కొండలనూ కొల్లగొడుతున్నారు!

ABN , First Publish Date - 2022-09-27T05:41:11+05:30 IST

ఒంగోలు మండలంలోని యరజర్ల, సర్వేరెడ్డిపాలెంతోపాటు టంగుటూరు మండలంలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల మధ్యలో కొండలు ఉన్నాయి. వీటిలో విలువైన ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలు కూడా ఉన్నాయి. గతంలో ఐరన్‌ ఓర్‌ తవ్వకాలకు ఒక ప్రముఖ కంపెనీకి ప్రభుత్వం లీజు కూడా ఇచ్చింది.

కొండలనూ కొల్లగొడుతున్నారు!
యరజర్ల కొండపై చేస్తున్న అక్రమ తవ్వకాలు


మట్టిని తవ్వి అమ్ముకుంటున్న వైసీపీ నేతలు

యరజర్ల వద్ద జోరుగా అక్రమ క్వారీయింగ్‌

పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు

చదును చేసిన ప్రాంతాన్నీ వదలని వైనం 

లారీ మట్టి రూ.4వేల వరకూ విక్రయం

నెలకు రూ.2కోట్లకు పైగా ఆర్జన 

పట్టించుకోని అధికారులు 

    (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)


విలువైన ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలు ఉండటంతోపాటు, నిరుపేదలకు నివేశన స్థల పట్టాలు ఇచ్చేందుకు ప్రతిపాదించిన యరజర్ల ప్రాంతంలోని కొండలను వైసీపీ నేతలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. నెలకు రూ.2 కోట్లకుపైగా ఆదాయాన్ని గడిస్తున్నారు. ఒంగోలులోని లేఅవుట్‌లన్నీ ఇప్పుడు ఈ మట్టితో నిండిపోయాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్న వెంచర్లన్నింటిలోనూ ఇదే మట్టి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఆవైపు దృష్టి సారించకపోవడం ఆరోపణలు ఆస్కారం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అక్రమ క్వారీయింగ్‌పై టీడీపీ నేతలు ఒకవైపు, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామస్థులు మరోవైపు వేర్వేరుగా సోమవారం స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. 


 ఒంగోలు మండలంలోని యరజర్ల, సర్వేరెడ్డిపాలెంతోపాటు టంగుటూరు మండలంలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల మధ్యలో కొండలు ఉన్నాయి. వీటిలో విలువైన ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలు కూడా ఉన్నాయి. గతంలో ఐరన్‌ ఓర్‌ తవ్వకాలకు ఒక ప్రముఖ కంపెనీకి ప్రభుత్వం లీజు కూడా ఇచ్చింది. ఆ సంస్థ వారు నిక్షేపాల వెలికితీత ప్రారంభానికి ముందే పలు వివాదాలు చుట్టుముట్టాయి. రాష్ట్ర విభజన అనంతరం గత టీడీపీ హయాంలో అక్కడ ట్రిఫుల్‌ ఐటీ భవనాల నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రయత్నాలు చేశారు. కేంద్రప్రభుత్వ నిబంధనలు అడ్డుగా ఉండటంతో అది సాధ్యం కాలేదు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరానికి చెందిన నిరుపేదలకు అక్కడ నివాస స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి ప్లాట్లు వేశారు. దాని అభివృద్ధికి రమారమి రూ.20 కోట్లకుపైగా నిధులు వెచ్చించారు. అయితే పూర్వకాలంలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాల వెలికితీతకు అనుమతి పొందిన కంపెనీతోపాటు యరజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన కొందరు కోర్టుకెక్కారు. కోర్టు నిర్ణయంతో పట్టాల పంపిణీ ఆగిపోయింది. దీంతో ఆప్రాంతంపై వైసీపీ నేతల కన్ను పడింది. అక్రమంగా కొండను ఎక్స్‌కవేటర్లతో తవ్వి మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. 

రోజుకు 200లకు పైగా టిప్పర్లలో గ్రావెల్‌ తరలింపు

ఐదు గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల నుంచి రోజుకి 200కి పైగా టిప్పర్లలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టిని డిమాండ్‌ను బట్టి రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ విక్రయిస్తున్నారు. టిప్పర్‌ మట్టి సరాసరి ధర రూ.4వేలు వేసుకున్నా నెలకు రూ.2.5 నుంచి రూ.3 కోట్ల మేర గ్రావెల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ డబ్బంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అక్రమంగా రవాణా చేస్తున్న అత్యధికభాగం ఒంగోలు నగరంలోనే విక్రయిస్తున్నారు. 

అధికార పార్టీ నేతలకు చెందిన లేఅవుట్ల చదును 

యరజర్ల వద్ద ఉన్న కొండల వద్ద అక్రమంగా క్వారీయింగ్‌ చేసి తెచ్చిన మట్టితో అధికార పార్టీ నేతల భాగస్వామ్యం ఉన్న లేఅవుట్లన్నింటినీ నింపేశారు. ఒంగోలు నుంచి గుంటూరు వెళ్లే రోడ్డులో కాస్తంత రోడ్డు మార్గానికి తక్కువగా ఉన్న స్థలాన్ని ఇదే గ్రావెల్‌తో చదును చేశారు. ఇక చుట్టుపక్కల ఎక్కడ ఎవరికి అవసరమైనా డబ్బులు తీసుకుని తోలేస్తున్నారు. కొందరు వైసీపీ నేతలు గ్రావెల్‌ను సొంత లేఅవుట్ల అభివృద్ధికి తోలుకుని లబ్ధి పొందుతున్నారు. ఇదంతా పట్టపగలు బహిరంగంగా అధికారులు మిన్నకుండటం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో కిందిస్థాయి నేతలు దగ్గరుండి అక్రమ రవాణా చేయిస్తుండటంతో అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలున్నాయి. ఇటీవలకాలంలో ఈ విషయమై మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులందాయి. అందిన సమాచారం మేరకు ఒకటి రెండు సందర్భాలలో మైనింగ్‌ అధికారులు అక్రమ రవాణా చేస్తున్న నేతలకు ముందస్తు సమాచారమిచ్చి ఆపై సాదాసీదా తనిఖీలు చేసి అంతా బాగుందని ఇక్కడేమీ అక్రమ తవ్వకాలు లేవని చెప్పేసినట్లు తెలుస్తోంది.  

ఆనవాళ్లూ కూడా కన్పించని ప్లాట్లు

ఐదు గ్రామాల మధ్యలో ఉన్న కొండల వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం లేఅవుట్లను ఏర్పాటు చేసింది. 22వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. అక్కడ వారందరూ ఇళ్లు నిర్మించుకునేందుకోసం రూ.20 కోట్లకు పైగా వెచ్చించి ఆ ప్రాంతాన్ని చదును చేయించింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల ప్లాట్ల ఆనవాళ్లు కూడా కన్పించడం లేదు. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నందునే అధికారిక లేఅవుట్లను కూడా ధ్వంసం చేస్తున్నా పట్టించుకోవటం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. 

 

Read more