ఏఎంసీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో?
ABN , First Publish Date - 2022-10-11T06:15:28+05:30 IST
పొదిలి వ్యవసాయమార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఎస్సీ మహిళలకు కేటాయించడంతో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పొదిలి రూరల్ అక్టోబరు 10 : పొదిలి వ్యవసాయమార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఎస్సీ మహిళలకు కేటాయించడంతో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహ రిస్తున్న ముగ్గురు దళిత నేతలు తమ సతీమణులను చైర్మన్ పీఠం ఎక్కించేందుకు శతవిధాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏఎంసీ చైర ్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో వైసీపీ మాజీ మండల అధ్యక్షుడు జి శ్రీను సతీమణి కోటేశ్వరికి రెండు దపాలు అవ కాశం లభించింది. ఈ పర్యాయం కొనకనమిట్ల మండలానికి అవకాశం ఇవ్వాలని ఆ మండల నాయకులు స్థానిక శాసన సభ్యలు ఎదుట పట్టుబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్ధిగా పోటి చేసేందుకు ఉత్సాహం చూపించిన చిరుగూరి కోటేశ్వరరావుకు అప్పట్లో నేతలు సర్దిచెప్పి పోటీనుండి విరమింపజేశారు. నామినేటెడ్ పదవి ఏదైనా అవకాశం కల్పిస్తా మని అప్పట్లో నేతలు హామీ ఇచ్చినట్లు కోటేశ్వ రరావు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే పొదిలి మండలానికి రెండు పర్యాయాలు చైర్మన్ పీఠం కట్టబెట్టారని ఈదఫా కొనకనమిట్ల మండలానికి అవకాశం ఇవ్వాల్సిందేనని ఆ మండల నేతలు మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి ద్వారా తమ ప్రమత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొదిలి మాజీ ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు తన సతీమణికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. పొదిలి వైసీపీ రాజకీయాల్లో ప్రస్తుతం చురుకైన పాత్ర పోషిస్తు ప్రస్తుత ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న గూడూరి వినోద్ తన సతీమణి మాజీ జడ్‌పీటీసి సభ్యురాలు స్వప్నకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమేరకు నేతలు వారి ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తంమీద ముగ్గురు కీలక దళిత నేతల మధ్య చైర్మన్ పీఠంకోసం రసవత్తరమైన రాజకీయపోరు నడుస్తోందని కేడర్ చర్చించు కుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం పోటీ పడుతున్న ముగ్గురు ఆశావహుల్లో ఎవరికి చైర్మన్ పీఠం వరిస్తుందో వేచి చూడాలి.