-
-
Home » Andhra Pradesh » Prakasam » Tobacco is Rs102 per kg-NGTS-AndhraPradesh
-
పొగాకు కిలో రూ.102
ABN , First Publish Date - 2022-10-11T06:48:52+05:30 IST
కర్ణాటకలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

బోర్డు చరిత్రలో రికార్డు స్థాయి ధర
కర్ణాటకలో ప్రారంభమైన కొనుగోళ్లు
పంట ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణం
ఒంగోలు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సీజన్ తొలి రోజున కిలో రూ.202 ధర పలికింది. బోర్డు చరిత్రలో కొనుగోళ్లు ప్రారంభమైన రోజున ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. గత సీజన్ ప్రారంభం రోజున అక్కడ కిలో రూ.185 పలుకగా ఈసారి రూ.202తో మొదలైంది. పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వల్లనే ఈ స్థాయి ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో ప్రస్తుత సీజన్ (2022-23)కు వంద మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. అయితే భారీ వర్షాలు, ఇతర ప్రతికూల కారణాలతో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కేవలం 60 మిలియన్ కిలోలు మాత్రమే పండినట్లు అంచనా. ఈ విషయాన్ని అక్కడి రైతులు ముందుగానే అటు అధికారులు, ఇటు వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. ధరపై వారం నుంచి వారి మధ్య విస్తృత చర్చ సాగింది. నాణ్యత బాగుండటంతోపాటు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు ఇవ్వాలన్న డిమాండ్ అక్కడి రైతుల నుంచి వచ్చింది. దీంతో ఈసారి కిలో రూ.200తో కొనుగోళ్లు ప్రారంభించేలా వ్యాపారులు ఒక నిర్ణయానికి వచ్చి సోమవారం వేలంలో పాల్గొన్నారు. చివరకు కిలో రూ.202తో చేపట్టారు. గతంలో పలు సందర్భాల్లో వేలం మధ్యలో లేదా చివర్లో అటు కర్ణాటక, ఇటు ఆంధ్ర మార్కెట్లో కిలో రూ.200పైన పలికింది. అయితే తొలి రోజున ప్రారంభ ధర రూ.200 దాటడం ఇదే ప్రథమమని అధికారులు చెప్తున్నారు. కాగా కర్ణాటక మార్కెట్ ప్రభావం ఆంధ్రలో ప్రస్తుత పంట సాగుపై చూపే అవకాశం ఉంది.