించాలి. 

గాలి వెంకట్రామిరెడ్డి,  రైతు సంఘం జిల్లా కార్యదర్శి  


Updated Date - 2022-01-03T05:47:03+05:30 IST