మహిళలు.. క్రీడారాణులు

ABN , First Publish Date - 2022-06-12T06:49:14+05:30 IST

పురుషులకు దీటుగా మహిళలు క్రీడల్లో ప్రతిభచూపుతున్నారు. అయితే వారంతా 30ఏళ్లకు పైబడిన వారు కావడం, ఉద్యోగాలు చేస్తుండటం విశేషం.

మహిళలు.. క్రీడారాణులు
డోల శ్యామలా దేవి

అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న గృహిణులు

అథ్లెటిక్స్‌లో పలువురు విశేష ప్రతిభ

ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి బాధ్యతలు

అయినా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ పతకాలు

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వైనం

ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఉద్యోగం చేయటం సాధారణమే. అనేకమంది ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్‌, ప్రైవేటురంగాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. అదేసమయంలో కుటుంబ బాధ్యతలూ నిర్వర్తిస్తున్నారు. అయితే అటు ఉద్యోగిగా, ఇటు గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సైతం రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మన జిల్లాకు చెందిన కొందరు మహిళలు. అయితే వీరేమీ చిన్న వయసు వారు కాదు. అందరూ 30ఏళ్లకు పైబడిన వారే. ఇక వీరు రాణిస్తున్నది కూడా పురుషులే ఎంతో కష్టపడే ’అథ్లెటిక్స్‌’లో. నిత్య సాధనతో ఇదంతా సాధిస్తున్నారు. విశేష ప్రతిభ చూపుతూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు, ప్రశంసలు అందుకుంటున్నారు. 

ఒంగోలు(కల్చరల్‌), జూన్‌ 11: పురుషులకు దీటుగా మహిళలు క్రీడల్లో ప్రతిభచూపుతున్నారు. అయితే   వారంతా 30ఏళ్లకు పైబడిన వారు కావడం, ఉద్యోగాలు చేస్తుండటం విశేషం. జావలిన్‌త్రో, డిస్కస్‌త్రో, ట్రిపుల్‌ జంప్‌, పరుగుపందెం, షాట్‌పుట్‌, నడక, హేమర్‌త్రో వంటివి అథ్లెటిక్స్‌ కిందకు వస్తాయి. వీటిలో రాణించటానికి ఎంతో శక్తి, పట్టుదల, కృషి కావాలి. దీనితోపాటు ఒక క్రమబద్ధమైన శిక్షణ సైతం అవసరం. అనేక పెద్దనగరాల్లో వీటిలో శిక్షణనివ్వటానికి ప్రత్యేకంగా కోచ్‌లు, శిక్షణ కేంద్రాలు ఉంటాయి. అయితే మన జిల్లాలో ప్రత్యేకంగా అటువంటి శిక్షణ కేంద్రం అంటూ ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలోనూ జిల్లాకు చెందిన పలువురు గృహిణులు ఎవరికి వారే మెళకువలు తెలుసుకుంటూ స్వయంకృషితో రాణిస్తున్నారు. ఒకపక్క ఉద్యోగాలు చేస్తూనే మరోపక్క క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా మలేషియా వంటి దేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో సైతం వీరు పాల్గొని ప్రశంసలు అందుకుంటూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. అయితే ఒంగోలులోని ప్రకాశం డిస్ట్రిక్ట్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ వీరికి కావాల్సిన సలహాలు, సూచనలు, సహకారాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా అసోసియేషన్‌ కార్యదర్శి పి.శివశంకర్‌రావు ఎంతో చొరవచూపుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. అలా అథ్లెటిక్స్‌లో రాణిస్తు న్న మన జిల్లా మహిళా మణులు కొందరి గురించి చూద్దాం.


డోలా శ్యామలా దేవి 

శ్యామలాదేవి  మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. 35 సంవత్సరాల విభాగంలో 2019లో మలేషియాలో జరిగిన అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొన్నారు. ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఆమె ప్రశంసాపత్రాన్ని, బహుమతులను సాధించారు. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజల్లో అవగాహన తీసుకురావటానికి ఆమె అనేక పాటలను రచించారు. 


అల్లాడి శిరీషకుమారి

చీమకుర్తి మండలం ఆర్‌ఎల్‌పు రం ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరక్టర్‌గా పనిచేస్తున్న శిరీషకుమారి ఎంతో పట్టుదలతో కృషిచేస్తూ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నా రు. ఈమె 35ఏళ్ల విభాగంలో షార్ట్‌ పుట్‌, డిస్కస్‌త్రో, హేమర్‌త్రో వంటి వాటిలో ఇటు రాష్ట్రస్థాయి, అటు జాతీయ స్థాయిలోజరిగిన అనేక పోటీల్లో పాల్గొని బహుమతుల ను, మెడల్స్‌ను సాధించారు. అలాగే పలువు రు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీ లకు పంపారు.


భైరపునేని రాజ్యలక్ష్మి

మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఉన్నత పాఠశాలలో రాజ్యలక్ష్మి ఫిజికల్‌ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె 40 సంవత్సరాల విభాగంలో 2019లో మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో 400 మీటర్ల పరుగుపందెం విభాగంలో పాల్గొని పతకం, ప్రశంసాపత్రం సాధించారు. అదేవిధంగా గత నాలుగేళ్లల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో పాల్గొని అనేక మెడల్స్‌ సాధించిన ఘనత రాజ్యలక్ష్మిది. 


కళ్లు రాజేశ్వరి 

ఒంగోలు పశుసంవర్థక శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి సైతం అథ్లెటిక్స్‌లో రాణిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన 42వ జాతీయస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో 40 ఏళ్ల విభాగం, ఐదు కిలోమీటర్ల నడక పోటీల్లో ఆమె పాల్గొని బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. అదేవిధంగా 2018 నుంచి ఇప్పటివరకు అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె మెడల్స్‌ సాధించటం విశేషం.


మేడికొండ సృజన

ఒంగోలు మండలం ముక్తినూతలపాడు హైస్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న సృజన అథ్లెటిక్స్‌లో విశేషంగా కృషిచేస్తూ అనేక బహుమతులు గెలుపొందారు. 40ఏళ్ల విభాగంలో ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జావలిన్‌త్రోలో బంగారు పతకం, షార్ట్‌పుట్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. అదేవిధంగా విద్యార్థులకు, తన తోటి మహిళలకు సైతం ఆమె అథ్లెటిక్స్‌ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు. 


కల్లూరి మేనక 

వృత్తిరీత్యా పోలీసు శాఖలో పనిచేస్తున్న మేనక అథ్లెటిక్స్‌లోనూ  రాణిస్తున్నారు. టంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఉమెన్‌ పీసీగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018లో జరిగిన జాతీయస్థాయి మాస్టర్‌ అధ్లెటిక్స్‌ పోటీల్లో 40ఏళ్ల విభాగంలో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఆమె షాట్‌పుట్‌, హేమర్‌ త్రోలలో విశేష ప్రతిభ కనబరిచి మెడల్స్‌ సాధించారు. ఇక ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలలో సైతం ఆమె పాల్గొని మెడల్స్‌ సాధించారు. 











Updated Date - 2022-06-12T06:49:14+05:30 IST